27, సెప్టెంబర్ 2025, శనివారం

సమస్య - 5257

28-9-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్”
(లేదా...)
“రాముం డెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్”

7 కామెంట్‌లు:

  1. కందం
    శ్రీమన్మంగళ రూపుడు!
    భామిని సీతమ్మకొప్పు భవ్యగుణుండౌ
    ధీమణి! రామునిమించెడు
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్

    శార్దూలవిక్రీడితము
    శ్రీమన్మంగళ దివ్యరూపమున రాజీవాక్షుడై శూరుడై
    భామన్ సీతను రాజులన్ గెలిచి యుద్వాహమ్మునన్ బొందియున్
    గామోద్రేకుని రావణున్ దునిమి రాగన్ రామునిన్మించెడున్
    రాముం డెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్

    రిప్లయితొలగించండి
  2. రాముని రాజ్యము నందున 
    పామరుడయినను నిరతము భక్తిగ గొలువన్ 
    తామసము జూపుటన యభి
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్

    రిప్లయితొలగించండి

  3. దామోదరుడే కదరా
    భూమిని ధర్మము నిలుపగ పురుషోత్తముడై
    యీ మహి బుట్టెను సత్యమె
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్?


    భూమిన్ ధర్మము నిల్పనెంచిగదరా భూభృత్తు డీ ధాత్రిపై
    రాముండై జనియించెనంచు తెలిపెన్ రామాయ ణమ్మందునన్
    క్షేమంబిచ్చెడు వాడొకండె యతడే శ్రీరాముడే యైనచో
    రాముం డెక్కడ లేఁడు? లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్ ?

    రిప్లయితొలగించండి
  4. కం॥ ప్రేమ నొసఁగు దైవ మొకఁడె
    సామాన్యులిది తెలియకనె సాగుదురిలలోఁ
    దామస రూపులనుచు సు
    త్రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్

    శా॥ ప్రేమంబుంచుచు లోక పాలనను సంప్రీతిన్ సదా గాంచెడిన్
    నామంబుల్ ధరయందనేకములు సంధానించినన్ మానవుల్
    సామాన్యంబుగ, దైవమొక్కఁడగు దాశార్హుండు నిక్కమ్ము సు
    త్రాముండెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్

    రిప్లయితొలగించండి
  5. రాముడననొప్పు భృగుపతి
    రాముండననొప్పు శౌరి; రఘువీరుడు శ్రీ
    రాముని మించిన వాడౌ
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్

    రాముండా భృగునందనుండు మరియున్ రాముండనన్ శౌరి శ్రీ
    రాముండే తన తండ్రిమాట కొరకై రాజ్యంబునే వీడె శ్రీ
    రాముండేగెనరణ్యసీమ మరియా రాముండకున్ సాటియౌ
    రాముం డెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్

    రిప్లయితొలగించండి
  6. రాముండే శుభలేఖలందు, మొదటన్ వ్రాయంగ శ్రీరామయౌ,
    రాముండే మరి పల్కరింప, నసువుల్ రాలంగ రాముండెయౌ,
    రాముండే జన జీవనంబుగను సర్వంబయ్యె లోకంబునన్
    రాముం డెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్!!

    రిప్లయితొలగించండి