13, జులై 2011, బుధవారం

సమస్యా పూరణం -391 (కాముకులను గొలువ)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
కాముకులను గొలువఁ గలుగు యశము
ఈ సమస్యను పంపిన కవిమిత్రునికి ధన్యవాదాలు.

25 కామెంట్‌లు:

  1. ప్రాణులన్ని ఒక్క పరమాత్ముడనుచును
    యెల్లవేళలందు నిచ్ఛతోడ
    ధర్మమార్గమందు తరియించు నామోక్ష
    కాముకులను గొలువ గలుగుయశము

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    మందాకిని గారూ ! బావుంది !

    01)
    ___________________________________

    పరమ వీరు డైన- పల్గుణుం డానాడు
    పడక గృహము సొచ్చి - పథికు డయ్యె !
    పడతి ,బాల ,వృద్ధ - ప్రాణసంరక్షణా
    కాముకులను గొలువ - గలుగు యశము !
    ___________________________________
    పథికుడు = బాటసారి = దేశ సంచారి

    రిప్లయితొలగించండి
  3. దేశమ! వినుమ! నిజ దేశ భక్తుల, యవి
    నీతి నెదిరి పోరు నేత, శ్రమను
    రాత్రి పగలు పంచు శ్రామికులను, శాంతి
    కాముకులను, గొలువఁ గలుగు యశము

    రిప్లయితొలగించండి
  4. వేద వాక్కు లెఱిగి విజ్ఞాన సంపద
    భారతమ్ము నిలిపె వ్యాస మునియు
    అట్టి ఘనుడె దగును నాంధ్రింప నని జ్ఞాన
    కాముకులను గొలువఁ గలుగు యశము !

    రిప్లయితొలగించండి
  5. మందాకిని గారు,వసంతకిశోర్ గారు, హనుమచ్ఛాస్త్రి గారుల పూరణలు అద్భుతముగా ఉన్నాయి.

    రిప్లయితొలగించండి
  6. వ్యాస శుక శమీక వాల్మీక మునిముఖ్య
    పుంగవులను, పుణ్య పురుషులధిక
    శాంత చరులఁ,నిత్య సన్యాసులౌ సత్య
    కాముకులను గొలువఁ గలుగు యశము!

    రిప్లయితొలగించండి
  7. క్రింది పోస్టింగు అడవి గాచిన వెన్నెల సమస్య క్రింద పోస్టు చేశాను. మిత్రుల సౌలభ్యం కోసం ఇక్కడ కూడా పోస్టు చేస్తున్నాను.
    "కవిమిత్రుల వైవిధ్యమైన పూరణలు చాలా ఆనందం కలిగించాయి. తెలుగులో మనకి కొన్ని జాతీయాలు వున్నాయి, జాతీయం అనేది ఒక ప్రత్యేక అర్థంలో, ప్రత్యేక సందర్భంలో ప్రయోగింప బడుతుంది. ఇవి చాలా మటుకు మనం నిత్య సంభాషణలో వాడతాము. మీకందరికీ తెలిసిందే. ఇక, "అడవిగాచిన వెన్నెల" లాగానే, "దున్నపోతు మీద వర్షం", "చెవిటివాడి చెవిలో శంఖం వూదటం" అలాంటివే. కొందరు యువకులకు ఈ రోజుల్లో ఈ జాతీయాలు తెలియటం లేదు. భాషలోని సొగసులు పోయి, కట్టే-కొట్టే-తెచ్చే- అనే వాడకం ఎక్కువవుతోంది.
    ఇంగ్లీషులో కూడా అదే పరిస్థితి అని బ్రిటిషు ఇంగ్లీషు మాట్లాడే వాళ్ళు అమెరికన్ ఇంగ్లీషు గురించి వాపోతూ వుంటారు. మార్పు సహజమే అయినా ఉధృతం ఎక్కువయింది. ఏం చేస్తాం, కుర్రాళ్ళల్లో కుర్రాళ్ళుగా వుండవలసినదే."

