14, జులై 2011, గురువారం

ప్రత్యేక సమస్యా పూరణం -393 (వ్యాసుని భారతమ్ము విన)

కవి మిత్రులారా,
‘వ్యాసపూర్ణిమ’ పర్వదినం సందర్భంగా
పూరించవలసిన ప్రత్యేక సమస్య ఇది ........
వ్యాసుని భారతమ్ము విన
వ్యాధులు, బాధలు వృద్ధి పొందెడిన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

19 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు !

  01)
  ____________________________________________

  వాసియు వన్నెయున్ గలిగి - భారత దేశపు భాగ్య వశంబునన్ !
  చేసిన పాపము ల్దొలగు - చెప్పిన చోటను నిర్మలాత్ముడై
  వ్యాసుని భారతమ్ము విన !- వ్యాధులు బాధలు వృద్ధి పొందెడిన్
  వాసన , దుమ్ము ధూసరిత - వాసము నందు వసించ నయ్యెడన్
  ____________________________________________

  రిప్లయితొలగించండి
 2. శంకరయ్య గారూ!నమస్సులు.......

  వ్యాసుని భారతమ్ము విను వారికి బాధలు వృధ్ధి పొందెడిన్ -

  అంటే బాగుండునా? యోజించండి --- మీ రాజారావు

  రిప్లయితొలగించండి
 3. వేసర నేల? వ్యాధులకు? వింతగు బాధల కీవు? మిత్రమా!
  ధ్యాసను చూపి యొక్క పరి వ్యాసుని భారత మాలకింపుమా!
  గాసిలు వారి రక్ష యిది. కాంచగ నప్పుడ నాశనంబగున్
  వ్యాసుని భారతమ్ము విన వ్యాధులు, బాధలు. వృద్ధి పొందెడిన్.

  రిప్లయితొలగించండి
 4. ఆసుర వృత్తి బాపు,మణి హారమె భారత వాఙ్మయంబునన్ ,
  బూసిన వేదరాజమిది,పూర్వుల బుణ్య తప:ఫలంబునన్ ,
  వ్యాసుని భారతమ్ము విన ,వ్యాధులు బాధలు,వృద్ధి పొందెడి
  న్మోసములన్నియున్ దొలుగు ,మోదము హెచ్చును మానవాళికిన్!!!

  రిప్లయితొలగించండి
 5. మోసము, ద్వేష రోషములు ముప్పునుఁ దెచ్చునటంచుఁ దెల్పు- నా
  వ్యాసుని భారతమ్ము విన ; వ్యాధులు, బాధలు వృద్ధి పొందెడిన్-
  ద్రోసినఁ బోనుపోననెడు ద్రోహపు చింతన- దూరమౌనికన్
  వ్యాసుని పాదపద్మముల భక్తినిఁ జూపుచు నుండగాఁదగున్.

  రిప్లయితొలగించండి
 6. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 14, 2011 2:52:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  మోసము ద్వేషముల్ కలిగి మోటుతనంబున నిచ్చగింతురే
  వ్వాసునిభారతంబు విన ? వ్యాధులు బాధలు వృద్డి పొందెడిన్
  వాసము లందు జేరి చెడువాసము జేయుచు త్రాగుచున్ దుర
  భ్యాసులుయైన యీ యువత బాటను మార్చుము వ్యాససన్మునీ

  రిప్లయితొలగించండి
 7. శ్రీసతి భర్త తోడు, హిమ శైలజ నాధుని తోడు, నాశమౌ
  వ్యాసుని భారతమ్ము విన వ్యాధులు, బాధలు - వృద్ధి పొందెడిన్
  ధ్యాసయె ధర్మ మందు మరి ధారుణి యందున సౌఖ్య మందగా
  చేసిన పాపముల్ తొలగి చెన్నుగ వెన్నుడు వెంట నుండుగా!

  రిప్లయితొలగించండి
 8. వసంత కిశోర్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.
  ‘భాగ్య వశంబునన్" అన్నచోట గణదోషం.

  లక్కాకుల వారూ,
  బాగుంటుంది. కాని ఇప్పటికే అందరూ పూరణలు పంపారు. సవరించే అవకాశం లేదు.

  చింతా రామకృష్ణారావు గారూ,
  మనోహరమైన పూరణ. ధన్యవాదాలు.

  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  మందాకిని గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.

  శ్రీపతి శాస్త్రి గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘భ్యాసులు + ఐన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘భ్యాసులు భ్రష్టులౌ యువత’ అందాం.

