19, డిసెంబర్ 2025, శుక్రవారం

సమస్య - 5335

20-12-2025 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ”
(లేదా...)
“చెల్లినిఁ బెండ్లియాడెను విచిత్రమటంచుఁ దలంప రెవ్వరున్”

15 కామెంట్‌లు:

  1. కందం
    ఉల్లమున రుక్మిణీమణి
    గొల్లని కృష్ణుని వరించి కోరిన కతనన్
    చెల్లు ననుచు నరి రుక్మికి
    చెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ?

    ఉత్పలమాల
    ఉల్లము నందు మెచ్చియు సమున్నతుఁడంచును, కోరి విప్రునిన్,
    గొల్లని గృష్ణునిన్ వలచి కోరిక దెల్పగ రాక్షసంబునన్
    జెల్లునటంచు తేరుఁ గొని చిన్మయికై చని వైరి రుక్మికిన్
    జెల్లినిఁ బెండ్లియాడెను! విచిత్రమటంచుఁ దలంప రెవ్వరున్!

    రిప్లయితొలగించండి
  2. మెల్లఁగ హాలుని వనమున
    పిల్లివలెంజేరి మౌని వేషంబున నా
    బల్లిదుఁడు నరుడు కృష్ణుని
    చెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ

    రిప్లయితొలగించండి
  3. -
    కల్లాకపటంబెరుగని
    పిల్లంగోటి చెలితనపు పిరియము తోడై
    పుల్లారెడ్డి వయస్యుని
    చెల్లిని పెండ్లాడె కడు విచిత్రమ్మెటులౌ


    రిప్లయితొలగించండి
  4. తొల్లి చెరసాలన పొడమి ,
    తల్లిని విడువగ యశోద తనయుడయిన యా
    నల్లని మెయిగల వెన్నుని
    చెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ

    రిప్లయితొలగించండి

  5. నల్లని వాడొప్పుకొనగ
    కల్లదనంపు కవితలుపు కవ్వడి యే తా
    నల్లరి తనమున కృష్ణుని
    చెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ.


    నల్లని వాడె యైన వృష ణాశుని దీవెన లంది నంతనే
    కల్ల త్రిదండిగా నట కఖండలనందను డేగు దెంచుచున్
    తల్లికి మేన కోడలగు తామర కంటిసుభద్ర మాధవున్
    జెల్లినిఁ బెండ్లియాడెను విచిత్రమటంచుఁ దలంప రెవ్వరున్.

    రిప్లయితొలగించండి
  6. కల్లరియై కృష్ణసఖుడు
    మెల్లగ ద్వారకను జేరె మెచ్చిన సకికై
    మల్లారికిఁ బలభద్రుకుఁ
    జెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ

    నల్లనివాని సోదరిని నమ్మకమైన యతీంద్ర రూపులో
    మెల్లగఁ జేరెనర్జునుడు మెచ్చిన భామను పొందగోరుచున్
    జల్లగ సవ్యసాచి బహు చక్కని కన్యను వెన్నముచ్చుకున్
    జెల్లినిఁ బెండ్లియాడెను విచిత్రమటంచుఁ దలంప రెవ్వరున్

    రిప్లయితొలగించండి

  7. తల్లియు దండ్రియు హితులును
    చల్లని దీవెనలనీయఁ ౙక్కదనముగన్
    మల్లయ తనబావమరిది
    చెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ

    రిప్లయితొలగించండి
  8. ఏమిటీ కాలమహిమ !
    సమస్య వేయగానే వంద దాటే పూరణలు
    ఇంత తక్కువగా కనిపిస్తున్నాయి ?

    జోష్ తగ్గిపోతున్నదా అనిపిస్తోంది.


    రిప్లయితొలగించండి
  9. కం॥అల్లన సందేశము విని
    మెల్లఁగఁ చని తేరునందు మెచ్చిన పడతిన్
    నల్లని వెన్నుఁడు రుక్మికిఁ
    జెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ

    ఉ॥ ఉల్లము పొంగఁ బ్రేమమున నూహలఁ దేలి యతీంద్ర వేషమున్
    మెల్లఁగ తాల్చి పార్థుఁడటు మెచ్చిన కన్యక చెంతఁ జేరుచున్
    జల్లఁగఁ జేరఁదీసి తగు సఖ్యతఁ గాంచుచుఁ గృష్ణమూర్తికిన్
    జెల్లినిఁ బెండ్లియాడెను విచిత్రమటంచుఁ దలంప రెవ్వరున్

    రిప్లయితొలగించండి
  10. కం:ఎల్లమ్మ పోగ సవతిది
    పిల్లల బ్రేమించ దనెడు బెంగన బడి యా
    యెల్లమ్మ భర్త యా సతి
    చెల్లినిఁ బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ?

    రిప్లయితొలగించండి
  11. 2)ఉ:చెల్లికి సంప్రదాయమును జెప్పెడు తల్లియు,దండ్రి లేక, నీ
    యుల్లము దోచి నట్టి సతి యొక్క దినమ్మును బ్రేమ నీక యా
    కల్లల ప్రేమ జూపు నొక కాపురుషుండు గ్రహించ,వాడు నీ
    చెల్లినిఁ బెండ్లియాడెను విచిత్రమటంచుఁ దలంప రెవ్వరున్”

    (సంప్రదాయం నేర్పే అమ్మ, నాన్న లేరు.నీ భార్య కూదా ఆమెని ప్రేమ తో చూడ లేదు.కాబట్టి దొంగ ప్రేమని చూపే చెడ్డ వాడు వలలో వేసుకొన్నాడు.దానిలో వింత ఏముంది?)

    రిప్లయితొలగించండి
  12. అల్లన కృషడు వెడలియు
    తల్ల డ పడు రుక్మిణి గొని ధైర్యము తోడ న్
    చెల్లె తనకు నా రుక్మికి
    చెల్లిని పెండ్లాడె గడు విచి త్ర మ్మె టు లౌ?

    రిప్లయితొలగించండి
  13. ఉల్లమ్ము లలరఁగం దాఁ
    బెల్లుగ వలచిన లతాంగిఁ బ్రియమారం దా
    వల్లె యన మిత్రున కొసఁగి
    చెల్లినిఁ, బెండ్లాడెఁ గడు విచిత్రమ్మెటులౌ


    తెల్లముగా నెఱుంగ రిల దేవ మనోగత భావజాలముల్
    చెల్లికిఁ బట్టె యోగము విశేషముగా నని యెంచ నెల్లరుం
    గల్లలు కావు మాట లివి కాదని యక్కను సంతసమ్మునం
    జెల్లినిఁ బెండ్లియాడెను విచిత్ర మటంచుఁ దలంప రెవ్వరున్

    రిప్లయితొలగించండి
  14. బల్లిదుఁడైన పార్థుడు సుభద్రనుఁగోరి వివాహమాడగన్
    చల్లగ మౌని రూపమున శౌరివనంబున జొచ్చి యచ్చటన్
    మెల్లగ మాటలన్గలిపి మేలములాడుచు నల్లనయ్యకున్
    చెల్లినిఁ బెండ్లియాడెను విచిత్రమటంచుఁ దలంపరెవ్వరున్

    రిప్లయితొలగించండి