16, జనవరి 2026, శుక్రవారం

సమస్య - 5353

17-1-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె”
(లేదా...)
“పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్”
(భరతశర్మ గారి శతావధానంలో మాచవోలు శ్రీధర్ రావు గారి సమస్య)

5 కామెంట్‌లు:

  1. తేటగీతి
    వాణి కారుణ్యమున్ బొంది పాటవమున
    నింపి శబ్దార్థ సమతూకమింపుగాను
    పృచ్ఛకులె కాదు ప్రేక్షకుల్ నచ్చనట్లు
    పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె!

    మత్తకోకిల
    విద్యనేర్చియు వాణిదీవెన ప్రీతిఁగొల్పెడు శైలితో
    హృద్యశైలిని పట్టునందియు పృచ్ఛకాళియు ప్రేక్షకుల్
    వద్యమైన యలంకృతమ్ములఁ బల్కువాడన, నాసిగన్
    పద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్!

    రిప్లయితొలగించండి
  2. నిగమమందున నవధాన నియమ మంత
    చక్కని పరువడిని కొనసాగ , కొనన
    అబ్రముగ బాలుడడిగిన యాంగ్ల భాష
    పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె”

    రిప్లయితొలగించండి

  3. విజ్ఞులెల్లరు మెచ్చెడి విధము నిపుడు
    పద్యముల్ చెప్పనేమిర బాల్యమందు
    నప్పగించమనుచు నొజ్జ యడిగినంత
    పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె.


    విద్యలందున వాసిగాంచిన విజ్ఞులెల్లరు మెచ్చుచున్
    హృద్యమంచు నుతించు రీతిని యింపుగా నవధాననున్
    బద్యమల్లిన వాడు పూర్వము పామరుండట బాల్యమున్
    పద్యమొక్కటి రాని బాలుఁడు , వాసిఁ గాంచె వధానిగన్

    రిప్లయితొలగించండి
  4. విద్యయే వ్యవసాయ మంచును
    బ్రీతితో గొనసాగగన్
    యుద్యమించుచు చిన్నప్రాయము
    నూని బూన కవిత్వమున్
    హృద్యమై లభియించె కైత ల
    నేకమై యట దోషమున్
    బద్యమొక్కటి రాని బాలుఁడు
    వాసిఁ గాంచె వధానిగన్!

    రిప్లయితొలగించండి
  5. పాఠశాలలో నాడట బాల్యమందు
    పద్యమన్నది నేర్వని బాలుడతడు
    నేడు నేత్రావధానమ్ము నేర్చినాడు
    పద్యములు రాని యవధాని వాసిఁ గాంచె

    విద్యలెన్నియొ లోక మందున వీలు వెంబడి నేర్వగన్
    హృద్యమైనవి గావె చూడగ తృప్తినిచ్చెడి ప్రక్రియల్
    చోద్యమేమియు లేని సంగతి చూడ చిన్నతనంబునన్
    బద్యమొక్కటి రాని బాలుఁడు వాసిఁ గాంచె వధానిగన్

    రిప్లయితొలగించండి