    రిప్లయితొలగించండి
  8. కామి కాక మోక్ష కామి కాడని యంద్రు.
    కామమన్న యదియె. ఘనుల కెఱుక.
    కాముకులకు గలుగు ఘనముక్తి.తన్మోక్ష
    కాముకులను గొలువఁ గలుగు యశము

    రిప్లయితొలగించండి
  9. తెలుగు నుడి యెటు వోయెనో దెలియరాదు
    సంస్కృ తాంగ్లాల నుర్దూల చలువ నూరు
    మాటల కెనుబ దితరమ్ము - మాతృ భాష
    కాముకులను గొలువ గలుగు యశము

    సంస్కృతము తల్లియన గాదు - సాహ చర్య
    గరిమ సగపాలు కనుమరుగయ్యె నితర
    మాంగ్ల ముర్దుల పాలయ్యె - మాతృ భాష
    కాముకులను గొలువ గలుగు యశము

    మాతృ యే భాష ? భాష యే మాట? మనము
    నోట మాటాడు నుడి తెల్గు నుడియె? సంస్కృ
    తమ్మొ? యుర్దొ?యాంగ్లమ్మొ? - నా తెలుగు నుడుల
    కాముకులను గొలువ గలుగు యశము

    ఘనుడు చిన్నయ సూరి సంఘటిత పరచె
    నిది తెలు గిది సంస్కృతమని తుదిని తెలుగు
    జల్లి తత్సమగతినిచ్చి - తల్లి నుడుల
    కాముకులను గొలువ గలుగు యశము

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    --- బ్లాగు: సుజన సృజన

    రిప్లయితొలగించండి
  10. మంత్రి పదవిలో కుతంత్రాలు పన్నెడు
    జంత్ర గాళ్ళ బ్రతుకు జైళ్ళ వశము,
    చేత లందు మంచి చేవగల్గిన,ధర్మ
    కాముకులను గొలువ గలుగు యశము!

    రిప్లయితొలగించండి
  11. మందాకిని గారూ,
    మోక్షకాముకుల మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మీరేమో యడాగమాలను అవసరం ఉన్నచోట వదలి, లేని చోట పెడుతున్నారు.
    ‘ప్రాణులన్ని (యొ)క్క పరమాత్ముడే యనుచు
    (నె)ల్లవేళలందు ....’

    రిప్లయితొలగించండి
  12. వసంత కిశోర్ గారూ,
    మంచి విషయాన్ని ఎన్నుకున్నారు పూరణకు. అభినందనలు.
    ‘స్త్రీబాలవృద్ధ’ సమాసంలో స్త్రీని పడతిగా ప్రక్కన పెట్టారు. ‘వృద్ధప్రాణ’ అన్నప్పుడు ‘ద్ధ’ గురువవుతుంది కదా!

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ శాంతికాముకత్వపు పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    అందుకే కదా రాజరాజ నరేంద్రుడు ఋషితుల్యుడైన నన్నయను భారతాంధ్రీకరణకు ఎన్నుకున్నాడు. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. చంద్రశేఖర్ గారూ,
    నిత్యసత్యాన్వేషుల మీ పూరణ ఉత్కృష్టంగా ఉంది. అభినందనలు.

    చింతా రామకృష్ణా రావు గారూ,
    అద్భుతమైన పూరణ. ధన్యవాదాలు.

    మాతృభాషాభిమానం మీ పద్యాలలో పెల్లుబుకుతున్నది. సంతోషం.
    ఇచ్చిన సమస్య ఆటవెలది పాదం. మీరేమో అన్నీ తేటగీతులు వ్రాసారు. సవరించే ప్రయత్నం చేస్తారా?

    మంద పీతాంబర్ గారూ,
    మనోహరమైన పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శంకరయ్య గారూ! నమస్సులు ----

    పొరపాటు జరిగింది . మన్నించండి . సమస్య పాదాన్ని మీరనుతిస్తే
    " కాముకులను గొలువ గల్గు ఘన యశమ్ము " -అని నా వరకు మార్చు
    కొంటాను . మీ రాజారావు .

