13, సెప్టెంబర్ 2025, శనివారం

సమస్య - 5243

14-9-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బహుమతిగ నిచ్చెద రపరిపక్వఫలము”

(లేదా...)

“బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్”

20 కామెంట్‌లు:

  1. మ.
    గహనాకల్ప కవిత్వ సంకలిత విక్రాంత స్ఫురత్ప్రజ్ఞచే
    మహిత ద్యోతక శుద్ధ పద్యముల చెప్పం బూను వాడీవెగా
    నహిరాడ్తల్ప మనోజ్ఞ భామ దయతో నానందముం బొందు నే
    బహుమానంబుగ నివ్వఁ గాన పరిపక్వంబౌ ఫలంబే తగున్ !

    రిప్లయితొలగించండి
  2. బాలుడు మనతో వేసిన పందెమందు
    నర్థ నిముష సమయమందు నారు పుటలు
    చదివెదననీ , యైదు పుటలె చదువ గలుగ
    బహుమతిగ నిచ్చెద రపరిపక్వఫలము

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. తేటగీతి
      తగదు తగదన్న సైరంధ్రిఁ దపన తోడ
      మత్స్యభూపతి మోహాన చేరఁ బోవ
      చితుకగొట్టరె గంధర్వ పతులు పట్టి
      బహుమతిగ నిచ్చెద రపరిపక్వఫలము?

      మత్తేభవిక్రీడితము
      దహియింపంగను మోహమే రగిలి కోదండాయుధున్ రామును
      ద్వహమాడంగను చుప్పనాతి యడుగన్ వారించి సౌమిత్రి నీ
      కు హితుండంచని బంపఁగన్ జెవుల ముక్కున్గోయగన్, స్త్రీ యనన్
      బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్!

      తొలగించండి

  4. దూరదేశమేగుచు నున్న తోడు కిపుడు
    బాగుగా ఫలియించిన ఫలము లైన
    పాడగుననుచు తర్వాత వాడుటకయి
    బహుమతిగ నిచ్చెద రపరిపక్వఫలము.


    మహనీయుండగు నాదు మిత్రుడొకడే మాగ్రామమున్ వీడుచున్
    బహరైనేగుచు నుండె నంచతనికిన్ భావమ్ముతో నొక్కటిన్
    బహుమానమ్ముగ పండినట్టి ఫలముల్ పాడౌను కాదందువే
    బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్.

    రిప్లయితొలగించండి
  5. మనసు నపహరించును గద మంచి కాన్క
    ఫలిత మిచ్చుననుచు నమ్మి పలువురిలను
    బహుమతిగ నిచ్చెద రపరిపక్వఫలము
    పచ్చిదే త్వరిత గతిని పండుననుచు

    బహుమార్గంబుల నొందవచ్చు నెలమిన్ బ్రత్యేకతన్ జూపినన్
    మహదానందము నింప మానసమునన్ మార్గాలనేకంబులౌ
    మహరాజైనను సంతసించును గదా మాకందమర్పింపగా
    బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్

    రిప్లయితొలగించండి
  6. బహుదూరంబున నున్న దేశమునకున్ వ్యాపారమున్ జేయగన్
    మహనీయుండు గమించుచుండె సతితో మాగ్రామమున్ వీడుచున్
    మహదానందము తోడ వారికిక సన్మానంబునే జేయుచున్
    బహుమానంబుగ నివ్వగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్

    రిప్లయితొలగించండి
  7. గహనంబౌతన భావనాపటిమయున్ కావ్యంబునం గాననౌ
    బహుళంబౌ ఘన పాండితీ విభవమున్ ప్రజ్ఞాన సౌశీల్యముల్
    మహనీయంబని పచ్చికాయలను సమ్మానంబుగా నెన్నఁడున్
    బహుమానంబుగ నివ్వఁ, గాన పరిపక్వంబౌ ఫలంబే తగున్

    రిప్లయితొలగించండి
  8. బాలకా! వినుమల్లరి చాలునింక
    చదువు నందున మిక్కిలి శ్రద్ధ జూపి
    మంచి విద్యార్థివలెనీవు మారినపుడు
    బహుమతిగ నిచ్చెదర పరిపక్వఫలము

    రిప్లయితొలగించండి
  9. దురిత కృత్యము లొనరించు దుష్టు గాంచి
    పిలిచి వారించి చీవాట్లు పెట్టి యపుడు
    బహుమతి గ ని చ్చె ద రపరి పక్వ ఫలము
    హెచ్చ రించియు వానిని హీను డంచు

