22, సెప్టెంబర్ 2025, సోమవారం

సమస్య - 5252

 కవి మిత్రులారా,

 ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్

లేదా

సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

17 కామెంట్‌లు:

  1. శా.
    సందోహంబొనరింప నొయ్యన వివస్వంతుండు ప్రాగద్రిపై
    చిందుల్ వేసిడి తీక్ష్ణ హస్తములతో సీమన్ స్ప్రశింపంగ నా
    మందేహాదులు డస్సి పోయిరి వడిన్, మందారముం బోలెడా
    సిందూరమ్ము త్రిశూలమై చెలగుచున్ శిక్షించె దుష్టాత్ములన్‌ !

    రిప్లయితొలగించండి
  2. కందం
    అందమ్మగు కాశ్మీరము
    సందర్శించు పతిఁ జంప సతి ముందరె! జై
    హిందన జవాను, రాలిన
    సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్

    శార్దూలవిక్రీడితము
    అందమ్మెంచియు పహ్లగాముఁ గనఁగా నాలూ మగల్ పోవఁగన్
    గుందంగన్ సతి నుగ్రవాదులొకటై కూల్చన్ బతిన్ గాల్చి, జై
    హిందంచున్ గసి తీరఁగన్ బ్రభుతయే యెంచంగ సంహారమే
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవుల సవరణననుసరించి,

      వృత్తము మొదటి పాదములో చివర,

      "నాలూ మగండేగఁగన్"

      అని చదువుకొన ప్రార్థన.

      తొలగించండి
  3. బందూకుల్ గొని రక్తము
    చిందింపదలంచు దుష్ట శీలుండ్రౌ యా
    బందెలమారుల ద్రుంచన్
    సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్.


    నిందల్ వేయుచు శత్రు దేశమనుచున్ నిత్యమ్ము కయ్యమ్ము కై
    బందూకుల్ గొని తీవ్రవాదులనెడిన్ పాపాత్ములే జొచ్చుచున్
    జిందింపన్ రుధిరమ్ము నాగ్రహమునన్ చెండాడ నేర్పాటయెన్
    సిందూరమ్ము, త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్.

    *(ఆపరేషన్ సిందూర్ తీవ్రవాదుల మదమడిచినదని)*


    రిప్లయితొలగించండి
  4. హిందూపౌరులనుగ్రవాద దళముల్ హింసించగా నిర్దయన్
    సందోహమ్ముగ దేశరక్షకులు దీక్షన్బూని బింకమ్ముగా
    సిందూరమ్మను మొగ్గరమ్ము రచనన్జేయంగ స్త్రీశక్తితో
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
  5. సుందరమగు తావసమున
    బందూకులు చేతబూని పరిమార్చిరిగా
    సందేహింపక సాధ్వుల
    సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్

    అందాలన్ దిలకింప వచ్చిరి జనుల్ హర్షాతిరేకంబుతో
    బందూకుల్ గొనివచ్చి చంపిరకటా పాపాత్ములౌ ముష్కరుల్
    సందేహంబుకు తావులేని విధిగా సాధ్వీలలాటంబుపై
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
  6. సుందర కాశ్మీరమ్మున
    చిందెను పౌరుల రుధిరము చెలఁగ తులువలా
    పందల పీచమడంచగ
    సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్

    రిప్లయితొలగించండి
  7. ఎందరు పతులుండిన , కా
    మందుడ నేననుచు నాసుమతి పొందడుగన్ ,
    ఇందుముఖి నొసట నుండిన
    సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్

    రిప్లయితొలగించండి
  8. కం:హిందువయిన భారత వా
    సిన్ దూరము శూలమగుచు శిక్షించె ఖలున్
    సుందరుడని కూతురు ముద
    మంది విదేశపు మగనికి నారాట బడన్.
    (కూతురు విదేశపు సంబంధాన్నే ఇష్ట పడటం తో ఆ దూరం శూలం లాగా బాధించింది.పైగా అల్లుడు దుర్మార్గుడు.)

