20, డిసెంబర్ 2025, శనివారం

సమస్య - 5326

21-12-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్”
(లేదా...)
“పూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్”
('పద్యప్రసూనము' సమూహం నుండి ధన్యవాదాలతో...)

5 కామెంట్‌లు:

  1. కందం
    బూజదులుపు వాడిననుచు
    వాజమ్మలఁ జేసి జనుల పాలకుడగుచున్
    మోజుగ దోచెడు దుష్టుని
    పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్

    ఉత్పలమాల
    బూజు తొలంగజేసెదను భుక్తిని గూర్చెదనంచు మాటలన్
    వాజము వోలు యెన్నికల వాటము పారగ గెల్చి గద్దెపై
    మోజులు దీరఁ గొల్వుఁ గొని భూరిగ దోచెడు దుష్టుఁ గొల్చెడున్
    బూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్

    రిప్లయితొలగించండి

  2. రాజులను బోలు నేతలె
    యా జగదీశ్వరులటంచు నంధత్వముతో
    పూజింపనేల వారిని
    పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్.


    రాజులు లోక మేలెడిపురాణగు లంచుదలంచి వారికిన్
    బూజలు సేసినంతనిల భుక్తికి లోటది యుండ దంచు నీ
    వా జగదీశుగాదనుచు నర్భక నేతకు రోజు చేసెడిన్
    బూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్.

    రిప్లయితొలగించండి
  3. ఆజి సలుపుటందు నతని
    తేజస్సు గురించి సరిగ దెలిసిన కూడన్
    ఓజ నెరుంగక వానిని
    పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  4. కం. రోజొక వేషము వేసెడు
    వాజమ్మల ధీరులనుచుఁ వాచాలురనే
    ధీజనులని గజమాలల
    పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్

    రిప్లయితొలగించండి
  5. జాజర గల నాయకులను
    వ్యాజపు నైజము గలిగిన వారలగు పరి
    వ్రాజకులన్ మూఢతతో
    పూజించుట మానినపుడె పుణ్యము దక్కున్

    నైజము క్రూరమై సలుపు నైచ్యపు కర్మలు క్షుద్ర పూజలున్
    వ్యాజపు తత్త్వమున్ గలిగి పక్షములో జనులెన్నకుండినన్
    రాజిలు నేతకున్ మరి విరక్తుల బోలెడి మోసగాళ్ళకున్
    పూజలు మానినన్ విపులపుణ్యము దక్కును సజ్జనాళికిన్

    రిప్లయితొలగించండి