4, మే 2026, సోమవారం

సమస్య - 5459

5-5-2026 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కర్ణుం డుగ్రుఁ డగుచు ననిఁ గవ్వడిఁ గూల్చెన్."
(లేదా...)
"కర్ణుఁడు గూల్చె యుద్ధమునఁ గవ్వడి నొంటరిఁ జేసి క్రోధియై"
(విరించి గారికి ధన్యవాదాలు)

5 కామెంట్‌లు:

  1. జీర్ణుడు ధృతరాష్ట్రుండట
    కర్ణ పరాక్రమ మటంచు కనె స్వప్నములోన్
    వర్ణ విహీను డయిన యా
    కర్ణుండుగ్రుడగుచునని గవ్వడి గూల్చెన్.


    వర్ణ విహీ నుడంచు నట పన్నలు కొంచెము చేసి నట్టి యా
    కర్ణ పరాక్రమమ్ము వినగా కడు సంతస మంది యంధుడా
    జీర్ణ వయస్కుడచ్చట సుషిప్తిని గాంచిన స్వప్న మందునన్
    కర్ణుడు కూల్చె యుద్ధమున గవ్వడి నొంటరి జేసి క్రోధియై.

    రిప్లయితొలగించండి
  2. కర్ణము జిల్లుపడ నరచె
    కర్ణుం డుగ్రుఁ డగుచు , ననిఁ గవ్వడిఁ గూల్చెన్."
    అర్ణవమగు కురు సేనను
    పూర్ణమసుని వెలుగు నాడు ముగియక ముందే

    రిప్లయితొలగించండి
  3. -

    కడఁగి ద్రుపదానుజుఁడు నె,వ్వడిఁ గవ్వడినేసె నూఱు వాఁడిశరంబుల్‌, కడునలిగి వానినన్నియు, నడుమన తునియంగనేసె నరుఁడస్త్రములన్‌.

    ద్రుపదుని తమ్ముడు (ధృష్టద్యుమ్నుడు) పూనుకొని అర్జునుని మీద (కవ్వడి రెండుచేతులలో వడి గలవాడు) నూరు వాడి బాణాలు వేశాడు. అర్జునుడు మిక్కిలి కోపగించి, ఆ బాణాలన్నింటినీ మధ్యలోనే ముక్కలు చేసి పడగొట్టాడు.

    పదం
    అర్థం
    కడఁగి
    పూనుకొని, ఉత్సాహంతో
    ద్రుపదానుజుఁడు
    ద్రుపదుని తమ్ముడు - ధృష్టద్యుమ్నుడు
    కవ్వడి - అర్జునుడు

    కడు నలిగి
    మిక్కిలి కోపగించి

    నరుఁడు
    అర్జునుడు
    అస్త్రములన్
    బాణాలను~

    రిప్లయితొలగించండి
  4. కందం
    నిర్ణయమెట్లొనరించితొ?
    వర్ణించె ప్రవచన కర్త భారతకథనే
    గర్ణములకు తూట్లు పడఁగఁ
    "గర్ణుం డుగ్రుఁ డగుచు ననిఁ గవ్వడిఁ గూల్చెన్"


    ఉత్పలమాల
    నిర్ణయమెట్లుఁ జేసితివొ నేతగ, నా ప్రవచించు పండితున్?
    వర్ణనఁ జేయుచున్ బలుక భారత గాథను ప్రేక్షకాళికిన్
    కర్ణ కటోరమౌ పగిదిఁ గారెను రక్తము వాని వాక్కులన్,
    "గర్ణుఁడు గూల్చె యుద్ధమునఁ గవ్వడి నొంటరిఁ జేసి క్రోధియై!"

    రిప్లయితొలగించండి
  5. ఉ॥ కర్ణుని ప్రాపు నెంచి తన కామిత కల్పకమంచు భ్రాంతితో
    నిర్ణయమున్ సుయోధనుఁడు నెమ్మినిఁ జేయఁగ నాజి సల్పఁగన్
    జూర్ణముఁ గావు కోర్కెలను స్ఫూర్తిని నింపెను స్వప్నమీ విధిన్
    గర్ణుఁడు కూల్చె యుద్ధమునఁ గవ్వడి నొంటిరిఁ జేసి క్రోధియై

    రిప్లయితొలగించండి