26, సెప్టెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5256

27-9-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కవులకు దేశాటనమ్ము దగని పని గదా”
(లేదా...)
“కవిరాజేంద్రుల కెల్లఁ గాని పని నానాదేశ సంచారముల్”
(యతిని గమనించండి)

17 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మ.
      భువి నైపూణ్యము లేక యార్భటులతో భూభృత్స్వరూపంబుగా
      దివిషత్సంఘ గురుండు నేనని మదిం దెల్లంబు భావించు వా
      డవిరామంబుగ గర్వమెంచు, తను కావ్యప్రజ్ఞచే శోభిలం
      గవిరాజేంద్రుల కెల్ల గాని పని నానాదేశ సంచారముల్ !

      తొలగించండి
  2. కవితానెన్నఁడు మనమున
    నవలోకించును నవతను వ్యక్తమ్ముగ స
    త్కవితల నందించగ స
    త్కవులకు దేశాటనమ్ము దగని పని గదా

    రిప్లయితొలగించండి
  3. నవనీతంబన నొప్పెడు
    కవితామధురిమలు నిండు కావ్యా లిలలో
    చవి చూపించ గలుగు స
    త్కవులకు దేశాటనమ్ము దగని పని గదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కవితామాధురి తొంగిచూచునుకదా కావ్యాలలో మెండుగా
      నవనీతంబన నొప్పుచుండుగద ప్రజ్ఞావంతులే వ్రాయగా
      చవిచూపింత్రు మహానుభావులిలలో సారస్వతా సారమున్
      గవి రాజేంద్రుల కెల్లఁ గాని పని నానాదేశ సంచారముల్

      తొలగించండి
  4. కం॥ కవితల విశిష్టత వరల
    నవకము నొదివి మధురముగ నవ్యతఁ గనుచున్
    జవినిడు చుండ ధరను స
    త్కవులకు దేశాటనమ్ము దగని పని గదా

    మ॥ వివరించంగను సత్కవిత్వమటు వైవిధ్యంబు గానొప్పఁగన్
    నవకమ్ముంగని మోద సంచయము సన్మానమ్మునున్ గూర్చదే!
    భువిలో నిత్యము ఖ్యాతిఁ గాంచు విధిగా బొంకించుచున్ దెల్పఁగన్
    గవిరాజేంద్రుల కెల్లఁ గాని పని నానాదేశ సంచారముల్

    రిప్లయితొలగించండి
  5. అవనిపయి దాము జేసెడు 
    ధవళముల శరణము గాక తక్కొండు బనిన్ 
    సవరించబోవుమను యా 
    దవులకు దేశాటనమ్ము దగని పని గదా

    రిప్లయితొలగించండి
  6. అవనిని గలవిషయములను
    వివరముగను కదలకుండ వీక్షించెడి యా
    యవకాశమె పెరిగిన స
    త్కవులకు దేశాటనమ్ము దగని పని గదా


    భువిలో నూతన ప్రక్రియల్ జనులకున్ మోదమ్మునే గూర్చుచున్
    స్తవనీయంబగు మార్పులీ జగతి విస్తారమ్ముగా జేరగా
    వివరాలెప్పటి కప్పుడే కరమునన్ వీక్షింప పాళమ్మున
    న్కవిరాజేంద్రుల కెల్లఁ గాని పనినానా దేశ సంచారముల్.

    రిప్లయితొలగించండి
  7. చవులూరించెడు భవ్యమైన రచనల్ సంకల్ప మాత్రంబునన్
    కవులై తాము రచించి లెస్సగను సత్కారంబులన్ పొందుచున్
    భువి యందంతట వ్యాప్తిచెంది రచనల్ మోదంబునున్ గూర్చగన్
    కవి రాజేంద్రుల కెల్ల గాని పని నానా దేశసంచారముల్

    రిప్లయితొలగించండి
  8. కందం
    అవనీతలమెల్లఁ దిరిగి
    వివేకమున్ బడసినంత విద్వత్తమరున్
    గవనము వొంగ ననకు, "స
    త్కవులకు దేశాటనమ్ము దగని పని గదా?"

