27, సెప్టెంబర్ 2025, శనివారం

సమస్య - 5257

28-9-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్”
(లేదా...)
“రాముం డెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్”

15 కామెంట్‌లు:

  1. కందం
    శ్రీమన్మంగళ రూపుడు!
    భామిని సీతమ్మకొప్పు భవ్యగుణుండౌ
    ధీమణి! రామునిమించెడు
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్

    శార్దూలవిక్రీడితము
    శ్రీమన్మంగళ దివ్యరూపమున రాజీవాక్షుడై శూరుడై
    భామన్ సీతను రాజులన్ గెలిచి యుద్వాహమ్మునన్ బొందియున్
    గామోద్రేకుని రావణున్ దునిమి రాగన్ రామునిన్మించెడున్
    రాముం డెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్

    రిప్లయితొలగించండి
  2. రాముని రాజ్యము నందున 
    పామరుడయినను నిరతము భక్తిగ గొలువన్ 
    తామసము జూపుటన యభి
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్

    రిప్లయితొలగించండి

  3. దామోదరుడే కదరా
    భూమిని ధర్మము నిలుపగ పురుషోత్తముడై
    యీ మహి బుట్టెను సత్యమె
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్?


    భూమిన్ ధర్మము నిల్పనెంచిగదరా భూభృత్తు డీ ధాత్రిపై
    రాముండై జనియించెనంచు తెలిపెన్ రామాయ ణమ్మందునన్
    క్షేమంబిచ్చెడు వాడొకండె యతడే శ్రీరాముడే యైనచో
    రాముం డెక్కడ లేఁడు? లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్ ?

    రిప్లయితొలగించండి
  4. కం॥ ప్రేమ నొసఁగు దైవ మొకఁడె
    సామాన్యులిది తెలియకనె సాగుదురిలలోఁ
    దామస రూపులనుచు సు
    త్రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్

    శా॥ ప్రేమంబుంచుచు లోక పాలనను సంప్రీతిన్ సదా గాంచెడిన్
    నామంబుల్ ధరయందనేకములు సంధానించినన్ మానవుల్
    సామాన్యంబుగ, దైవమొక్కఁడగు దాశార్హుండు నిక్కమ్ము సు
    త్రాముండెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్

    రిప్లయితొలగించండి
  5. రాముడననొప్పు భృగుపతి
    రాముండననొప్పు శౌరి; రఘువీరుడు శ్రీ
    రాముని మించిన వాడౌ
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్

    రాముండా భృగునందనుండు మరియున్ రాముండనన్ శౌరి శ్రీ
    రాముండే తన తండ్రిమాట కొరకై రాజ్యంబునే వీడె శ్రీ
    రాముండేగెనరణ్యసీమ మరియా రాముండకున్ సాటియౌ
    రాముం డెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్

    రిప్లయితొలగించండి
  6. రాముండే శుభలేఖలందు, మొదటన్ వ్రాయంగ శ్రీరామయౌ,
    రాముండే మరి పల్కరింప, నసువుల్ రాలంగ రాముండెయౌ,
    రాముండే జన జీవనంబుగను సర్వంబయ్యె లోకంబునన్
    రాముం డెక్కడ లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్!!

    రిప్లయితొలగించండి
  7. ధీమణి యై వెలుగొందు చు
    కామితములు దీర్చు నట్టి ఘను డై యుండన్
    తామసు లై పలుక కు మే
    రాముడు లే డ నె డి చర్చ ప్రాజ్ను ల కొప్పు న్?

    రిప్లయితొలగించండి
  8. కం:ప్రేమ స్వరూపు డగు శ్రీ
    రాముడు శంబుకుని జంపు భ్రష్టకథన్ దా
    నే మయ్యె? రాముని వలెన్
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్.
    (శూద్రుడు తపస్సు చేసినంత మాత్రాన రాముడు శంబుకుణ్ని చంపట మేమిటి? అక్కడ రాముడు ఏమయ్య్దాడో? అసలు రాముడి లాగా ప్రవర్తించ లేదు అనే చర్చ న్యాయ మైనదే.రామాయణం లో ఉత్తర కాండ ప్తక్షిప్త మని కొందరు పండితులు అభిప్రాయం.)

    రిప్లయితొలగించండి
  9. శా:సేమం బిచ్చెడు వారి తత్త్వ మరయన్ జింతింపరే? యెట్టులౌ
    రా "మేరీ సుతు డెవ్వడో యసలు లే" డంచున్,మరిన్ గొంద రా
    "రాముం డెక్కడ లేఁడు లేఁ"డనుచుఁ జర్చల్ సేయుటొప్పున్? బుధుల్
    భూమిన్ సత్యము దెల్పు నట్టి పథమున్ బోధించుటే యొప్పగన్.
    (క్రీస్తు అనే వాడే పుట్ట లేదని కొందరు,రాముడనే వాడే లేడని కొందరు వాదించుకోవటం ఎలా ఒప్పు అవుతుంది? వాళ్లు ఉన్నారా లేదో అనే చర్చ కంటే వారి మార్గా లేమిటి? ఏది సత్యం? ఏది క్షేమం అనే తాత్త్విక చర్చ ఒప్పు అవుతుంది.)

    రిప్లయితొలగించండి
  10. కం॥
    రాముడు జనహృది నాదము
    రాముడె మన జీవమగుచు రాణగ నిలువన్
    హామికతోడన్నెట్టుల
    రాముడు లేడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్!!

    రిప్లయితొలగించండి
  11. ఈ మహిఁ బరికింపగ నే
    సీమల నన్య మనుజుండు సీతా సతికిన్
    రాముఁడు దక్క యెడఁద కభి
    రాముఁడు లేఁ డనెడి చర్చ ప్రాజ్ఞుల కొప్పున్


    రామా నిక్కము నెంచి చూడఁగ జనారాధ్యప్రదేశమ్ము ని
    త్యామేయార్థ విరాజి భాగ్య నగరం బందున్ దురన్యాయ మృ
    ద్రామాశుల్ నిలయార్థ పద్మినులు వారల్ దక్క విధ్వంసి తా
    రాముం డెక్కడ లేఁడు లేఁ డనుచుఁ జర్చల్ సేయు టొప్పున్ బుధుల్

    [మృద్రామాశులు = మన్ను పడఁతిపై (భూమిపై) నాశ గలవారు; నిలయార్థ పద్మినులు = ఇండ్లకొఱకు సరస్సులు గల వారు (సరస్సుల నాక్రమించిన వారు)]

    రిప్లయితొలగించండి
  12. రాముఁడు జగదభిరాముడు
    నీమమ్మొక బాణము నొక నెలఁతయె తనకున్
    రాముని మించిన మరియొక
    రాముఁడు లేఁడనెడి చర్చ ప్రాజ్ఞులకొప్పున్

    రిప్లయితొలగించండి
  13. రాముండే తన తండ్రిమాట నిలుపన్ రాజ్యమ్మునే వీడె నా
    రాముండే జలధిన్ తరించి సతికై రాకాసులన్గూల్చె శ్రీ
    రాముండంతటి యోగ్యుడీ భువిని శ్రీరాముండె వేరొక్కఁడౌ
    రాముం డెక్కడ? లేఁడు లేఁడనుచుఁ జర్చల్ సేయుటొప్పున్ బుధుల్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    పామరులైన జనులకే
    రాముడు లేడనెడు చర్చ; ప్రాజ్ఞులకొప్పున్
    రాముని పరిపాలనమున
    క్షేమముగా సాగె ప్రజల జీవనమనగన్.

    రిప్లయితొలగించండి