10, డిసెంబర్ 2025, బుధవారం

సమస్య - 5326

11-12-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ”
(లేదా...)
“గ్రీష్మపుటెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్”

7 కామెంట్‌లు:

  1. ఉ.
    ఊష్మము కోరి మానసము హోమము భంగి జ్వలించుచుండె నే
    భీష్ముడ కాను నీపయిన ప్రీతికి లొంగి రమింప బూనితిన్
    గ్రీష్ముని కాలమందు రతికేళి యొనర్చదమీవ యున్నచో
    గ్రీష్మపుటెండ చల్లన, సఖీ విహరించెదమా మరీచికన్ !

    రిప్లయితొలగించండి
  2. కందం
    సుష్మా! నవదంపతులము
    నూష్మమ్మున కులుమనాలి యొప్పు మనకు, న
    ర్చష్మంతుని దలపించెడు
    గ్రీష్మపుటెండన్, విహారకేళి సుఖదమౌ!

    ఉత్పలమాల
    ఊష్మము తాళగన్ తనువు నొప్పక యున్నది జృంభణమ్మునన్
    సుష్మ! భరింపఁగన్ దగదు సూ! నవదంపతులై మనంగ న
    ర్చిష్మతిఁ బోలె నీ పురము ప్రేయసి! చేరి కులూ మనాలిలో
    గ్రీష్మపుటెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్!

    రిప్లయితొలగించండి

  3. భీష్ముని చెల్లెలు చేరెను
    సుష్మ గృహము, వింతలెల్ల చూడదలచెడిన్
    రేష్మను వారించి తెలిపె
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ?


    భీష్ముని బంధువైనసతి పిల్లల తోడ విహార యాత్రకై
    సుష్మగృహమ్ముజేర తన జోడును గాంచి ముదమ్ము జెప్పె నా
    రేష్మకు వచ్చుచుండె నదొ గ్రీష్మము కాంచగ నప్పుడుండదే
    గ్రీష్మపుటెండ చల్లన సఖీ!, విహరించెదమా మరీచికన్.

    రిప్లయితొలగించండి
  4. గ్రీష్మఁపు మార్తాండుఁడు కడు
    నూష్మముఁ బుట్టించుచుండె నుర్వీతటిపై
    శుష్మము పెనఁగొన నెల్లెడ
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ?

    శుష్మము=నిప్పు

    రిప్లయితొలగించండి
  5. నే "ష్మా"ల నెచట వెదకుదు
    నీ "ష్మా" దుష్కర మగునని ఎఱుగుదురెల్లన్
    ఈ "ష్మా" ప్రాసల కన్నను
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ

    రిప్లయితొలగించండి
  6. శ్లేష్మము తగ్గును దప్పక
    గ్రీష్మపుటెండన్ ; విహారకేళి సుఖదమౌ
    నుష్మము కొంచెము గుదియగ ,
    కూష్మాండపు లేహ్యముదిని క్రుమ్మరుచుండన్

    రిప్లయితొలగించండి
  7. ఊష్మముతో బాల్యములో
    నూష్మాక్షరములను తెలిపి యుంటివి నాకున్
    గూష్మాండలేహ్యముఁ గుడువ
    గ్రీష్మపుటెండన్ విహారకేళి సుఖదమౌ

    ఉష్మము లెక్కసేయవు మహోదయ బాల్యము గుర్తుసేయగా
    నూష్మములెన్నియో తెలిపి యుంటివి తెల్గున నాలుగంచు నా
    ముష్మిక సౌఖ్యముల్ వలదు ముచ్చట లాడగ కొండకోనలో
    గ్రీష్మపుటెండ చల్లన సఖీ విహరించెదమా మరీచికన్

    రిప్లయితొలగించండి