11, జులై 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 101 (ప్రహేళిక)

సదావక్ర స్సదాక్రూరః
సదా పూజామపేక్షతే |
కన్యారాశిస్థితో నిత్యం
జామాతా దశమో గ్రహః ||
నా అనువాదం -
వక్రగతిఁ జరించు వాఁడు క్రూరుం డెప్పు
డైనఁ పూజలు గొన నభిలషించు
స్థిరముగా వసించుఁ జేరి కన్యారాశి
మనల కల్లుఁడు దశమగ్రహమ్ము.

కవిమిత్రులారా,
క్రింది సమస్యను పూరించండి.
అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్.

29 కామెంట్‌లు:

  1. బొల్లున దంచిన బియ్యము
    తెల్లని కాకులను నాకు తెచ్చిమ్మనుచున్
    అల్లరి జేయగ ; మామకు
    అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె వగచెన్.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ‘అనుచున్ + అల్లరి’ విసంధి గా వ్రాసారు. ‘తెచ్చిమ్మని వా/డల్లరి జేయగ" అందాం.

    రిప్లయితొలగించండి
  3. శంకరార్యా !మీ సవరణకు ధన్యవాదములు.
    సవరణ తో .....

    బొల్లున దంచిన బియ్యము,
    తెల్లని కాకులను నాకు తెచ్చిమ్మని - వా
    డల్లరి జేయగ ; మామకు
    అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె వగచెన్.

    రిప్లయితొలగించండి
  4. మాస్టారూ, శాస్త్రిగారూ, సమస్య పాదం "...మురిసెన్" అయితే "...వగచెన్" అని పూరించారు. భావరాహిత్యం లేదుగానీ చెబుదా మనిపించింది. అంతే!

    రిప్లయితొలగించండి
  5. చంద్ర శేఖర్ గారూ ! మురిపించే పద్యం కూడా చెబుతా చూడండి.ధన్యవాదములు.

    చిల్లర ఖర్చుకు సైత
    మ్మొల్లని మామకు సరైన ముకుతాడయ్యెన్!
    యిల్లును కట్టిమ్మనగా
    అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్!!

    రిప్లయితొలగించండి
  6. చిల్లర చేష్టలు మానదు
    పిల్లల వోలెయు నటించు,పెళ్లియ గునటే
    అల్లరి పిల్లకనగ,మే
    నల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్

    రిప్లయితొలగించండి
  7. చెల్లెలి భర్తకు దాఁ,మే
    నల్లుడు, చక్కగ చదువులఁ నలుగురి మెప్పుల్
    కొల్లగ పొంది,తన సుతకు-
    అల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్.

    రిప్లయితొలగించండి
  8. శాస్త్రిగారూ, ఏం చేస్తాం, ఇంట్లో నాన్-కోఆపరేషన్. అల్లుడు మామని ఇబ్బంది పెడుతుంటే అత్తగారు మురిసిపోయిందట. మరి, ఈ మొగుడూ ఒకనాటి అల్లుడేగా! కసి అలా తీర్చుకొంటున్నది. అంతేమరి.

    రిప్లయితొలగించండి
  9. ఒల్లక నెవరిని తన మే
    నల్లుని భర్తగ తనసుత నచ్చన్ , మగడున్
    "వల్లె ! "యని బెండ్లినిడ , మే
    నల్లుడు మగడయ్యె ననుచు నత్తయె మురిసెన్ !

    రిప్లయితొలగించండి
  10. చంద్రశేఖర్ గారూ,
    ఇందులో శాస్త్రి గారి తప్పేమీ లేదు. నేను మొదట ‘అత్తయె వగచెన్’ అనే ఇచ్చాను. కాని దానికంటే ‘మురిసెన్’ బాగుంటుందనుకొని మార్చాను. అప్పటికే వారి పూరణ వచ్చేసింది. ఆ తప్పు నాదే!

