11, జులై 2011, సోమవారం

సమస్యా పూరణం -389 (వ్యాధి యుపశమించె)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
వ్యాధి యుపశమించె బాధ హెచ్చె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

32 కామెంట్‌లు:

 1. జలుబు తగ్గించు కొనుటకు స్వంతముగను
  మాత్ర తెచ్చితి వేసితి, మారు దినము
  మందు వికటించి యొడలంత మంట బుట్టె ;
  వ్యాధి యుపశమించె, బాధ హెచ్చె

  రిప్లయితొలగించండి
 2. కోర్టు వ్యాజ్యము గెలిచెను కోటి గారు
  స్థల వివాదమ్ము చక్కగా సమసి పోయె!
  కళ్ళు దేల్చెను కూడగా ఖర్చు లన్ని;
  'వ్యాధి యుపశమించె, బాధ హెచ్చె!! '

  రిప్లయితొలగించండి
 3. నాల్గు దినములట్లు నడుమువాల్చిన యంత
  వ్యాధి యుపశమించె;; బాధ హెచ్చె
  నెత్తి పొడుపు మాటలెట్టిన ఱంపపు
  కోతకు, యది మాట కున్న (మహచెడ్డ) పదును!

  రిప్లయితొలగించండి
 4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  లోకసామాన్యమైన విషయాన్ని ప్రస్తావిస్తూ చక్కగా పూరించారు. అభినందనలు.
  ‘మారు దినము’ - ‘మరుదినమున’ అయితే ...?

  రిప్లయితొలగించండి
 5. గోలివారు నాకంటే యెప్పుడూ ముందే. అయితే ఈ సారి ఆటవెలదిని తేటగీతి చేసి కొంచెం స్పీడుగా దూకారేమో.

  రిప్లయితొలగించండి
 6. హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ రెండవ పూరణ. అభినందనలు.
  ‘ఆస్తి పోతే పోయింది, లా తెలిసింది’ అన్నాట్ట వెనుకటి కెవరో. ఆమాట గుర్తుకు వచ్చింది. :-)

  చంద్రశేఖర్ గారూ,
  ‘ఇంటిలోని పోరు ఇంతంత కాదయా’ అని ఊరికే అన్నారా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ‘కోతకు + అది’ యడాగమం రాదు కదా! ‘కోతల కది’ అందాం.

  రిప్లయితొలగించండి
 7. హన్నన్నా!
  చంద్రశేఖర్ గారు చెప్పేదాక నేను గమనించనే లేదు.
  గోలి వారూ,
  మీరు గమనించారా? మనకు రెండు మార్గాలు. మీరు ఆ తేటగీతాలను ఆటవెలదులుగా మార్చడం మొదటిది. సమస్య పాదాన్నే "వ్యాధి యుపశమించెను గాని బాధ హెచ్చె" అని తేటగీతి పాదంగా మార్చడం రెండవది. ఏం చేద్దా మంటారు?

  రిప్లయితొలగించండి
 8. శంకరార్యా! ధన్యావాదములు.
  చంద్ర శేఖర్ గారూ !ధన్యవాదాలండీ.నిజమేనండీ! నేను గమనించలేదు. ముందుండాలన్న తొందరలో.. తప్పటడుగు వేశాను. మాస్టరు గారు, కవి మిత్రులు, క్షమించాలి.
  సవరణలతో...


  జలుబు జేయ నాకు స్వంతముగా తెచ్చి
  మాత్ర వేసి నాను , మరు దినమున
  మందు పవరు పెరిగి మంటలే యొడలంత;
  వ్యాధి యుపశమించె, బాధ హెచ్చె

  కోర్టు వ్యాజ్యమునను కోటిగారే గెల్చె
  స్థల వివాద మిపుడు సమసి పోయె!
  కళ్ళు దేల వేసె ఖర్చు లన్నియుగూడి ;
  'వ్యాధి యుపశమించె, బాధ హెచ్చె!! '

  రిప్లయితొలగించండి
 9. మాస్టారూ, సవరణకి ధన్యవాదాలు. మరి సమస్య పాదాన్ని తేటగీతి చేస్తే నేను కొంచెం మార్చాలి.ఏమంటారు?

