8, మే 2026, శుక్రవారం

సమస్య - 5463

9-5-2026 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కరుణ లేని జేజెకు నమస్కారమేల”

(లేదా...)

“కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో”

18 కామెంట్‌లు:

  1. వతనుగ సపర్యనిడు వారిపయిన గూడ
    కరుణ లేని జేజెకు నమస్కారమేల !
    యనుచు శంకించెదరు కొందరజ్ఞులెపుడు ,
    వారి వారి యర్హత బట్టి ప్రాప్తికలఃగు

    రిప్లయితొలగించండి
  2. నాస్తికు డొకండు వాదించె నాస్తికునితో
    మ్రొక్కచున్నారు పలుమార్లు మోదముగను
    కష్టముల నష్ట పరచని కఠినమైన
    కరుణలేని జేజేకు నమస్కారమేల?

    రిప్లయితొలగించండి
  3. కరుణఁ జూడఁగ మనసార కరము మోడ్చి
    శరణు జొచ్చిన కాపాడు కరివరదుఁడు
    బేలవై యిట్లు పలుకగనేల నీవు
    కరుణ లేని జేజెకు నమస్కారమేల

    రిప్లయితొలగించండి
  4. శరణమ్మంచు శిరమ్మువంచి హరినిన్ సద్భక్తితో గొల్చినన్
    కరుణం జూచును కాంక్షితమ్ములనిడున్ కాపాడు నెల్లప్పుడున్
    కరుణామూర్తిని భక్తవత్సలుని ప్రాఖర్యమ్ముగా బల్కెదో
    కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో

    రిప్లయితొలగించండి
  5. తేటగీతి
    ట్రంపు యాగడమ్ములతోనిరాను పైన
    దాడులెంచఁగ, దేశాల గోడువినక
    నార్థికంపు సంక్షోభాల నాదుకొనడె!
    కరుణ లేని జేజెకు నమస్కారమేల?


    మత్తేభవిక్రీడితము
    పరమానందమదేమొ ట్రంపునకు దుర్వ్యాపార చిత్తుండునై
    పరదేశంపు టిరానుపై చెలఁగుచున్ బాపాత్ముఁడై నాశమున్
    జరుపన్ జింతిల లోకమార్థికముగన్ సంక్షోభమై, కావఁడే?
    కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో?

    రిప్లయితొలగించండి


  6. సంకటముల తీర్చు ననుచు సాగిల బడి
    మ్రొక్కు వారలు భువిలోన పెక్కు రున్న
    బాధలను బాప రాడయ్యె ప్రత్య గాత్మ
    కరుణ లేని జేజెకు నమస్కారమేల.


    కరికిన్ శక్తియె క్రుంగినంతనె దుఃఖంబందు చింతించె నే
    హరియే దిక్కని యెంత వేడినను తా యంత్రింపగా రాడు గ
    ద్దరి నక్రంబిది చంపు తథ్యమె యనుద్యానమ్ము లేనట్టి యా
    కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో.

    రిప్లయితొలగించండి
  7. శరణు జొచ్చిన వారికిఁ సత్వరంబు
    మరణమాపక తానుండు మర్మమేమి
    కరుణ లేని జేజెకు నమస్కారమేల
    చరణములు శరణమని ప్రశంశలేల

    'కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో'
    సరిగా కూర్చని పద్యపాదమిదియే చక్కొన్పి చూపించుమా!
    కరుణామూర్తిని దేవుఁడందురు నమస్కారమ్ము లర్పించెదన్
    పరమానందము గూర్చువాడు గద సంపాదింతునే మోక్షమున్

    రిప్లయితొలగించండి
  8. -

    నేటి లోకము :)
    రేపే అపార కరుణ పారును


    అరరె! తమిళ జనాళి నన్నాద రించి
    రని తలచినాను నిలుపసర్కారు తక్కు
    వాయె పదిసీట్లు నన్నేల ప్రభువు విడిచె
    కరుణ లేని జేజెకు నమస్కారమేల.

