1, జూన్ 2025, ఆదివారం

సమస్య - 5139

2-6-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నెత్తురుఁ జిమ్మించుమనెడి నేస్తుఁడు వలయున్”

(లేదా...)

“నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్”

24 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
మెత్తురొకొ! యుగ్రవాదము
జిత్తులతో పొరుగువారు చింతిల దూయన్
జిత్తొనర నీచులు 'జగతి'
నెత్తురుఁ జిమ్మించుమనెడి 'నేస్తుఁడు వలయున్'

ఉత్పలమాల
జిత్తుల, పొర్గు దేశమున చింతిల పౌరులు, కాల్చి చంపినన్
మెత్తురె యుగ్రవాదమును మేదిని విజ్ఙులు, నిట్టి క్రూరులన్
జిత్తొనరింప విశ్వమున చేతులు గల్పుచు నుగ్రమూకపై
నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్!

M.B.G.TILAK చెప్పారు...

సత్తువ కలిగిన వానికి
నిత్తెము శమమును మనసున నింపుట కంటెన్
కత్తిని చేబూని తులువ
నెత్తురుఁ జిమ్మించుమనెడి నేస్తుఁడు వలయున్

M.B.G.TILAK చెప్పారు...

కుత్తుక లుత్తరించిరటఁ గ్రూరులు మూర్ఖులు తీవ్రవాదులై
సత్తువ కల్గియున్న మన సైనికులే తగు పోరు సల్పగా
కత్తిని చేతబూనుటయె కాదు యధర్మము నడ్డగింపగా
నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్

Sitharamayya Solasa చెప్పారు...

మిత్త యగుమనుచు నెంతగ
మొత్తుకొనినగూడ కాదు పొమ్మని పలుకన్
సత్తువ జూపించి యతని
నెత్తురుఁ జిమ్మించుమనెడి నేస్తుఁడు వలయున్”

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ చిత్తుగ నోడించ రిపుల
సత్తువఁ జూపుచు ముదముగ సాయముఁ గనుచున్
నిత్తెము విడువక ననిలో
నెత్తురుఁ జిమ్మించుమనెడి నేస్తుఁడు వలయున్

ఉ॥ చిత్తుగ శత్రు యోధులను జెండఁగ సాయముఁ జేయ సర్వదా
వత్తును మిత్రమా వెరవ వైరులు నెప్పుడు భీతిఁ గాంచుచున్
సత్తువ తోడనంచు ఘన శక్తినిఁ బొందిన వీరుఁడాజిలో
నెత్తురుఁ జిమ్మఁజేయమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్

కర్ణుని దృష్టిలో పెట్టుకొని యండి

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

కత్తులు చేకొని మనుజుల
కుత్తు కలను కత్తరించు కుజనుల నెల్లన్
సత్తువ జూపుచు వారల
నెత్తురు జిమ్మించు మనెడు నేస్తము వలయున్

విరించి చెప్పారు...


కుత్తికలనుత్త రించుచు
నత్తరి యరివీరుల దునుమాడగ నిక సం
విత్తును గోరుచు నచ్చట
నెత్తురుఁ జిమ్మించుమనెడి నేస్తుఁడు వలయున్.



జిత్తులమారి వృద్ధులట క్షేమము కాదని శాంతియంచు సం
యత్తును మానమందురు పయస్యునెఱంగిన మిత్రుడొక్కడే
యత్తరి పాండవాధముల నంతము జేయగ నార్కి బోలెడిన్
నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

దుర్యోధనుడు దృతరాష్ట్రునితో పలుకుట:-

నెత్తికినెక్కునే విదుర నీతులు? నాయన! ఆంబికేయ!నా
పొత్తుకు తగ్గవాడు రవి పుత్రుడు కర్ణుడె!యీ సుయోధనున్
చిత్తమెఱింగి సూచనలు సేయుచు, జ్ఞాతుల జంపి పోరులో
నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్!!

