15, సెప్టెంబర్ 2025, సోమవారం

సమస్య - 5245

16-9-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పూజ్యులను దూరు వారలె పుణ్యజనులు”

(లేదా...)

“దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ”

23 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
ఆ హిరణ్యకశిప రావణాదులెల్ల
హరిని నిరసించి పొందిరి హరిని గాదె!
వైరభక్తిని గతజన్మ బంధమునను
పూజ్యులను దూరు వారలె పుణ్యజనులు!

ఉత్పలమాల
భాషణ భూషణంబనుచు పండితులెల్లరు పల్కుచుండగన్
దూషణ దైత్యులున్ హరిని తొందరఁ జేరిరి వైరభక్తినే
పోషణ జేయుచున్ ముగితి పొందిరి! బంధము పూర్వజన్మదై
దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ!

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
ఘోషల బెట్టి సంఘమును గొబ్బున భీతిల జేయు వారె య
న్వేషణ జేసి మంచికయి వేకువ వోలె శ్రమించి నవ్య సం
తోషమ కోరు ధార్మికుల ద్రుంతురు దుష్టులు, వారి దృష్టిలో
దోషము లేని పూజ్యులను దూరెడి వారలె పుణ్యమూర్తులౌ !

విరించి చెప్పారు...


శాప వశమున నసురులై జయవిజయులె
యనిశమా హరిన్ దూషించి యనఘుడైన
యవ్యయునిచేతను విముక్తు లగుట గాంచ
పూజ్యులను దూరు వారలె పుణ్యజనులు


పోషణ జేయువాడెగద భూజని వానిని వీడజాలకన్
రోషము తోడ శ్రీహరి విరోధులుగా జనియించి వారలే
దూషణజేసి లోకమున దుష్టులుగాను విముక్తి నందిరే
దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ.

Sitharamayya Solasa చెప్పారు...

మనుజులందున నిజమగు మందులనగ
పూజ్యులను దూరు వారలె ; పుణ్యజనులు
వాటినేమాత్ర మైనను బరిగణించ
కుండి < వారి బైజకు నవ్వుకొనెద రెపుడు

Radha krishna Sharma చెప్పారు...

వేషము లెన్నియో సతము వేయుచు పెద్దల గౌరవించకన్
దూషణ చేయచున్ మిగుల దుష్టపు చర్యలొనర్చు చుండి యు
క్రోషముతో చరించుదురు క్రూరులు కొందరు వారి దృష్టిలో
దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ

M.B.G.TILAK చెప్పారు...

బ్రహ్మ మానస పుత్రుల బ్రహ్మదండ
మున దనుజ జన్మమెత్తిన ఘనులుగారె
జయ విజయులు ఘోరంబగు శాపమొంది
పూజ్యులను దూరు వారలె పుణ్యజనులు

జోషము తోడదేవునికి చొప్పడినట్టి మహానుభావులౌ
దోషము లేని ద్వారికుల ధోరణి తెచ్చెను దైత్య జన్మలన్
ద్వేషపు భావనల్ మదిని దీపిలు చుండగ వారు దూరిరే
దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ

Dhanikonda Ravi Prasad చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:పై ప్రదర్శనలను జూచి పరవశించు
జనుల దృష్టికి పాపముల్ చాల జేసి
గుడులలో దూరు, ధార్మిక గురుల నడుమ,
బూజ్యులను దూరు వారలె పుణ్యజనులు”
(దూరటం అంటే తిట్టటం కాక దూరటం అనే అర్ధం లో వాడాను.)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ మోహ చిత్తుఁడై ముదమున ముడివడి యటు
హద్దుఁ గనని యహమునొంది యహరహమును
బరఁగు దుర్యోధను నెదుటఁ బాండు సుతులఁ
బూజ్యులను దూరు వారలె పుణ్యజనులు

ఉ॥ దూషణఁ జేయ సజ్జనులఁ దోషము నొందు సుయోధనుండటుల్
భేషజ మెంతయో కనుచుఁ బేరిమి తోడ నహంకరించడే
రోషముఁ బొంది యచ్చటను రోచన మొందుచుఁ బాండుపుత్రులన్
దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ

ఉ॥ మొదటి పాదములో ద్రుతసంధి వలన తోషము దోషము గా మారినదండి.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ;వేషము లెట్లొ వేసితిరి వీరలు రాముడు సీతగా,మహా
దోషము లెన్నొ జేసితిరి దుర్జనులై నిజ జీవితమ్ములన్
వేషము లందు దైత్యు లయి ,వీరిని తిట్టెడు వారు దోషులే?
దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ”
(సినిమాలో రాముడు,సీత
వేషాలు వేసిన వాళ్లు దుర్మార్గులు.రాక్షస వేషాలు వేసి వీళ్లని తిడుతున్న వాళ్లే అసలు పుణ్యాత్ములు.)

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
“దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ”

ఉ.మా:

ద్వేషము తోడ దానవులు దేవుని దూషణ సేయుచుండగన్
రోషము బూని నామమును రోసెను పుత్రుని నోట విష్ణువన్
వేషపు నారసింహుడును వేడిన హ్లాదుని తండ్రిజంపఁగన్
“దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ”

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'బైజకు'?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'గౌరవించకే' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

వాట్సప్ సమూహంలో సమీక్షించిన పద్యాలను ఇక్కడ ఉపేక్షించినందుకు మన్నించండి.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కరణం రాజే శ్వర రావు చెప్పారు...

దురిత కృత్యము లొన రించి హరిని జేర
మూడు జన్మలలో తాము బూను కొనియు
తుదకు సాధించి రే కద ముదము తోడ
పూజ్యుల ను దూరు వారలె పుణ్య జనులు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నాస్తికత్వము పుడమిపై విస్తరించె
గురువులను భక్తి భావన మరుగుపడెను
కాలమే రీతి మారెనో గాంచినావ!
పూజ్యులను దూరు వారలె పుణ్యజనులు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

దూషణ చేయువారు తమ దోషముఁ గానక నెల్లవేళలన్
తోషమునంద జూచెదరు దూరుచు నన్యుల సిగ్గుమాలి వి
ద్వేషము పాదుకొన్న యవివేకుల దృష్టిపథమ్మునందు నే
దోషము లేని పూజ్యులను దూరెడు వారలె పుణ్యమూర్తులౌ

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

మోసపుచ్చెడి వారలె పుణ్య జనులు
పుర జనుల దోఁచు వారలె పుణ్య జనులు
బొంకు పల్కెడి వారలె పుణ్య జనులు
పూజ్యులను దూఱు వారలె పుణ్య జనులు


వేషము గాంచఁ బుణ్య తమ వృద్ధ జనాభ విశేష రూప భా
గ్భేషజ భాసితం బయిన భీతివహింపక యింత యాత్మలో
దోషము లేని పూజ్యులను దూఱెడు వారలె పుణ్యమూర్తు లౌ
రా షడరివ్రజఘ్నులు మహాత్ములు నౌదురె యెన్నఁ డేనియున్

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

పాపములు చేయు వారలు భయము లేక
పూజ్యులను దూరు వారలె; పుణ్య జనులు
ప్రతి దినము పూజ చేయుచు భక్తి తోడ
పెద్దలను గౌరవించెడు వినయ మతులు.