10, జులై 2011, ఆదివారం

చమత్కార పద్యాలు - 100 (ప్రహేళిక)

వృక్షాగ్రవాసీ న చ పక్షిరాజః
త్రిణేత్రధారీ న చ శూలపాణి |
త్వగ్వస్త్రధారీ న చ సిద్ధయోగీ
జలంచ బిభ్రత్ న ఘటో న మేఘః ||
(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)
నా అనువాదం -
తే. గీ.
చెట్టుపైన వసించు, పక్షి యనఁ దగదు;
మూఁడు కన్నులుండును, కాదు పురహరుండు;
చర్మవస్త్రధారియె, కాదు సంయమియును;
జలసహితమె, కాదది కుండ, జలధరమును;
సమాధానం - కొబ్బరికాయ.
కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
"కొబ్బరికాయఁ గొట్టినను గోరికఁ దీర్చనివాఁడు దేవుఁడా?"

10 కామెంట్‌లు:

 1. దెబ్బలతోడ నేనుయను దేహపు భ్రాంతిని వీడినట్లుగా
  కొబ్బరికాయఁ గొట్టినను గోరికఁ దీర్చనివాఁడు దేవుఁడా?
  దుబ్బుగ నున్న పీచు యను దుష్టపు మాయను పీకి వేసి యా
  కొబ్బరి గుజ్జు, నీరమను కోరిన జీవిత మిచ్చి బ్రోవడా ?

  రిప్లయితొలగించండి
 2. డబ్బులు చాలు చాలునిక; డాబులవెందుకు? పెక్కురూకలౌ
  కొబ్బరికాయకొట్టినను; గోరికఁదీర్చనివాడు, దేవుడా
  యబ్బురమౌపతిన్ యొసగి హా!యన నన్నిటు మోసగింతువా?
  మబ్బుల చాటునుండినిటు మమ్ములఁ జూచుచు నుంటివా!హరా!

  పూజలు, టికెట్లు అంటూ కొబ్బరికాయకు డబ్బులివ్వు అదే ఎక్కువ ఇక్కడ. అంటూ మందలించే పతిని చూసి ఆ సతి మనసు లోని మాటలు ఇలా ఉంటాయి అని ఒక భావన.

  రిప్లయితొలగించండి
 3. నిబ్బరమైన భక్తి, పరిణీత మనస్సున, నమ్ము మెల్లెడన్
  అబ్బురమై చెలంగెడు మహాత్ముని! చిల్లర దేవతల్ వృథా!
  గొబ్బున యార్తిఁ, పత్రమునొ, కొద్ది జలమ్మొ, సుమమ్మొ యుంచినన్,
  కొబ్బరికాయఁ గొట్టినను గోరికఁ దీర్చనివాఁడు దేవుఁడా?"

  రిప్లయితొలగించండి
 4. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, జులై 10, 2011 11:17:00 AM

  ఇభ్భరతాన్వయంబున మదీప్సితముల్ నెరవేరగా జనుల్
  ఇబ్బడిముబ్బడిన్ జనుదురెచ్చటికైనను కష్టమోపుచున్,
  అబ్బురమాయెనాకుమరి,యర్చన జేసితి నా మనస్సనే
  కొబ్బరికాయగొట్టినను,కోరిక దీర్చనివాడు దేవుడా?

  రిప్లయితొలగించండి
 5. యబ్బురమైన జీవనము హాయిగ సాగఁగఁ గోర్కెలేలరా?
  అబ్బిన దేనుభాగ్యమని యాశనుఁ,గోరిక లొగ్గవేలరా?
  పబ్బమునైనఁ నేఁ గొలిచి, భంగముఁ బొందను పో! యనంగదే!
  కొబ్బరికాయకొట్టిననుఁ గోరికఁ దీర్చని దేవుడేల? రా!

  రిప్లయితొలగించండి
 6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  ‘నేననెడి దేహపుభ్రాంతి’, ‘పీచనెడి’ అంటే బాగుంటుంది.

  మందాకిని గారూ,
  మనోహరంగా ఉన్నాయి మీ రెండు పూరణలు. అభినందనలు.
  మొదటి పూరణలో ‘పతిన్ + ఒసగి = పతినొసగి’ యడాగమం రాదు. ‘అబ్బురమైన భర్త నిడి ...’ అనండి.
  ఇక రెండవ పూరణను ‘య’డాగమంతోనే ప్రారంబించారు. ‘అబ్బుర’మని మొదలుపెడితే కాదా? ఈ ‘యట్’లు ఎట్టుల వదిలి పెడతాయో?

  రిప్లయితొలగించండి
 7. మిస్సన్న గారూ,
  అద్భుతమైన పూరణ. అభినందనలు.

  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం. పూరణ బాగుంది. అభినందములు.
  కాకుంటే పాదాలను అచ్చులతో ఆరంభించారు.

  రిప్లయితొలగించండి
 8. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, జులై 10, 2011 8:16:00 PM

  గురువుగారూ,

  ఒక చిన్న సందేహము. పద్యపాదాన్ని అచ్చులతో మొదలు పెట్టరాదంటారా?? దీని గురించి కొంచం వివరించవలసినదిగా ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 9. శంకరార్యా ! సవరణలు సూచించి నందులకు ధన్యవాదములు.
  ఎంత వద్దనుకున్నా య కారములు అప్పుడప్పుడు దాడి చేస్తున్నాయి.

  రిప్లయితొలగించండి
 10. ("క్షమించాలి రాజమండ్రి స్టేషనులో శ్రీ కంది శంకరయ్య గారి సెల్ ఫోను పోయింది"... సత్తిబాబు)


  అబ్బురమౌచు పోవ నమలాపుర యాత్రను సత్తిబాబుతో
  గబ్బుది రాజమండ్రినట గందర గోళను ఫోను పోవగా
  తబ్బిబునౌచు కోవెలను దబ్బున చేరుచు చేతులెత్తుచున్
  కొబ్బరికాయఁ గొట్టినను గోరికఁ దీర్చనివాఁడు దేవుఁడా?

  రిప్లయితొలగించండి