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
కత్తులు బ్రాసముల్ వెలయు కాంచన భద్ర గృహంపు శోభలన్,
సత్తువ కొండ వోలె మది, శౌర్యముఁ గల్గితిఁ గాని నాకు న
జ్జిత్తులమారి నక్కలుగఁ జేరెడి శత్రులఁ జంప, వారిదౌ
నెత్తురు జిమ్మఁ జేయుమని నేర్పును జెప్పు సుహృత్తు గావలెన్ !

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చిత్తమునందు శంక గొని క్షేమమునారయు బంధు మిత్రులన్
కుత్తుకలన్ లవించుటన కూడని కార్యమటంచు నార్తితో
తత్తరమొందు పార్థునకు తత్త్వము బోధనజేసి పోరునన్
నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తత్తరపాటున పార్థుడు
చిత్తములో బంధుజనుల సేమమరయుచున్
బిత్తరపోవఁగననిలో
నెత్తురుఁ జిమ్మించుమనెడి నేస్తుఁడు వలయున్

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
“నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్”

ఉత్పలమాల :

పొత్తున నున్న చాలు మన పొందును మేలును గూర్చునంటిరే
సొత్తుల పొత్తులన్ మనల శుంఠలఁ జేసిరి దోచి సంపదన్
“నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్”
మత్తును వీడి శాంతి సుఖ మందుచు పీల్చగ స్వేచ్ఛ వాయువుల్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:నెత్తుటి దానము చేయగ
నిత్తరి నే నొక్క కేంద్ర మేర్పరచెద లే
నెత్తు రిడ బలము తగ్గదు
నెత్తురుఁ జిమ్మించుమనెడి నేస్తుఁడు వలయున్.
(రక్తదానశిబిరం ఏర్పాటు చేస్తాను కానీ రక్తం ఇస్తే బలం తగ్గుతుండని కొందరు భయ పడతారు.అలా భయపడ వద్దని చెప్పే మంచి ప్రచారకుడు అవసరం.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:"నెత్తురు నాకు నిండు మరి నేను స్వతంత్రత దెత్తు" నంచు దా
సత్తువ నింపు బోసు తన సైన్యము తో నెలుగెత్తి యిట్లనెన్
"మెత్తదనమ్ము కూడ దిక మీరలు కొందరి జేర్చు డిచ్చటన్
నెత్తురుఁ జిమ్మఁజేయుమని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్”
(నేతాజీ సుభాష్ చంద్ర బోస్ "మీరు నాకు నెత్తురు ఇవ్వండి.నేను మీకు స్వాతంత్ర్యం తెస్తాను అన్నది చారిత్రక వాస్తవమే.తన సైన్యం లో చేరే వాళ్లని రక్తం తో సంతకాలు చేయించాడు.ఆయన తన సైన్యం లోకి మరికొందరిని చేర్చ మని సైనికులకు చెప్పినట్లు.అలా రక్తం చిమ్మించమని నేర్పుగా చెప్పే వారు ఒకరు కావాలి అన్నట్లు. )

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఎత్తుల కెల్లఁ దలఁచి పై
యెత్తులు చిత్తమ్ము నందు హెచ్చిన రక్తిన్
నిత్తె మడరి చెమ్మట నా
నెత్తురుఁ జిమ్మింపు మనెడి నేస్తుఁడు వలయున్


సత్తువ సూపి కష్టపడఁ జక్కఁగ దక్కు జయమ్ము నిత్తెముం
దత్తర పాటు సెందక సతమ్మును వచ్చిన నేని పెక్కు లా
పత్తులు జంక కింతయును బంతము వీడక కార్య సిద్ధికై
నెత్తురుఁ జిమ్మఁ జేయు మని నేర్పునఁ జెప్పు సుహృత్తు గావలెన్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

కత్తిని త్రిప్పుచు రణమున
చిత్తుగ శత్రువుల తలలు ఛేదించుచు నీ
సత్తువను జూపి యనిలో
నెత్తురుఁ జిమ్మించుమనెడి నేస్తుడు వలయున్
.