    రిప్లయితొలగించండి
  11. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ మురిపించే పద్యం నిజంగానే మురిపించింది. అభినందనలు.
    ‘వగచెన్’ ను నేనే ‘మురిసెన్’ అని మార్చి చంద్రశేఖర్ గారి చేత మాటపడేట్లు చేసాను. మన్నించాలి.
    మూడవపాదాన్ని యడాగమంతో ఆరంభించారు. పై పాదంలో వాక్యం పూర్తయినందున ఈ పాదాన్ని అచ్చుతో మొదలెడితే దోషం లేదు.

    రిప్లయితొలగించండి
  12. చంద్రశేఖర్ గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మంచి చుట్టరికాన్నే కలిపారు. బాగుంది. మంచి పూరణ. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. అయ్యో ! మాస్టరు గారూ! ఇందులో చింతించ వలసిన్దేమీ లేదండీ. మీరు రెండు విధాలుగా సమస్యను పూరించే అవకాశాన్ని నాకు కల్పించారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  14. తెల్లని వాడును, సుందర
    ఫుల్లకుసుమిత నయనుండు, బుధుడే మెచ్చెన్.
    పిల్లకుఁ గోడలి తమ్ముడు,
    అల్లుఁడె -మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్.

    రిప్లయితొలగించండి
  15. విల్లు విరిచి రఘునాధుడు
    పెళ్ళాడెను పృధివి సుతను - పృధ్వీసతియున్
    పెళ్ళాడి హరిని యరెరే !
    యల్లుడె మగడయ్యె ననుచు నత్తయె మురిసెన్

    --- వెంకట రాజారావు . లక్కాకుల

    రిప్లయితొలగించండి
  16. మందాకిని గారూ,
    మంచి పూరణ. చక్కని వరుస కలిపారు. అభినందనలు.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ఈ ఆలోచన నాకూ వచ్చింది. కాని భూదేవికి విష్ణువు ముందు మగడై తరువాత అల్లుడయ్యాడు కదా అని పూరణ ప్రయత్నం మానుకున్నాను.

    రిప్లయితొలగించండి
  17. శంకరయ్య గారూ!నమస్సులు!
    శ్రీమన్నారాయణునికి నిత్య కళ్యాణం- గనుక ముందు వెనుకల ఆలోచనే అక్కర్లేదనుకున్నాను . అయినా మిత్రుల తిట్టు పద్యాల దాడి తప్పదేమో నని భయ పడుతూనే పూరింఛాను . అయినా తెలుగు పద్యం లో ఆంగ్లపదాలు రాసిన కవిమిత్రుణ్ణి కించిత్ గుణ గానం చేసినందుకు కంటి చూపుతో భస్మం చేశారేమండీ!మీరు కూడా మీమిత్రుణ్ణి కాపాడుకొనే ప్రయత్న మైనా చేయక పోవడం అన్యాయంకదండీ! ఇప్పుడు నేను సశరీరుణ్ణా? అశరీరుణ్ణా? అర్ధం కావడం లేదండీ మరి . మీ రాజారావు

    రిప్లయితొలగించండి
  18. సంపత్ కుమార్ శాస్త్రిసోమవారం, జులై 11, 2011 10:10:00 PM

    కల్లాకపటము తెలియని
    పిల్లకు, బుధజనుల యూరిపెద్దలమది రం
    జిల్లగ కూతుకు తన మే
    నల్లుడె మగడయ్యెననుచు నత్తయె మురిసెన్.

    రిప్లయితొలగించండి
  19. లక్కాకుల వారూ,
    "అయినా తెలుగు పద్యం లో ఆంగ్లపదాలు రాసిన కవిమిత్రుణ్ణి కించిత్ గుణ గానం చేసినందుకు కంటి చూపుతో భస్మం చేశారేమండీ!మీరు కూడా మీమిత్రుణ్ణి కాపాడుకొనే ప్రయత్న మైనా చేయక పోవడం అన్యాయంకదండీ! ఇప్పుడు నేను సశరీరుణ్ణా? అశరీరుణ్ణా? అర్ధం కావడం లేదండీ మరి" అసలు అర్థం కానిది నాకే. నాకు తెలిసినంత వరకు నేనెవరినీ వ్యక్తిగతంగా ఏమీ ఆనలేదు. పూరణలో దొర్లే దోషాలను చాలా వరకు చూసీ చూడనట్లు వదిలేస్తాను. దోషం చెప్పినా వారి మనస్సు గాయపడకుండా సున్నితంగా చెప్పి సవరణలను సూచిస్తుంటాను. లేకుంటే వాళ్లు కోపంతోనో, విసుగుతోనో పూరణలు చేసే ప్రయత్నాలు మానేస్తారేమో అని భయం. సాధ్యమైనంత వరకు అందరినీ ఉత్సాహపరుస్తూ ‘తెలుగు పద్యానికి’ నాకు చేతనైనంత వరకు సేవ చేయాలని ఒక చిన్న కోరిక. అది మీ అందరి సహకారం వల్లనే సాధ్యమౌతుంది.