    రిప్లయితొలగించండి
  9. సమస్య : "కరుణ లేని జేజెకు నమస్కారమేల"

    అలసి పోయిన వేళలోనాకులమున
    కరుణ లేని జేజెకు నమస్కారమేల
    యనగ స్వాభావికము విన్నదనమునొందఁ
    గనఁగ సాధ్యమే పరమాత్మ కనికరమ్ము

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:బాలునకు దండ్రి జేజమ్మ పటము జూపి
    జేజెకున్ మ్రొక్కు మన వాడు చెప్పె నిటుల
    "ఏగి దేవుని కడకు, తా నికను రాదె?
    కరుణ లేని జేజెకు నమస్కారమేల?
    (మరణించిన జేజెమ్మ ఫొటో చూపించి నమస్కారం చెయ్య మని తండ్రి చెప్పాడు.అమాయక ప్రేమ గల బాలుడు " జేజెమ్మ దేవుడి దగ్గర కెళ్లి ఇంకా రాలేదు.నే నెందుకు దణ్నం పెట్టాలి? అని అలిగాడు. )

    రిప్లయితొలగించండి
  11. మ:"కరుణా మూర్తి యె దేవు"డందురు "ననున్ కాపాడడే?" యన్నచో
    "గురుపాపమ్ముల జేసియుందు" వని నాకున్ కర్మసిద్ధాంతమున్
    బరికించన్ దగ జెప్పుచుందు, రిక పాపమ్మున్ క్షమింపన్ గడున్
    గరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో?
    (భగవంతుడు కరుణామయుడని వాళ్లే చెపుతారు. నన్ను కాపాడడే? అంటే నువ్వు పూర్వం దుష్కర్మలు చేసా వేమో! అంటారు.మరి పాపాన్ని క్షమించే విషయం లో అంత కరుణా దూరు డైతే ఆ దేవునికి నమస్కార మెందుకు? మన కర్మ మనమే అనుభవిస్తాం అని.ఈ సందేహం కష్టాల లో ఉన్న ప్రతి ఆస్తికుని వస్తూ ఉంటుంది.)

    రిప్లయితొలగించండి
  12. మ॥ ధరలోఁ బూర్వము రాక్షసాధములు ప్రాధాన్యమ్ము దైత్యాళికిన్
    గరపంగన్ సభఁ దాల్చి తెల్పిరఁట వక్కాణించుచున్ గట్టిగా
    నరయంగన్ హరి శత్రువై మనకు సౌహార్దమ్మునున్ గాంచఁడే
    కరుణాదూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో

    (రాక్షస సమాజానికి సంబంధించిన వరకు వారి ఆలోచనలండి)

    రిప్లయితొలగించండి
  13. ఎన్ని పూజలు చేసిన నేమి ఫలము
    కోర్కె తీరక మిక్కిలి కుమిలి పోతి
    ననుచు మది విరక్తి తో నాగ్ర హించి
    కరుణ లేని జే జె కు నమ స్కా ర మేల?

    రిప్లయితొలగించండి
  14. చూడ రాకున్న నెప్పుడు చుట్ట మేల
    నీరు లేని పట్టణమున నిలయ మేల
    వైద్యుఁ డుండని యూరను వాస మేల
    కరుణ లేని జేజెకు నమస్కార మేల


    పరమోదారుఁడు దేవుఁ డార్తులకు సంభావ్యుండు మర్త్యాలికిన్
    హరి నిత్యమ్ము దయా సముద్రుఁ డయ సత్యం బెన్న భక్తాలికిన్
    గిర లిబ్భంగి ననంగ రాదు పుడమిం గృత్యమ్ము దుష్టాలికిం
    గరుణా దూరుఁడు దేవుఁ డందురు నమస్కారమ్ము లింకెందుకో

    రిప్లయితొలగించండి

  15. ఆకాశవాణి - విశాఖపట్టణం

    కవన విజయం -

    సమస్యా పూరణం - 9th May 2026

    డా. శ్రీ రాంభట్ల పార్వతీశ శర్మ

    సమస్య -

    మనుమని తేరిజూచిరట మామ్మలు మువ్వురు పెండ్లియాడ గన్!

    జిలేబీయపు పూరణ Part-1 లో _5:25 min

    ప్రాంతంలో వినవచ్చు :)

    https://varudhini.blogspot.com/2026/05/air-vizag-09may2026.html

    ఈనాటి ఈ పూరణలలో చాలామంది
    శంకరాభరణవేదిక కవివరులు.



    రిప్లయితొలగించండి
  16. వచ్చే పక్షానికి సమస్య

    గ్రీష్మ తాపం వర్ణన ఏదేని వృత్తములో

    పంపవలసిన మెయిల్ ఐడి.

    airpcvsp at gmail dot com


    రిప్లయితొలగించండి