25, సెప్టెంబర్ 2025, గురువారం

సమస్య - 5255

26-9-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“అర్భకుండు యుద్ధమందు దూకె”
(లేదా...)
“అర్భకుఁ డుగ్రుఁడౌచు సమరాంగణమందున దూకెఁ బోరఁగన్”

16 కామెంట్‌లు:

  1. ఉ.
    నిర్భర దుర్దమ ప్రబల నిర్జరనాథజ సూను బాణముల్
    దుర్భవ వార్ధి ముంచ వడి దుర్మద కౌరవ సేన జంపె నా
    విర్భవమొంది యోటములు వెల్లిగొనెం గన నౌర చిన్నవా
    డర్భకు డుగ్రుడౌచు సమరాంగణమందున దూకె బోరగన్ !

    రిప్లయితొలగించండి
  2. తల్లితోడ బామ్మ తగవులాడుట గని
    యర్భకుండు యుద్ధమందు దూకె ,
    మామ్మ చూపు గోము మాతది మించినా ,
    అమ్మ పయిన మమతకన్యమేది ?

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    ధార్తరాష్ట్రులనిని తమ్మిమొగ్గరమెంచ
    నరుఁడులేనియొక్క తరుణమందు
    వెఱుపునెఱుగకుండ వీరాభిమన్యుండు
    నర్భకుండు యుద్ధమందు దూకె!

    ఉత్పలమాల
    దుర్భర తమ్మిమొగ్గరము త్రుంచెడువాడగు క్రీడిలేని సం
    దర్భము సూచి కౌరవులు దారుణమెంచియు పన్నినంత నం
    తర్భవమెర్గువాడనని ధాటిగ నయ్యభిమన్యుఁడొక్కఁడే
    యర్భకుఁ డుగ్రుఁడౌచు సమరాంగణమందున దూకెఁ బోరఁగన్

    రిప్లయితొలగించండి

  4. ఫల్గునుండు లేని పాళమందు నచట
    తమ్మిమొగ్గరమున తంపి జేయ
    వెడలె వీరు డైన విజయుని క్షేత్రజు
    డర్భకుండు యుద్ధమందు దూకె.


    గర్భము దాల్చినట్టి కులకాంతయె పంపగ పార్థ పుత్రుడే
    నిర్భయ మందు శాత్రువుల నిర్దయ గూల్చగ క్రీడి లేని సం
    దర్భము తమ్మి మొగ్గరము దంపిని జేయగ వేగమందు నా
    యర్భకుఁ డుగ్రుఁడౌచు సమరాంగణమందున దూకెఁ బోరఁగన్.

    *(అర్భకుడు=బాలుడు)*

    రిప్లయితొలగించండి
  5. కదన రంగమందు కౌరవ సేనతో
    పోర నర్జునుండు దూరమేగ
    మొగ్గరంబునొకటి పూన్చగ శత్రువు
    లర్భకుండు యుద్ధమందు దూకె

    నిర్భరుడర్జునుండు పయనించగ దూరము యుద్ధమందునన్
    దుర్భరమయ్యె పాండవులు దూరగ నెంచిన వ్యూహమార్గమే
    యర్భకుఁ డుగ్రుఁడౌచు సమరాంగణమందున దూకెఁ బోరఁగన్
    గర్భమునందునుండగనె కైకొని నాడట చొచ్చు మార్గమున్

    రిప్లయితొలగించండి
  6. కర్భురులట్లు రేగుచును కౌరవసైన్యము పోరుచుండగన్
    నిర్భయుడౌచు శత్రులను నిర్దయగన్ కడ తేర్చు వాడు యా
    దుర్భర పద్మ వ్యూహమును దూరెడు మార్గ మెరుంగు వాడు నౌ
    *అర్భకు డుగ్రుడౌచు సమరాంగణమందున దూకె బోరగన్*

    రిప్లయితొలగించండి
  7. బాలుఁడతఁడుగాని బవరమునందున
    విక్రమించగలడు వీరునివలె
    తమ్మిమొగ్గరమ్ము నిమ్ముగా ఛేదించ
    నర్భకుండు యుద్ధమందు దూకె

    రిప్లయితొలగించండి
  8. అర్భకుఁడైననేమి సమరాంగణమందున వెన్నుఁజూపకన్
    నిర్భయుడై చెలంగగల నేర్పరి మార్గణ చాలనమ్మునన్
    దుర్భర తమ్మిమొగ్గరము ద్రోణుడు పన్నఁగనాహవమ్మునం
    దర్భకుఁ డుగ్రుఁడౌచు సమరాంగణమందున దూకెఁ బోరఁగన్