    రిప్లయితొలగించండి
  9. శా:సందేహమ్ము నశించె నో హనుమ! నిన్ స్థాపించగా భక్తి తో
    డెందమ్మందున,నీదు దండకము దండిన్ జేయ,నిన్ దాకి నీ
    సిందూరమ్ము ధరింప శత్రుతతి విచ్ఛిన్నమ్ము గా లేదె!నీ
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్.
    (ఆంజనేయస్వామి భక్తులు సిందూరాన్ని ధరిస్తారు.ఆ సిందూరం శత్రుజయా న్నిచ్చి భక్తుణ్ని కాపాడింది.)

    రిప్లయితొలగించండి
  10. సుందర కాశ్మీ రమ్ము ను
    సందర్శించు యాత్రికులను జంపిన వానిన్
    హిందూ సైనిక వీరుని
    సిందూ రము శూల మగుచు శిక్షిం చె ఖలు న్

    రిప్లయితొలగించండి
  11. శా:సిందూరమ్మిక మాయ మయ్యె ననుచున్ జింతించు నో చెల్లి! నీ
    హిందుత్వమ్మును వెక్కిరించు ఖలులే హీనాతి హీనమ్ముగా
    బొందన్ మృత్యువు వీరసైనికులకున్ స్ఫూర్తిన్ బ్రసాదించు నా
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్
    (నీ సిందూరం పోయింది కానీ మరొక సిందూరం వాళ్లని శూల మై శిక్షించింది.)

    రిప్లయితొలగించండి
  12. ఖడ్గతిక్కనకు భార్య హిత బోధ

    శా॥ ఎందెందున్ ముదమౌన భీరువుగ నీవీరీతి వర్తిల్లగన్
    నిందల్ పొందెదమయ్య యాజివిడువన్ నీచత్యమే పోరుమా
    సందేహించకు సిందురమ్మునిడుచున్ సాంధించఁగన్ బ్రేఁచగన్
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
  13. అందని స్థలి కేఁగఁ బతులు
    కందర్పశరాలి ఘాత కలకంఠల యా
    సుందర వదనల చెదరిన
    సిందూరము శూల మగుచు శిక్షించె ఖలున్


    వందే భారత మాతరమ్మనుచుఁ దత్పాఙ్నామ దేశమ్మునం
    జిందుల్ వేసెడి యుగ్ర వాదులను శిక్షింపంగ నుగ్రంబుగా
    సందేహింపక యుద్యమించి త్రుటినిన్ సంధింప వ్యాపార మా
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
  14. పూరణలు ఆపరేషన్ సిందూర్ పైన

    కం॥సందడిఁ గాంచిన తోడనె
    బృందముపై చెలఁగి కాల్చ విహితముఁ గనకన్
    సందర్భోచిత నామము
    సిందురము శూలమగుచు శింక్షించె ఖలున్

    శా॥ సందేహించక నుగ్రవాదులటులన్ సారించి యున్మాదులై
    సందోహమ్మును గాంచి కాల్చఁగఁ గుసంస్కారమ్ము నేపారఁగన్
    సందర్భోచిత యుద్ధనామమున శస్త్రాస్త్రంపు సంయోజితన్
    సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్

    రిప్లయితొలగించండి
  15. అందమ్ముల సంతసమున
    సందర్శింపంగనెంచి సాగగ తమితో
    దుందుడుకున నరుదెంచగ
    *"సిందూరము శూలమగుచు శిక్షించె ఖలున్"*


    సింధూరమ్ము ధరించుచున్నకినుకన్ చేతన్ వడిన్ కత్తి తా
    సందేహించక పట్టి రాగకనులన్జారంగనిప్పుల్ చనెన్
    మందాత్ముండయినట్టి రక్కసునటన్ మాడ్చంగ నెంచంగనే
    *"సిందూరమ్ము త్రిశూలమై చెలఁగుచున్ శిక్షించె దుష్టాత్ములన్"*

    రిప్లయితొలగించండి