  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, జులై 14, 2011 7:41:00 PM

  మోసులు వేసె,నామనము ముక్తిని కోరుచునాలకించితే,
  దోసము తొల్గగా మనసధోక్షజుపై రమియించు భక్తితో
  వ్యాసుని భారతమ్ము విన, వ్యాధులు బాధలు వృద్ధిపొందెడిన్
  వాసమునందు ధూళి చెడు వాసన సంయుతమై చెలంగగాన్.

  దోసము= ఫాపము,
  అధోక్షజు పై = విష్ణుమూర్తి పై

  రిప్లయితొలగించండి
 10. శ్రీపతిశాస్త్రిగురువారం, జులై 14, 2011 7:42:00 PM

  గురువుగారు ధన్యవాదములు

  రిప్లయితొలగించండి
 11. మోసము చేయు వారు, తమ మోదము కోసము జారచౌర్యముల్
  చేసెడి వారలున్ , పరులఁ జిక్కులఁ బెట్టెడి వారు చేతలన్
  దోసము కప్పి పుచ్చుకొను దుర్మతిఁ బూటక మైన శ్రద్ధతో
  వ్యాసుని భారతమ్ము విన వ్యాధులు, బాధలు వృద్ధి పొందెడిన్.

  రిప్లయితొలగించండి
 12. అందరి పూరణలూ బాగున్నాయి. ఐతే మిస్సన్నగారి పూరణ ఔచిత్యంతో ఒప్పారుతోంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ సరసీ రుహాక్ష వచ సిక్త సుధామయ గాన" గీత "సం
  వాసిత" యోగవిద్య" కొలువై , యిల కృష్ణ చతుష్టయమ్ముతో
  భాసిలి , దేనికైన సబబైన జవాబుగ నిల్చునట్టి మా
  వ్యాసుని భారతమ్ము విన - వ్యాధులు బాధలు వృధ్ధి పొందెడిన్???

  ---వెంకట రాజారావు . లక్కాకుల

  రిప్లయితొలగించండి
 14. శంకరార్యా ! ధన్య వాదములు !
  మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !
  మిస్సన్న మహాశయుల పూరణ ప్రత్యేక ప్రశంసా పాత్రమై యున్నది !

  01అ )
  ____________________________________________

  వాసియు వన్నెయున్ గలిగి - భారత దేశపు భాగ్యమే యనన్ !
  చేసిన పాపము ల్దొలగు - చెప్పిన చోటను నిర్మలాత్ముడై
  వ్యాసుని భారతమ్ము విన !- వ్యాధులు బాధలు వృద్ధి పొందెడిన్
  వాసన , దుమ్ము ధూసరిత - వాసము నందు వసించ నయ్యెడన్
  ___________________________________________

  రిప్లయితొలగించండి
 15. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  చింతా రామకృష్ణారావు గారి ప్రశంస నందుకొన్న మీ పూరణ ఉత్తమంగా ఉంది. ద్విగుణీకృతాభినందనలు.

  లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  చక్కని ధారాశుద్ధితో పదలాలిత్యంతో మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  వసంత కిశోర్ గారూ,
  చక్కగా సవరించారు. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 16. గురువుగారూ ధన్యవాదాలు.
  ఆర్యా శ్రీ చింతా రామకృష్ణా రావుగారూ ధన్యుడను.
  కిశోర మహోదయా ధన్యవాదాలు.
  రాజా రావు గారూ మీ పూరణ లలిత మనోజ్ఞంగా అలరారుతోంది.

  రిప్లయితొలగించండి
 17. వాసికి పేరుగాంచెనిది భారతమన్నది; తీరిపోవు నా
  వ్యాసుని భారతమ్మువిన వ్యాధులు బాధలు;వృద్ధిపొందెడిన్
  కాసుల మీఁదిమోహమును ఖండనఁ జేయుచు బోధఁజేయు;నేఁ
  దాసిగఁసేవఁజేయుదును,దారినిఁజూపుము దైవరూపివై.


  వ్యాసుని ప్రార్థించుట.

  రిప్లయితొలగించండి
 18. మందాకిని గారూ,
  మీ వ్యాసప్రార్థన మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. దాసులు పాండవుల్ బుధులు తప్పక నైరట జూదమొల్లుచున్
  దాసిగ ద్రౌపదిన్ గొనుచు దైన్యము నెంచక కోకవిప్పిరే
  కూసిని గ్రామముల్ నిడక కూల్చిరె యోధుల వేల వేలనున్
  వ్యాసుని భారతమ్ము విన వ్యాధులు, బాధలు వృద్ధి పొందెడిన్

  రిప్లయితొలగించండి