7, సెప్టెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5237

8-9-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూతన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్”

(లేదా...)

“పూతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య)

6 కామెంట్‌లు:

  1. కందం
    చైతన్యముఁ గొనె రాముని
    దూతయనగఁ దా నహింసతో స్వేచ్ఛనిడెన్
    ప్రీతిని నిత్యముగన బా
    పూ తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్!

    ఉత్పలమాల
    చేతన రామనామమును చిత్తమునందున దల్చి నిత్యమున్
    జాతికి స్వేచ్ఛనిచ్చె తనె సత్యమహింసల నాయుధమ్ముగన్
    జోతలనందె జాతిపిత చూపుచు ధైర్యము దైవమంచు బా
    పూ తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి
  2. ఆతడు రామనవమి యని
    సితా కళ్యాణము జరుప సిద్ధపడుచునే
    చేత పసుపు గైకొని యా
    పూతన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్

    రిప్లయితొలగించండి

  3. స్వాతంత్ర్యమ్మును తనదగు
    జాతికి నందింప నెంచి సత్యాగ్రహమున్
    ప్రీతిని దలదాల్చిన బా
    పూ తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్.


    జాతికి స్వేచ్ఛ గోరుచును శాంతి పథమ్మున తెల్ల వారినే
    భీతిల జేసినట్టి కడు వృద్ధుడు సత్యమహింసలె యాయుధమ్ములై
    నీతిని వీడనట్టి మహనీయుడు నిత్యము గొల్వనెంచి బా
    పూ తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్.

    రిప్లయితొలగించండి
  4. [బొమ్మలతో కూడిన చంపూ కావ్యము వెలువరించిన భావన]

    ఆతడొక చిత్రకుడు కవి
    నూతన కావ్యము సృజించె నోహోయనగా
    రీతిని గమనింపగ చం
    పూ తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్

    ఆతడు వెల్వరించెను మహాద్భుత కావ్యము లెన్నియో మహ
    ర్జాతకు డైన చిత్రకుడు సల్పిన నూతన కావ్య రీతి చం
    పూ తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్
    జాతికి సేవచేసెనని సల్పిరి సత్కృతి నొప్పిదంబునన్

    రిప్లయితొలగించండి
  5. నీ తండ్రి రామ భక్తుడు
    ప్రీతిగ నా నామమునె జాపించెడి వాడౌ
    తాతయె కొలవగ నట బా
    పూ, తన బొమ్మల నిలిపె బ్రభున్ రఘు రామున్.

    తాతయె రామ చంద్రునకు దాసుడ నంచు వచించుచున్ సదా
    ప్రీతిగ వాని నామము జిపించెడి వాడని నీవెఱుంగవే
    నీతికి ప్రాణమిచ్చు మహనీయుడు నిత్యము కొల్వ నెంచి బా
    పూ, తన భక్తి భావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్.

    రిప్లయితొలగించండి
  6. ఆతత భావ ము జూపుచు
    ప్రీతిగ చిత్రించ బూని ప్రేమ గ వేయ న్
    చైతన్య ము గలిగి న బా
    పూ తన బొమ్మల నిలి పె బ్ర భు న్ రఘు రామున్

    రిప్లయితొలగించండి