3, జనవరి 2026, శనివారం

సమస్య - 5340

4-1-2026 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కారమున్ననె మమకార మలరు”
(లేదా...)
“కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గదెప్పుడున్”
(బ్రహ్మశ్రీ వద్దిపర్తి వారి దుబాయి శతావధాన సమస్య)

14 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    అలవికాదునాకు నందరిజూడగన్
    జననిఁ గూర్చెదనుచు సర్వమయుఁడు
    మలచె! సంతు చుట్టు మాతదౌ చేతి ప్రా
    కారమున్ననె మమకార మలరు

    ఉత్పలమాల
    గారము సూపలేననుచు క్ష్మాతలమందుననెల్లవారికిన్
    గూరిమిఁ బంచెడున్ జనని గూర్చెను సర్వమయుండు సృష్టినిన్
    దీరిచి ప్రేమ బంధమును దిక్కుగ సంతుకు మాత చేతి ప్రా
    కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గదెప్పుడున్

    రిప్లయితొలగించండి
  2. ఎదుటి వాని పైన నెంతయొ హెచ్చు చీ
    త్కారమున్ననె ; మమకార మలరు
    చుండు నతని పైన , చోద్యము కాదిది
    నేను జెప్ప గలుగు నిజము యిదియ

    రిప్లయితొలగించండి

  3. మారె కాల మిపుడు మనుజుల లోనను
    పేర్మి తొలగె గాదె పేద లనిన
    చక్కని కొలువుండి సంపాదన కన ల
    కారమున్ననె మమకార మలరు.


    వారలు వేరుగాదు మనవారలె వారల కష్ట నష్టముల్
    తీరిచి యాదుకొందుననె దీక్షను గల్గిచరించు వారలీ
    ధారుణి గాంచ సజ్జనులు ధర్మ పరుల్ కద యట్టి గొప్ప సం
    స్కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గదెప్పుడున్.

    రిప్లయితొలగించండి
  4. ఓరిమి యున్నచోట గన
    నోపు జయమ్ము నిదానమందునన్
    గూరిమి యున్నచోట నొన
    గూడును సఖ్యత‌ కాలమందునన్
    జేర విశాల యోచనల
    జిత్త ప్రశాంతత దక్కు నెప్డు సం
    స్కారము గల్గుచోట మమ
    కారము సుంతయు దగ్గదెప్పుడున్!

    రిప్లయితొలగించండి
  5. కన్న బిడ్డలయెడ కలిగి యున్న మమత
    తల్లిదండ్రులకిలఁ దగ్గబోదు
    సంతతి దొసగులను క్షమియించ గల్గు సం
    స్కారమున్ననె మమకార మలరు

    గారము తోడపెంచి నయగారము చూపెడి యంతరంగ సం
    స్కారము గల్గియుంద్రు తలిదండ్రులు కన్నకుమారుడు దుష్టుడైన చీ
    త్కారము సేయకుంద్రుగద కారణమేమన తెల్లమౌను స్వీ
    కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గదెప్పుడున్

    రిప్లయితొలగించండి
  6. ఆ॥ సరసహృదయ మొదవి సద్వర్తనఁ గనుచు
    భూరి కరుణ వడసి బుద్ధి నిలిపి
    శ్రేష్ఠ కర్మములను చిత్తము నందు సం
    స్కారమున్ననె మమకారమలరు

    ఉ॥ తీరగు సద్గుణమ్ములటు దీపిలు రీతినిఁ గాంచి సర్వదా
    పారఁగ బుద్ధి కర్మలను పద్ధతి నెంచుచు శ్రేష్ఠమై భువిన్
    భూరి దయాళువై పరఁగు పొల్పును నిత్యముఁ బొంది యొప్పు సం
    స్కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గదెప్పుడున్

    రిప్లయితొలగించండి
  7. ఆ.వె:భార్య యనగ గట్టు బానిస యన్ దృష్టి
    గలిగి యుండ బ్రేమ కలుగు టెట్లు?
    బాధ్యతలకు దోడు పరివారమున నధి
    కారమున్ననె మమకార మలరు”

    రిప్లయితొలగించండి
  8. ఆ॥వె
    ఉన్నదానిలోనె చిన్నసాయమునిచ్చి
    ఎదుటి వారి వెతల యెలమిఁదీర్చి
    పలుకులందు ప్రేమ చిలికించు మంచి సం
    స్కారమున్ననె మమకారములరు!!

    రిప్లయితొలగించండి
  9. ఉ:కారము హెచ్చె నం చనును,కల్గెను శైత్య మటంచు దగ్గెడిన్,
    కారము హెచ్చు వేసినను గమ్మగ నుండును కూతు నింట ,సం
    స్కారము లేక నాకు నరకమ్మును జూపును గూబ గుయ్యిమన్
    కారము గల్గు చోట మమకారము, సుంతయుఁ దగ్గదెప్పుడున్
    (తన అత్తకి తన వద్ద ఉంటే కారము ఎక్కువ అనిపిస్తుంది.జలుబు,దగ్గు అంటూ వంకలు పెడుతుంది. అదే కూతురి దగ్గర మమకారం తో కారము ఎక్కువైనా కమ్మగానే ఉంటుంది. అక్కడ దగ్గనే దగ్గదు అని ఒక కోడలి సాదింపు. )

    రిప్లయితొలగించండి
  10. అందమైన వాని నందరు మెత్తురు
    నుతుల తోడ వాని ప్రస్తుతి o త్రు
    కాన జగతి యందు కలిగిన మంచి యా
    కార మున్న నె మమ కార మలరు

    రిప్లయితొలగించండి
  11. అఖిల మానవులు నిరాడంబరు లయినఁ
    దారతమ్యము లిల నేర రెవరు
    వేష భాష లందు భూషణమ్ముల నిర్వి
    కార మున్ననె మమకార మలరు


    గౌరవ మాన వాళి సహకారము పెద్దలు సెప్పు నుళ్ల స్వీ
    కార మిహోపకారము నఖర్వ సనాతన సన్ను తైక సం
    స్కారము వేష భాషల వికార విహీనము నిత్య నిర్మ లా
    కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గ దెప్పుడున్

    రిప్లయితొలగించండి
  12. ఆటవెలది:
    పేదసాదలందు భేదము నరయక
    నాదుకొనెడువాడె సాధకుండు
    పరుల మేలు గోరు పురుషోత్తముల సహ
    కారమున్ననె మమకార మలరు

    ఉత్పలమాల:
    కోరకనే వరంబులిడు కోపమొకింతయు గానరాదు ని
    స్సారపు శుష్కవాదనలు సల్పడు పెద్దల గౌరవించు సా
    కారము సేయగా కలలు కష్టములెన్నయినన్ భరించు సం
    స్కారము గల్గు చోట మమకారము సుంతయుఁ దగ్గదెప్పుడున్

    రిప్లయితొలగించండి
  13. సమస్య : కారమున్ననె మమకార మలరు

    పావురమునఁ బెంచి పాశముతో బట్టి
    బంధనముల యుంచ భావ్యమౌనె
    ఈడునున్న వేళ నిసుమంతయును స్వాధి
    కారమున్ననె మమకార మలరు

    పావురము : ప్రేమ (తెలంగాణ మాండలికంలో)

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆలుమగలు నిర్వు రణకువగా నుండి
    నొకరి కొకరు సఖ్యతకల దేని
    కాపురమ్ము సాగు కలకాలమదియు సం
    స్కారమున్ననె మమకార మలరు.

    రిప్లయితొలగించండి