    మత్తేభవిక్రీడితము
    అవనీచక్రము చుట్టివచ్చి నరుఁడే యందంగ విజ్ఞానమున్
    కవనాసక్తతఁ గల్గు వారలనగా కావ్యమ్ములన్ గూర్చుచున్
    స్తవనీయంబగు పాటవమ్మొదవి విద్వత్తంద నేరీతిగన్
    గవిరాజేంద్రుల కెల్లఁ గాని పని నానాదేశ సంచారముల్?

    రిప్లయితొలగించండి
  9. కవులా కాలమునందునేలికల సంగాతమ్మునంజేరగన్
    కవితా ప్రౌఢిమనెల్లవారలెరుగంగానాడు శ్రీనాథుడే
    భువనంబందొనరించె యాత్రలను సంపూర్ణంబుగా నివ్విధి
    న్కవిరాజేంద్రుల కెల్లఁ గాని పని నానాదేశ సంచారముల్

    రిప్లయితొలగించండి
  10. కం॥
    చవులూరించెడి సురసపు
    కవనంపుకలిమి తెలుగున కడిదిగ నుండ
    న్నవలోకించని నవ్య
    త్కవులకు దేశాటనమ్ము దగని పని కదా!

    (ఇక్కడ దేశాటనము పరభాషా వ్యామోహమన్న భావన)

    రిప్లయితొలగించండి
  11. కం:కవనపు మర్మం బెరిగిన
    కవి భోజుడు మనకు రాజు కాగ కవితలన్
    జవి జూపగ నృపులకు స
    త్కవులకు దేశాటనమ్ము దగని పని గదా”
    (మనకి భోజుడి లాంటి రాజు ఉన్నప్పుడు కవులకు ఎవరో రాజుల కోసం దేశాటనం అనవసరం కదా!)




    రిప్లయితొలగించండి
  12. నవతలు దెలిసిన వారై
    సువిశాల ప్రభావములను శోభలు నట్లు న్
    కవితల నల్లు మహా స
    త్క వులకు దేశాట నమ్ము దగని పని గదా!

    రిప్లయితొలగించండి
  13. మ:కవినై భాగవతమ్ము వ్రాయగనె నా కాలమ్ము వెచ్చించితిన్,
    గవివై రాజుల సొమ్ములన్ బడయగన్,గారాబముల్ బొందగా
    నవి నీ బోంట్లకె సాధ్య మై పరగు బావా! కాను శ్రీనాథుడన్,
    గవిరాజేంద్రుల కెల్లఁ గాని పని నానాదేశ సంచారముల్”
    (పోతన శ్రీనాథుని తో" బావ!నేనేదో భాగవతము రాస్తూ గడిపా కానీ ఈ నానారాజసందర్శనలు,గౌరవాలు నీకు సాధ్యం.నేనేమన్నా శ్రీనాథుణ్నా? అని మెచ్చుకున్నాడు.శ్రీనాథుడు పోతనని ఆక్షేపిస్తాడేమో కానీ పోతన ఆయనని ఆక్షేపించని సాత్వికుడు.)

    రిప్లయితొలగించండి
  14. వివిధాంశమ్ములఁ బరికిం
    ప వీ లగునె తర్కములకు భాషేతరముల్
    భువిలోఁ జెలరేఁగఁగ స
    త్కవులకు దేశాటనమ్ము దగని పని గదా


    అవిగో మబ్బులు గ్రమ్ము చుండెఁ గనుమా యాకాశ మందెల్లెడం
    ద్రివి ధాధ్వమ్ములఁ జేయ నింపుగను బ్రేరేపింప నీ కేల చా
    లవె యానమ్ములు నేఁటి క్లిష్టతర కాలమ్ముం బరీక్షింపఁగ
    న్కవి! రాజేంద్రుల కెల్లఁ గాని పని నానా దేశ సంచారముల్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కవనమున శ్రద్ధ తోడను
    భువిలో నెచ్చటికినైన పోవుచునుండన్
    జవసత్త్వములుడిగిన స
    త్కవులకు దేశాటనమ్ము దగని పని గదా!

    రిప్లయితొలగించండి