7, సెప్టెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5237

8-9-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూతన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్”

(లేదా...)

“పూతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్”

(బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి శతావధానంలో ధనికొండ రవిప్రసాద్ గారి సమస్య)

16 కామెంట్‌లు:

  1. కందం
    చైతన్యముఁ గొనె రాముని
    దూతయనగఁ దా నహింసతో స్వేచ్ఛనిడెన్
    ప్రీతిని నిత్యముగన బా
    పూ తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్!

    ఉత్పలమాల
    చేతన రామనామమును చిత్తమునందున దల్చి నిత్యమున్
    జాతికి స్వేచ్ఛనిచ్చె తనె సత్యమహింసల నాయుధమ్ముగన్
    జోతలనందె జాతిపిత చూపుచు ధైర్యము దైవమంచు బా
    పూ తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి
  2. ఆతడు రామనవమి యని
    సితా కళ్యాణము జరుప సిద్ధపడుచునే
    చేత పసుపు గైకొని యా
    పూతన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్

    రిప్లయితొలగించండి

  3. స్వాతంత్ర్యమ్మును తనదగు
    జాతికి నందింప నెంచి సత్యాగ్రహమున్
    ప్రీతిని దలదాల్చిన బా
    పూ తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్.


    జాతికి స్వేచ్ఛ గోరుచును శాంతి పథమ్మున తెల్ల వారినే
    భీతిల జేసినట్టి కడు వృద్ధుడు సత్యమహింసలె యాయుధమ్ములై
    నీతిని వీడనట్టి మహనీయుడు నిత్యము గొల్వనెంచి బా
    పూ తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్.

    రిప్లయితొలగించండి
  4. [బొమ్మలతో కూడిన చంపూ కావ్యము వెలువరించిన భావన]

    ఆతడొక చిత్రకుడు కవి
    నూతన కావ్యము సృజించె నోహోయనగా
    రీతిని గమనింపగ చం
    పూ తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్

    ఆతడు వెల్వరించెను మహాద్భుత కావ్యము లెన్నియో మహ
    ర్జాతకు డైన చిత్రకుడు సల్పిన నూతన కావ్య రీతి చం
    పూ తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్
    జాతికి సేవచేసెనని సల్పిరి సత్కృతి నొప్పిదంబునన్

    రిప్లయితొలగించండి
  5. నీ తండ్రి రామ భక్తుడు
    ప్రీతిగ నా నామమునె జాపించెడి వాడౌ
    తాతయె కొలవగ నట బా
    పూ, తన బొమ్మల నిలిపె బ్రభున్ రఘు రామున్.

    తాతయె రామ చంద్రునకు దాసుడ నంచు వచించుచున్ సదా
    ప్రీతిగ వాని నామము జిపించెడి వాడని నీవెఱుంగవే
    నీతికి ప్రాణమిచ్చు మహనీయుడు నిత్యము కొల్వ నెంచి బా
    పూ, తన భక్తి భావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్.

    రిప్లయితొలగించండి
  6. ఆతత భావ ము జూపుచు
    ప్రీతిగ చిత్రించ బూని ప్రేమ గ వేయ న్
    చైతన్య ము గలిగి న బా
    పూ తన బొమ్మల నిలి పె బ్ర భు న్ రఘు రామున్

    రిప్లయితొలగించండి
  7. (1)కం:నా తనయ యీమె ,యెపుడున్
    మీ తీరౌ చిత్రకళను మెచ్చు, లిఖించెన్
    గీత లెవో, చూడుడు బా
    పూ!తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్”
    (ఒకాయన బాపూ గారికి తన కూతురు ఆయన అభిమాని అని,ఆమె గీసిన బొమ్మలు చూడమని గౌరవం గా అడిగాడు.మళ్లీ గొప్పగా చెప్పుకోక అదేవో గీతలు గీస్తుంది.చూడండి అన్నాడు మర్యాదగా!)
    (2)ఉ:చేతన మందు రాఘవుడు చిన్మయమూర్తిగ వెల్గ లిప్తలన్
    జేతుల నైపుణిన్ బరపి జీవము బోసిన రీతి తెల్గు వా
    రాతని సృష్టి జూచి కడు హ్లాదము నొందగ రేఖ లందు బా
    పూతన భక్తి గన్ బరచి బొమ్మల నిల్పెను రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి
  8. కం॥ వ్రాత పరీక్షను పదముల
    రీతిగ వాక్యము పొసఁగఁగఁ బ్రీతిగ నిడుటన్
    జూతమని యొసఁగ వ్రాసిరి
    ”పూతన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్”

