22, సెప్టెంబర్ 2025, సోమవారం

సమస్య - 5252

 కవి మిత్రులారా,

 ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్

లేదా

సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

6 కామెంట్‌లు:

  1. శా.
    సందోహంబొనరింప నొయ్యన వివస్వంతుండు ప్రాగద్రిపై
    చిందుల్ వేసిడి తీక్ష్ణ హస్తములతో సీమన్ స్ప్రశింపంగ నా
    మందేహాదులు డస్సి పోయిరి వడిన్, మందారముం బోలెడా
    సిందూరమ్ము త్రిశూలమై చెలగుచున్ శిక్షించె దుష్టాత్ములన్‌ !

    రిప్లయితొలగించండి
  2. కందం
    అందమ్మగు కాశ్మీరము
    సందర్శించు పతిఁ జంప సతి ముందరె! జై
    హిందన జవాను, రాలిన
    సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్

    శార్దూలవిక్రీడితము
    అందమ్మెంచియు పహ్లగాముఁ గనఁగా నాలూ మగల్ పోవఁగన్
    గుందంగన్ సతి నుగ్రవాదులొకటై కూల్చన్ బతిన్ గాల్చి, జై
    హిందంచున్ గసి తీరఁగన్ బ్రభుతయే యెంచంగ సంహారమే
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
  3. బందూకుల్ గొని రక్తము
    చిందింపదలంచు దుష్ట శీలుండ్రౌ యా
    బందెలమారుల ద్రుంచన్
    సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్.


    నిందల్ వేయుచు శత్రు దేశమనుచున్ నిత్యమ్ము కయ్యమ్ము కై
    బందూకుల్ గొని తీవ్రవాదులనెడిన్ పాపాత్ములే జొచ్చుచున్
    జిందింపన్ రుధిరమ్ము నాగ్రహమునన్ చెండాడ నేర్పాటయెన్
    సిందూరమ్ము, త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్.

    *(ఆపరేషన్ సిందూర్ తీవ్రవాదుల మదమడిచినదని)*


    రిప్లయితొలగించండి
  4. హిందూపౌరులనుగ్రవాద దళముల్ హింసించగా నిర్దయన్
    సందోహమ్ముగ దేశరక్షకులు దీక్షన్బూని బింకమ్ముగా
    సిందూరమ్మను మొగ్గరమ్ము రచనన్జేయంగ స్త్రీశక్తితో
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
  5. సుందరమగు తావసమున
    బందూకులు చేతబూని పరిమార్చిరిగా
    సందేహింపక సాధ్వుల
    సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్

    అందాలన్ దిలకింప వచ్చిరి జనుల్ హర్షాతిరేకంబుతో
    బందూకుల్ గొనివచ్చి చంపిరకటా పాపాత్ములౌ ముష్కరుల్
    సందేహంబుకు తావులేని విధిగా సాధ్వీలలాటంబుపై
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

    రిప్లయితొలగించండి