    రిప్లయితొలగించండి
  10. మ:బహువైరమ్మును బూని సంస్కరణ పై బాపం డొకం డిట్లనెన్
    "బహుమానమ్ముగ పక్వ మైన ఫలమే భావ్య మ్మగున్,పెండ్లిలో
    బహు దోషమ్ము గదా రజస్వల నిడన్ ! బాల్యమ్మె శ్రేష్ఠమ్మగున్
    బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్”
    (బాల్యవివాహాల నిషేధం జరుగుతున్న రోజుల్లో అష్టవర్షా భవేత్ కన్యా అని రజస్వల కాక ముందే వివాహం శ్రేష్ఠ మని సంప్రదాయవాదులు వాదించే వారు. )

    రిప్లయితొలగించండి
  11. తే.గీ:అమ్మ! నీ దైన ఫలదాన మద్భుతమ్ము,
    నేను దోర జామను తిన లేను, బుధులు
    వృద్ధులకు ఫలముల నిచ్చి పిల్లలకును
    బహుమతిగ నిచ్చెద రపరిపక్వఫలము
    (పిల్లలు దోర జామ కాయల నిష్ట పడతారు.వృద్ధులకి పండినవే ఇస్తారు.)

    రిప్లయితొలగించండి
  12. తే॥ అటుల సతతము నంకిత మౌచు గోష్ఠు
    లందు నాత్మస్తుతికిఁ దగు యాతనఁగని
    తనను తానె పొగడుకొను తపన విరియ
    బహుమతిగ నిచ్చెదరపరిపక్వ ఫలము

    మ॥ అహమే హెచ్చఁగ నేను నేనచును విద్యాగోష్ఠి యందావిధిన్
    విహరించంగను సాటిఁ గాననని ప్రావీణ్యమ్ముఁ జూపించుచున్
    బహు నేర్పున్ గని యాత్మ శంసకు సదా పర్యాప్త సంభావనా
    బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్

    శంస స్తోత్రము (నిఘంటువు సహాయమండి)
    (నేను చూసిన వారిలో కొంతమంది శాస్త్రజ్ఞులు విద్యవేత్తల ప్రవర్తన ననుసరించి యండి)

    రిప్లయితొలగించండి
  13. (3)మ:బహు లోభిత్వము దాని దయ్య !కొసరున్ బాధించుచున్ గోరు, నీ
    సహనమ్మున్ హరియించు బిడ్డ! కొసరున్ సాగింపగా దెల్వినే
    వహియింపన్ వలె పండ్లు వేయ కెపుడున్ పాపిష్టి దౌ దానికిన్
    బహుమానంబుగ నివ్వఁగానపరిపక్వంబౌ ఫలంబే తగున్”
    (అది పరమ లోభి.ఎప్పుడూ కొసరు అడుగుతుంది.దానికి కొసరుగా పళ్లు వెయ్యక పచ్చి కాయలు వెయ్యి అని వ్యాపారి కొడుకు తో అన్నాడు.మానము అంటే తూకము.బహుమానము అంటే ఎక్కువ తూకము అనే అర్ధం తీసుకొన్నాను.)

    రిప్లయితొలగించండి
  14. పరిణయమునఁ బరస్ప రాహ్వానమునకుఁ
    బ్రకటముగను వధూవరు లొకరి కొక ర
    పు డుపవిష్టులై కొబ్బరి బొండ మడరి
    బహుమతిగ నిచ్చెద రపరిపక్వ ఫలము


    దహనాభంబ యపత్య హీన మొసఁగుం దాపం బనూహ్యంబుగా
    నిహ లోకమ్మున సంతు లే కడుగఁ గారింపం దిరస్కారమే
    యహహా యేలనొ మీఱి దత్తునిగ బాల్యావస్థు నింపారఁగా
    బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్

    రిప్లయితొలగించండి
  15. సమస్య:
    బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్.

    మత్తేభము:

    సహజంబే గద యెంచి వేరొకరికిన్ స్వాదంపు పండ్లీయగన్
    సహపంక్తిన్ సరి పూజ సేయుచును పంచంగాను జంఝాటమే
    మహనీయంబని మెచ్చరే జగతినిన్ మాన్యంపు మర్యాదలే
    బహుమానంబుగ నివ్వఁగా నపరిపక్వంబౌ ఫలంబే తగున్.

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    యాత్రకై దూర మేగు ప్రయాణికులకు
    బాగుగా పండినట్టివి పాడగునని
    నాల్గు దినముల నిల్వకై నౙరుగాను
    బహుమతిగ నిచ్చెద రపరిపక్వ ఫలము.

    రిప్లయితొలగించండి
  17. పండినట్టి ఫలమ్ములు త్వరగచెడున
    టంచు రాశిగ సంతలో నధిక జనులు
    జవముగాకొనితెచ్చుచు చక్కగాను
    *“బహుమతిగ నిచ్చెద రపరిపక్వఫలము”*

    రిప్లయితొలగించండి