    రిప్లయితొలగించండి
  9. ఆ.వె:కొప్పరపు కవులన గొప్ప యోధులు ,శాస్త్రి
    అర్భకుండు , యుద్ధమందు దూకె
    చెడ్డ సాహసమని చెళ్లపిళ్లకవికి
    భయము గల్గ శాస్త్రి జయము గాంచె.
    (తిరుపతి వెంకట కవులకు కొప్పరపు కవులకు మధ్య గొప్ప పోటీ ఏర్పడితే బాలుడైన వేలూరి శివరామ శాస్త్రి గారు కొప్పరపు కవులని ఢీకొన్నారు.అలాంటి యోధులని ఈ బాలు డెలా ఎదిరిస్తా డని చెళ్లపిళ్ల వారు ఆందోళన పడ్డారు.కానీ శాస్త్రి గారు నెగ్గి విరోధు లైన కొప్పరపు కవుల ఆశీస్సులు పొందారు. )

    రిప్లయితొలగించండి
  10. తమ్మి మొ గ్గ రమ్ము ధార్త రాష్ట్రు లు బన్న
    ఛే ద నమ్ము చేసి చేరు వారు
    లేర టంచు నపుడు వీరు o డభి మన్యు
    డ ర్భ కుండు యుద్ధ మందు దూకె

    రిప్లయితొలగించండి
  11. ఉ:ఆర్భటి శంకరాభరణ మందు సమస్యల దీర్చు లే! యిటన్
    దుర్భర మౌ సమస్యలిడు ధూర్తులు ప్రాశ్నికు లైరి,యెంతయున్
    నిర్భయతన్ గడంగె గద,నెగ్గునొ,యోడునొ యీ వధానమం?
    దర్భకుఁ డుగ్రుఁడౌచు సమరాంగణమందున దూకెఁ బోరఁగన్”
    (ఈ పిల్లాడు శంకరాభరణం లో సమస్యలు గొప్పగా పూరిస్తాడు కానీ పృచ్ఛకులు చాలా గడ్డు సమస్య లిచ్చే కొంటె వాళ్లు.వీడికి ధైర్యం ఉంది కానీ నెగ్గుతాడో,ఓడతాడో!)

    రిప్లయితొలగించండి
  12. అర్భకులేరి నేడు సభ నంతయు వేడుక నిల్చు పృచ్ఛకుల్
    గర్భకవిత్వమున్ ఘనము గారడి సేయు గణిత్రయంత్రమున్
    దుర్భర వేదనన్ మదిని దుఃఖము మీరగ భాష రాని నో
    నర్భకుఁ డుగ్రుఁడౌచు సమరాంగణమందున దూకెఁబోరఁగన్

    రిప్లయితొలగించండి
  13. విందు నొసఁగు ధర్మ నందను పెదతండ్రి
    పిలుపు నాలకించి భీక రాస్త్ర
    శస్త్ర నైపుణుఁడు వెస నభిమన్యుఁడు సుభ
    ద్రార్భకుండు యుద్ధ మందు దూకె


    దుర్భర మైన వ్యూహమునఁ దూఱి చెలంగి యొకం డెడంద భూ
    గర్భుకటాక్ష వీక్షణ నికాయము నమ్మి నిరంతరమ్మునున్
    నిర్భయ వీర విక్రముఁడు నేర్పరి మిన్నగ నస్త్ర విద్యలం
    దర్భకుఁ డుగ్రుఁ డౌచు సమరాంగణ మందున దూకెఁ బోరఁగన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    తమ్మి మొగ్గరమున తలదూర్చుటే గాని
    వెలికివచ్చు టెటులొ తెలియకున్న
    వెఱపు సుంత లేక వీరాభిమన్యుండు
    నర్భకుండు యుద్ధమందు దూకె.

    రిప్లయితొలగించండి
  15. ఆ॥ పార్థుఁడచట లేని పాళముఁ గాంచుచు
    వ్యూహమొకటి పన్న యుక్తి తోడ
    ద్రోణుఁడు తగు పగిదిఁ ద్రోవఁ జేసి కొనుచు
    యర్భకుండు యుద్ధమందు దూకె

    ఉ॥ దర్భను రాముఁడస్త్రముగఁ దాల్చెను తప్పని వేళ నావిధిన్
    దుర్భర మైన వ్యూహమును ద్రుంచఁగఁ బాండవు లట్లు ఘోర సం
    దర్భము శ్వేతవాహనుఁడు దాపున లేకనె పొంద నస్త్రమై
    యర్భకుఁ డుగ్రుడౌచు సమరాంగణమందున దూకెఁ బోరఁగన్

    రిప్లయితొలగించండి