14, జులై 2011, గురువారం

ప్రత్యేక సమస్యా పూరణం -393 (వ్యాసుని భారతమ్ము విన)

కవి మిత్రులారా,
‘వ్యాసపూర్ణిమ’ పర్వదినం సందర్భంగా
పూరించవలసిన ప్రత్యేక సమస్య ఇది ........
వ్యాసుని భారతమ్ము విన
వ్యాధులు, బాధలు వృద్ధి పొందెడిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

సమస్యా పూరణం -392 (సరసుఁ డైనట్టి భోగియే)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సరసుఁ డైనట్టి భోగియే జ్ఞాన యోగి.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

13, జులై 2011, బుధవారం

చమత్కార పద్యాలు - 103 (ప్రహేళిక)

సీ.
మనుజుని యాకార మహిమకు మొద లెద్ది?
నగవైరివైరి దౌ నగర మెద్ది?
రఘుపతి కాచిన రాక్షసాండజ మెద్ది?
శిబి కర్ణు లార్జించు చెలువ మెద్ది?
పంచబాణుని వింటఁ బరగెడు రుచి యెద్ది?
గిరిపతి భుజియించు గిన్నె యెద్ది?
నయనాంగరక్షకు ననువైన బల మెద్ది?
చెలఁగి మానముఁ గాచు చె ట్టదెద్ది?
తే. గీ.
అన్నిటికిఁ జూడ రెండేసి యక్కరమ్ము
లాదు లుడుపంగఁ దుదలెల్ల నాదు లగును;
చెప్పునాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేంద్ర! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

సమస్యా పూరణం -391 (కాముకులను గొలువ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కాముకులను గొలువఁ గలుగు యశము
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

చమత్కార పద్యాలు - 102 A (ప్రహేళిక - సమాధానం)

సీ.
ఏనుఁగు సింహంబు నెలనాగయును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
బక్షియు వస్త్రంబు పాషాణమును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుఁడుఁ గూడి
యొక మాటలోపల నుండవలయు
రారాజు రతిరాజు రాజరాజును గూడి
యొక మాటలోపల నుండవలయు
తే. గీ.
దీని యర్థంబుఁ జెప్పఁగా ధీనిధులకు
నెలలు పన్నెండు గడువిత్తు నేర్పుగాను;
చెప్పు నాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేత! కృష్ణరాయక్షితీంద్ర!
సమాధానాలు -
ఏనుఁగు + సింహము + ఎలనాగ = నాగము + కేసరి + ఆలు
= నాగకేసరాలు (ఒక దినుసు వడ్లు)
పక్షి + వస్త్రము + పాషాణము = కాకి + బొంత + రాయి
= కాకిబొంతరాయి (ఒక జాతి రాయి)
ఫణిరాజు + ఫణివైరి + ఫణిభూషణుఁడు = నాగము + గరుడుడు + ఈశ్వరుడు
= నాగగరుడేశ్వరము (ఒక క్షేత్రం)
రారాజు + రతిరాజు + రాజరాజు = రాజు + మదనుడు + కుబేరుడు
= రాజమదనకుబేరము (ఒక ఔషధం)
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
గోలి హనుమచ్ఛాస్త్రి గారొక్కరే దీనికి సరైన సమాధానాలు చెప్పారు. వారికి అభినందనలు.

12, జులై 2011, మంగళవారం

చమత్కార పద్యాలు - 102 (ప్రహేళిక)

సీ.
ఏనుఁగు సింహంబు నెలనాగయును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
బక్షియు వస్త్రంబు పాషాణమును గూడి
యొక మాటలోపల నుండవలయుఁ
ఫణిరాజు ఫణివైరి ఫణిభూషణుఁడుఁ గూడి
యొక మాటలోపల నుండవలయు
రారాజు రతిరాజు రాజరాజును గూడి
యొక మాటలోపల నుండవలయు
తే. గీ.
దీని యర్థంబుఁ జెప్పఁగా ధీనిధులకు
నెలలు పన్నెండు గడువిత్తు నేర్పుగాను;
చెప్పు నాతఁడు భావజ్ఞ శేఖరుండు
లక్షణోపేత! కృష్ణరాయక్షితీంద్ర!
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ‘చాటుపద్య రత్నాకరము’ నుండి)
కవిమిత్రులారా!
ఎవరైనా సమాధానం చెప్పగలరా?

సమస్యా పూరణం -390 (అడవిఁ గాచిన వెన్నెల)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
అడవిఁ గాచిన వెన్నెల హాయి నొసఁగె.
ఈ సమస్యను సూచించిన చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు.

11, జులై 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 101 (ప్రహేళిక)

సదావక్ర స్సదాక్రూరః
సదా పూజామపేక్షతే |
కన్యారాశిస్థితో నిత్యం
జామాతా దశమో గ్రహః ||
నా అనువాదం -
వక్రగతిఁ జరించు వాఁడు క్రూరుం డెప్పు
డైనఁ పూజలు గొన నభిలషించు
స్థిరముగా వసించుఁ జేరి కన్యారాశి
మనల కల్లుఁడు దశమగ్రహమ్ము.

కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్.

సమస్యా పూరణం -389 (వ్యాధి యుపశమించె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వ్యాధి యుపశమించె బాధ హెచ్చె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

10, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 100 (ప్రహేళిక)

వృక్షాగ్రవాసీ న చ పక్షిరాజః
త్రిణేత్రధారీ న చ శూలపాణి |
త్వగ్వస్త్రధారీ న చ సిద్ధయోగీ
జలంచ బిభ్రత్ న ఘటో న మేఘః ||
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం -
తే. గీ.
చెట్టుపైన వసించు, పక్షి యనఁ దగదు;
మూఁడు కన్నులుండును, కాదు పురహరుండు;
చర్మవస్త్రధారియె, కాదు సంయమియును;
జలసహితమె, కాదది కుండ, జలధరమును;
సమాధానం - కొబ్బరికాయ.
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
"కొబ్బరికాయఁ గొట్టినను గోరికఁ దీర్చనివాఁడు దేవుఁడా?"