    రిప్లయితొలగించండి
  15. "దీప్తి నొందలేక ప్రాప్తించు నపకీర్తి
    కాముకులను గొలువ ; గలుగు యశము
    వేంకటాద్రి పతిని వేనోళ్ళ కీర్తింప"
    అనిన అన్నమయ్య వినుతి కెక్కె !

    రిప్లయితొలగించండి
  16. శ్రీపతిశాస్త్రిబుధవారం, జులై 13, 2011 8:31:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    శంకరయ్యగారు శ్లాఘనీయులు కద
    పద్యములను మనకు పంచు చుండ
    శంకరాభరణమె శ్రమకు ఫలము పద్య
    కాముకులను గొలువ కలుగు యశము


    ఎట్టి విషయమైన నెంతయో విఫులముగ
    నెట్టులోన చూడ బెట్టినారు
    శంకరాభరణము శంకరార్యా డాటు
    కాముకులను గొలువ కలుగు యశము

    అందరికి నమస్కారములు. శంకరయ్య గారి శంకరాభరణము చూడాలనే కోరిక కలిగిన వారితో స్నేహము కీర్తినిస్తుంది అనే భావంతో వ్రాశాను. తప్పులు మన్నింపప్రార్థన.

    రిప్లయితొలగించండి
  17. పోరు బాటఁ బట్టఁ గౌరవు లెల్లరు
    సంధి పొసఁగు టెట్లు సభ్యు లార
    భావ్య మౌనె రణము ? భారత సంక్షేమ
    కాముకులను గొలువఁ గలుగు యశము

    రిప్లయితొలగించండి
  18. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    01 అ)
    ___________________________________

    పరమ వీరు డైన- పల్గుణుం డానాడు
    పడక గృహము సొచ్చి - పథికు డయ్యె !
    చెలువ ,బాల ,వృద్ధ ,- జీవ సంరక్షణా
    కాముకులను గొలువ - గలుగు యశము !
    ___________________________________
    పథికుడు = బాటసారి = దేశ సంచారి

    రిప్లయితొలగించండి
  19. 02)
    ___________________________________

    రాము నందు మిగుల - రాగమ్ము తోనుండి
    రాగ భావములను - రాల జేసి
    రాగ మొలుకు దివ్య - రామ నామామృత
    కాముకులను గొలువ - గలుగు యశము !
    ___________________________________
    రాగము = అనురాగము
    రాగము = మాత్సర్యము
    రాగము = నాట మొదలగు రాగము

    రిప్లయితొలగించండి
  20. లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    నేనొప్పుకోను ... నేనొప్పుకోను ... # $ @ & # ~% ? ...
    అయితే ఓకే!
    (నిన్ననే ‘ఇట్లు శ్రావణీసుబ్రహ్మణ్యం’ సినిమా చూసాను) :-)

    రిప్లయితొలగించండి
  21. నాగరాజు రవీందర్ గారూ,
    ఉత్తమమైన పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బ్లాగు గురించి రెండు చక్కని పద్యాలు చెప్పారు. ధన్యవాదాలు.
    రెండవ పద్యం మొదటి పాదంలో ‘ఎంతయొ విపులముగ’ అన్నచో గణదోషం.‘ఎంతొ విపులముగ’ అంటే సరి! ‘ఆటు కాముకులకు’ ..?
    *
    మిస్సన్న గారూ,
    టీవీలో ‘మహాభారతం" సీరియల్ చూస్తూ రాసారా యేమిటి? చక్కని పూరణ అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    సవరించిన పూరణ బాగుంది. ఇక మీ రెండవ పూరణ ఉత్తమోత్తమం. ధన్యోऽస్మి! అభినందనలు.

    రిప్లయితొలగించండి
  22. గురువుగారూ ధన్యవాదాలు.
    వసంత మహోదయా! రమ్యమైన రామనామము వంటి పూరణ! అభినందనలు.

    రిప్లయితొలగించండి