    రిప్లయితొలగించండి
  20. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________

    చల్లని యుల్లము గలిగిన
    తెల్లని పిల్లాడు మంచి - తెలివి గలాడున్
    మెల్లనిదౌ కూతు నకును
    అల్లుఁడె మగఁడయ్యె ననుచు - నత్తయె మురిసెన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  22. 02)
    _______________________________

    ఇల్లే వదలిన కూతురు
    పెళ్ళాడగ ప్రేమ తోడ - ప్రియమగు వానిన్ !
    ఉల్లము కుందిననూ , మం
    చల్లుడు మగఁడయ్యె, ననుచు - నత్తయె మురిసెన్ !
    _______________________________

    రిప్లయితొలగించండి
  23. 03)

    సీత వివాహ సమయంలో భూదేవి :
    ______________________________

    ఫెళ్ళున విల్లే విరిగెను
    ఉల్లము రంజిల్ల సీత - కుద్వాహమయెన్ !
    మల్లుడె తన కొమరిత కును
    అల్లుఁడె, మగఁడయ్యె ననుచు - నత్తయె మురిసెన్ !
    _______________________________

    మల్లుడు = శ్రేష్ఠుడు

    రిప్లయితొలగించండి
  24. వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    కాకుంటే కొన్ని వ్యావహారిక పదాలను ప్రయోగించారు. అదేమంత పెద్దతప్పు కాదు లెండి!

    రిప్లయితొలగించండి
  25. విద్యాసాగర్ అందవోలుఆదివారం, జులై 17, 2011 5:01:00 AM

    గురువు గారూ,
    నమస్కారం. నేను మన బ్లాగు లో పోస్ట్ చేసి చాలా రోజులైంది. అయితే, సమస్యలూ, పూరణలూ, ప్రహేళికలూ అన్నీ చూస్తున్నాను. ఆనందిస్తున్నాను.
    ఈ 'చమత్కార పద్యం' లో శ్లోకం చూసిన తరువాత, నేను విన్న శ్లోకం దీనికి భిన్నంగా వుందని దానిని మీకు పంపుతున్నాను.
    కన్యా రాశి స్థితౌ నిత్యం
    కుంభ రాశిం సమీక్షతే
    సదా వక్రీ సదా క్రూరః
    జామాతా దశమో గ్రహః

    ఇది మీరు కూడా విన్నారా?

    రిప్లయితొలగించండి
  26. విద్యాసాగర్ గారూ,
    బహుకాల దర్శనం ... సంతోషం!
    మీరు చెప్పిన శ్లోకమే ప్రసిద్ధం. అందరికీ తెలిసిందీ, నేను చిన్నప్పటినుండి వింటున్నదీ అదే. మా గురువు గారు సేకరించిన ప్రహేళికలలో ఈ పాఠాంతరం వైవిధ్యంగా ఉండడంతో ఇదికూడా అందరికీ తెలియాలని ప్రకటించాను.
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  27. Fair & Lovely

    తెల్లని మంగత్తకు నొక
    నల్లని కాంతుడు దొరకగ నాథుని వోలెన్
    నల్లని కూతుకు తెల్లని
    యల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్

    రిప్లయితొలగించండి


  28. పిల్లేమో గడుసాయెన్
    పిల్లోడయె మామ కొడుకు ప్రేమాయణమై
    పిల్ల మెడవంచ గా మే
    నల్లుఁడె మగఁడయ్యె ననుచు నత్తయె మురిసెన్


    జిలేబి

    రిప్లయితొలగించండి