    ఉ॥ వ్రాత పరీక్షయందునను వాక్యముఁ గూర్చఁగఁ దారుమారుగన్
    జూతము మేధనంచు నటు చూప పదమ్ముల బాల బాలికల్
    భ్రాతిగ నెంచి చూచినను బాగుగఁ దోఁచక వ్రాసిరీవిధిన్
    ”పూతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్”

    అందరూ నేను లేచే లోపే బాపూ అని వ్రాసారు. నాకేమీ తోచక Arrange the jumbled words to form a meaningful sentence పరీక్షలో ఇచ్చినట్టుగా తీసుకున్నానండి.

    రిప్లయితొలగించండి
  9. పూతన కనుగొని రాముని
    చేతోమోదంబునొంది చిత్తము నందున్
    బ్రీతిని మానస మందున
    పూతన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్”

    రిప్లయితొలగించండి
  10. పూతన రామునిన్గనగ పుట్టగ క్రోధము చావు కోర ,యే
    పూతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్?
    జేతముఁజెందెనచ్చెరువు చిత్రపు మాటలు విన్గ యిప్పుడున్
    బూతన పెద్దరాక్షసియె భూతల మందున నాలకింపుమా

    రిప్లయితొలగించండి
  11. ఆ తరుణీ మణి యడరిన
    ప్రీతిని బొమ్మల కొలువున వివిధ ప్రతిమా
    వ్రాతములఁ గృష్ణు బొమ్మలఁ
    బూతన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్


    చూతు నవశ్య మంచు నెదఁ జొప్పడ నమ్మక మక్కజమ్ముగం
    బూత చరిత్ర యా శబరి మ్రొక్కుచు వేచుచు వాన రాకకై
    చాతక పక్షి సన్నిభము సత్కవి పుంగవ సుప్రసిద్ధ చం
    పూ తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్

    [సుప్రసిద్ధ చంపూ = మిక్కిలి ప్రసిద్ధ మైన చంపూ కావ్యము కలవాఁడా]

    రిప్లయితొలగించండి
  12. చేతమునందున భక్తిగ
    సీతారాములను నిలిపి చెన్నుగ బొమ్మల్
    ప్రీతిగ గీసిన మన బా
    పూ తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్

    రిప్లయితొలగించండి
  13. చేతమునందు దాశరథి చిన్మయ రూపమునిల్పి భక్తితో
    ప్రీతిగ చిత్రముల్ కనులవిందుగ గీసి కళాత్మకంబుగా
    గీతలలోన జీవమును కెర్లఁగ జేసిన బుద్ధిశాలి బా
    పూ తన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    స్వాతంత్య్రమ్మును భారత
    జాతికి నందించ పోరు సలిపెను శాంతిన్
    ప్రీతిగ భక్తి గనుచు బా
    పూ, తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘు
    రామున్.

    రిప్లయితొలగించండి
  15. నూతన పద్ధతి లోపల
    యాతనమించుకయులేక నవలీలగతా
    చేతనమునవెలసిన బా
    *“పూ తన బొమ్మల నిలిపెఁ బ్రభున్ రఘురామున్”*


    చేతమునందునిల్పుకొని శ్రీరఘు రాముని ఆంజనేయుడే
    సేతువు దాటిసాగుచును సీతను చూచుచు మ్రొక్కిముద్రికన్
    ప్రీతిగనిచ్చిరాగగని వేడుక మీరగ మెచ్చిగీచెబా
    *“పూతన భక్తిభావమున బొమ్మల నిల్పెను రామచంద్రునిన్”*

    రిప్లయితొలగించండి