11, డిసెంబర్ 2025, గురువారం

సమస్య - 5327

12-12-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఒక దేహమె కాని చావులో పెక్కు లగున్”
(లేదా...)
“ఒక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా”
(రామా చంద్రమౌళి కవి గారికి ధన్యవాదాలతో...)

15 కామెంట్‌లు:

  1. మ.
    అకటా జీవితమందు యౌవనపు తేజానీకముల్ వోవ చూ
    పిక కందోయిని వీడు, చేతులకు పట్టే చచ్చు, నీ చిట్టినో
    టికి మేలౌ రుచితోడి బంధము తెగున్, డిగ్గుం బలంబప్పుడీ
    యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపగా మానవా !

    రిప్లయితొలగించండి
  2. కందం
    అకలంకమ్మగు విప్లవ
    మొకరిదగునె? నేత వెన్క నుండ బలగమున్
    సకలమని గూల్చ నాతని
    దొక దేహమె? కాని చావులో? పెక్కులగున్!

    మత్తేభవిక్రీడితము
    అకలంకమ్మగు విప్లవమ్మునకు నిస్వార్థమ్ముగన్ నేతయై
    యొకడే ముందుకు సాగగన్ వెనుక ధీరోదాత్తు లెందెందరో
    ప్రకరమ్మై నడుపంగ నేత దొరుకన్ ప్రాణంబు దీయంగనే
    యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా!

    రిప్లయితొలగించండి
  3. నకలుగ లిఖించు పొందిక
    ల కాగితము నందున గల రాతలు జూడన్
    తకరారునొంది చింపగ
    ఒక దేహమె కాని చావులో పెక్కు లగున్

    రిప్లయితొలగించండి

  4. ఒకడేమొ గుండె పోటు మ
    రొకడు ప్ర మాదమున జచ్చె నొక్కడు కనగా
    ఝకటమున జచ్చె గాంచగా
    నొక దేహమె కాని చావులో పెక్కు లగున్.


    సుకమున్ వీడుచు స్వేచ్ఛ కోసమని సంస్ఫోటమ్మునే జేయ భీ
    రుకమున్ జేరిన వానికోసమని నిర్దోషాళి నేజంపు పా
    లకులం గాంచుచు పల్కెనొక్కడిటులన్ ప్రష్టుండ కున్నట్టి య
    య్యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా.

    రిప్లయితొలగించండి

  5. శంకరాభరణం

    సమస్య .....12/12/2025

    ఒక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా”


    మత్తేభ:విక్రీడితము
    •••••• •••••• ••••••••

    ఒకరా? యిద్దర?యాఱునొక్కరిని యయ్యో! నీచుడౌ కంసుడే

    వికృతమ్మౌ మది దేవకీ శిశువులన్ బీడించి తాఁ జంపగా

    వికలంబై హృది తల్లి గుండె పగిలెన్...బిడ్డల్ చనన్ ముందటే

    యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా


    ఆకుల శాంతి భూషణ్
    వనపర్తి

    రిప్లయితొలగించండి
  6. కం. ప్రకటితముగ నీదేహపు
    సకల కణమ్ములు పొరిపొరిఁ జచ్చును బుట్టున్
    నికరముఁ నిధనజననముల
    ఒక దేహమె కాని చావులో పెక్కులగున్

    పొరిపొరిఁ : ‌repeatedly

    మానవ శరీరంలో ప్రతిరోజూ 33000 కోట్ల కణాలు పునరుత్పత్తి చెందుతాయి. ఒకరకంగా శరీరం మళ్ళీ మళ్ళీ పుట్టినట్టు.

    రిప్లయితొలగించండి
  7. సకలైశ్వర్యము లున్నగాని నిదియే సత్యంబుగా జీవికిన్
    బ్రకటంబిద్దియె యోచనంబునను నుత్పాతించగా క్లేశముల్
    వికటత్వంబున రాగమున్విడిచి‌
    దాపిల్లున్ విరాగిత్వమే
    యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా!

    రిప్లయితొలగించండి
  8. ఎకసెక్కెము లాడును సతి
    వికలమ్మొనరింత్రు మనము వేమారు జనుల్
    అకటా ధనహీనునకిల
    నొక దేహమె కాని చావులో పెక్కు లగున్

    రిప్లయితొలగించండి
  9. వికలము గావించెడి పూ
    నిక రాముడు కుంభకర్ణునే గూల్చగ సై
    నికులే నలిగిరి కూలిన
    దొక దేహమె కాని చావులో పెక్కు లగున్

    వికలత్వంబున కుంభకర్ణుడనికిన్ విచ్చేయగా రాముడే
    ప్రకటస్ఫూర్తిని జూపనెంచి రయమున్ బాణాలతోఁ గూల్చగా
    వికటించెన్ గద యుద్ధమందు నలియై పెక్కండ్రు నిర్జీవులై
    యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా

    రిప్లయితొలగించండి
  10. కం:ఒకడే సారథి,నడుపున
    దొక దేహమె కాని చావులో ! పెక్కు లగున్
    వికటించ చోదనము జూ
    పక బ్రజ్ఞ విమాన యాన పద్ధతు లందున్

    రిప్లయితొలగించండి
  11. మ:ఒక ధీరుండును, భీరువున్ బడయగా నొక్కొక్క దేహమ్మె చా
    వక యే యొక్కరు నిత్యులై మనరు,జీవమ్మున్న నాళ్లైన దే
    నికి జింతించడు ధీరు, డే దినమునన్ జింతించెడిన్ భీరు, వా
    యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా”
    (ధైర్యవంతుదు ఒకసారే మరణిస్తాడు.పిరికి వాడు ప్రతి దినం మరణిస్తాడు అనే షేక్స్పియర్ సూక్తి ని అనుసరిస్తూ. )

    రిప్లయితొలగించండి
  12. సకలము తెలిసిన వానిగ
    పక పక నవ్వుచు నొకండు పరిహాస ముగా
    ఎక సె క్కె ముగా పలికెను
    " ఒకదేహమె కాని చావులో పెక్కు లగు న్

    రిప్లయితొలగించండి
  13. అకటా జీవికిఁ బుట్టుట
    యొక చావు చదువు టది మఱియొక చా వగుఁ గు
    క్షి కొఱకుఁ గృషియుం జావే
    యొక దేహమె కాని చావులో పెక్కు లగున్


    అకటా మోక్షము కల్గు నంత వఱ కత్యంతార్తి భోగింపఁ బూ
    ర్వ కృతానేక విధాత్మ కర్మఫల సంభారమ్ములన్ భూమిపై
    నొకటే యాత్మ సతమ్ము గాంచు నఁట యోహో భోక్త గా నుండి యొ
    క్కొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా

    రిప్లయితొలగించండి
  14. సకలమ్మీ జగమందు సంపదలతో సాధ్యమ్ము, లేకున్నచో
    నెకసెక్కెమ్ములనాడు భార్య, తనయుల్ హేయంబుగా జూచుచున్
    వికలమ్ముం బొనరింత్రు మానసము నిర్వేదంబులో క్రుంగ నా
    యొక దేహంబున కెన్నియో మరణముల్ యోచింపఁగన్ మానవా

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఒకరికి మధుమేహము వే
    రొకరు పురుగు ముట్టి చచ్చె, నొక్కరు జూడన్
    శకట ప్రమాదము నందున
    నొక దేహమె కాని చావులో పెక్కులగున్.

    రిప్లయితొలగించండి