  రిప్లయితొలగించండి
 10. శాస్త్రిగారూ, భలేవారే. దీంట్లో క్షమించేంత ఏముంది. మీ కత్తికి రెండుప్రక్కలా పదునని మార్చి చూపించారుగా (నవ్వుతూ)!

  రిప్లయితొలగించండి
 11. కొంత మందువేయ కొండనాల్క కొఱకు
  ఊడిపోయె గదర యున్న నాల్క !
  కొందరి కపుడపుడు మందులు వికటించు
  వ్యాధి యుపశమించె బాధ హెచ్చె !

  రిప్లయితొలగించండి
 12. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చంద్రశేఖర్ గారు చెప్పినట్లు మీ కత్తికి రెండువైపులా పదునే. తేటగీతాలను అలవోకగా ఆటవెలదులుగా మార్చారు. చాలా బాగున్నాయి. సంతోషం! అభినందనలు.

  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. డా. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

  ముళ్ళపూడి వారి చమత్కారము :
  ఒక చర్మ వ్యాధి నిపుణుడు క్రొత్తగా నిపుణుడయిన తనకుమార రత్నము ఒక రోగి వ్యాధిని పూర్తిగా నయము చేసిన సందర్భమున :
  వరదరాజు గారు వ్యాధిగ్రస్తు లవుట
  లాభకరము మనకు ,శోభ యనుచు
  పూర్ణ హితముఁ జేయ పూజ్యమ్మె మనకిక
  వ్యాధి యుపశమించె ; బాధ హెచ్చె !

  రిప్లయితొలగించండి
 14. నరసింహ మూర్తి గారూ,
  చమత్కారభరితమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. కార్పొరేటువైద్య ఘన చరిత్రల రోగు
  లాస్తు లమ్ము కొనిరి యప్పు లైరి
  వాస్త వమ్ము- వలదు , వలదురా యీబాధ
  వ్యాధి యుపశమించె బాధ హెచ్చె

  --- వెంకట రాజారావు . లక్కాకుల

  --- బ్లాగు:సుజన సృజన

  రిప్లయితొలగించండి
 16. గురువు గారికి నమస్కారములు
  మన్మోహన్ కష్టాల పై

  ఆ: మంత్రులెల్ల నీకు మచ్చలు బెట్టగా
  బెట్టినావు కట్ట గట్టి ఖైదు
  నందు, వారి చర్య లరికట్టి జూడగ
  వ్యాధియుపశమొంచె బాధహెచ్చె

  రిప్లయితొలగించండి
 17. గురువు గారూ మీరు పద్యానికి వైద్యము చేయ లేదు. నేను బాధపడనుగా !

  వరదరాజు గారి వ్యాధియు మిగులుట
  లాభకరము మనకు,శోభ యనుచు
  పూర్ణ హితము జేయ,పూజ్యమ్మె మనకిక
  వ్యాధి యుపశమించె,బాధ హెచ్చె.

  రిప్లయితొలగించండి
 18. శ్రీపతిశాస్త్రిసోమవారం, జులై 11, 2011 8:01:00 PM

  శ్రీగురుభ్యోనమ:

  జ్వరము వచ్చె ననుచు పిరికివాడొక్కడు
  గుళికలెన్నొ మ్రింగె కుదురుకొనగ
  పగటి నిద్ర పెరిగె పైత్యమధికమాయె
  వ్యాధి యుపశమించె బాధ హెచ్చె

  రిప్లయితొలగించండి
 19. శ్రీపతిశాస్త్రి గారూ మీ "జ్వరము వచ్చె" పూరణ బాగుంది.

  రిప్లయితొలగించండి
 20. నలత చేసె నంచు నలువురు చెప్పినన్
  వినక వైద్యమునకు వెడలి యుంటి
  ప్రభువు లాసు పత్రి విభవమ్ము గనినంత
  వ్యాధి యుపశమించె బాధ హెచ్చె.

  రిప్లయితొలగించండి
 21. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
  కార్పోరేట్ వైద్యం గురించి చక్కని పూరణ చేసారు. అభినందనలు.
  ‘అప్పులపాలైరి’ అనేది ‘అప్పులైరి’ అయిందా? ‘అప్పులయ్యె’ అంటే సరిపోతుంది కదా!

  వరప్రసాద్ గారూ,
  చక్కని పూరణ. అభినందనలు.

  డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  నిజమే. ‘వ్యాధిగ్రస్తు’ డంటే గణదోషం. నేను గమనించలేదు. గమనిస్తే ‘వ్యాధి వృద్ధిని పొంద’ అనే సవరణను సూచించేవాడిని. మీరే సవరించారు. ధన్యవాదాలు.

  శ్రీపతి శాస్త్రి గారూ,
  మంచి పూరణ. బాగుంది. అభినందనలు.

  మిస్సన్న గారూ,
  ఉత్తమమైన పూరణ. అభినందనలు.
  ‘ప్రభువు లాసుపత్రి" అంటే ప్రభుత్వ ఆసుపత్రియా, లేక కార్పోరేట్ ఆసుపత్రా?

  రిప్లయితొలగించండి
 22. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  01)
  _______________________________

  అద్దె యిల్లు మనకు - వద్దటంచు నతని
  పోర సాగె భార్య - పూట పూట !
  అప్పు చేసి కట్ట - చెప్పుకో లేనట్టి
  వ్యాధి యుపశమించె - బాధ హెచ్చె.
  _______________________________

  రిప్లయితొలగించండి
 23. కలన యంత్ర మందు తొలగింప వైరస్సు
  కంది శంకరయ్య గారి బ్లాగు
  తొలగి నన్ను మిగుల కలగించి వేసెనే
  వ్యాధి యుపశమించి బాధ హెచ్చె !

  గురువు గారూ అందువలన నా పూరణను మీ ఈ మెయిలుకి పంపాను. మరల మీ బ్లాగు చిరునామా కలన యంత్రములో చేర్చాను.

  రిప్లయితొలగించండి
 24. గురువుగారూ ప్రభువుల ఆసుపత్రి అంటే ఏలినవారి ఆసుపత్రి అదే ప్రభుత్వాసుపత్రి అనే నా భావం. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 25. మూర్తి మిత్రమా మీ వైరస్సు వ్యాధి బాధ చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 26. మిస్సన్న గారూ ,ధన్యవాదములు. వ్యాధుల పైన, మందుల పైన, వైద్యుల మీద,హాస్పిటల్స్ మీద పూరణలు బాగనే వచ్చాయి. మీరు సర్కారు వారి భరతము బాగానే పట్టారు.బాగుంది.

  రిప్లయితొలగించండి
 27. వసంత కిశోర్ గారూ,
  ఇల్లు లేదనే మనోవ్యాధి ఉపశమించి, దానికోసం చేసిన అప్పుల బాధ మిగిలింది. చక్కని ఊహ. బాగుంది. అభినందనలు.

  డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ఇంతకీ మన ‘శంకరాభరణం’ కూడా ఒక వైరస్సేనా? దీని వల్ల వచ్చే వైరల్ ఫివర్ కు మందేమిటో? చంద్రభాసురమని చెప్పకండి :-)
  మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 28. శ్రీపతిశాస్త్ర్త్రిమంగళవారం, జులై 12, 2011 2:30:00 PM

  గురువుగారు ధన్యవాదములు
  రావుగారు ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 29. గురువు గారూ కలన యంత్రము మందగమన అయితే నాకు చేత కాదు కాబట్టి వైరస్సులు పీక మనిచ్చాను. నాకిష్టమైన బ్లాగులన్నీ తొలగించా డా.నిపుణుడు. మరల మెల్ల మెల్లగా ఆ బ్లాగులు పేర్చుకోవాలి.
  చూచి రమ్మంటే,కాల్చి వచ్చాడని మందులైనా శస్త్ర చికిత్స లైనా మిగిలిన అవయవాల పైన కూడా వాటి ప్రతాపము చూపిస్తాయి కాబట్టి గమనించుకోవాలి.

  రిప్లయితొలగించండి
 30. డా. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,కంప్యుటర్ వైరాస్సులు తమంతట తాము బతకలేవు ఇంకొకళ్ళని పట్టుకుని జీవిస్తాయి. దానికి తోడు ఒక దాని నుండి ఒక దానికి పాకుతాయి. అందుకని వాటిని తరిమేయ్యాలంటే అవి దాగున్న గూళ్ళని కూడా తీసేయ్యాలి.

  రిప్లయితొలగించండి