3, జూన్ 2025, మంగళవారం

సమస్య - 5141

4-6-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కామము లేనట్టివానిఁ గాంత వరించెన్”

(లేదా...)

“కామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో”

(విట్టుబాబు గారికి ధన్యవాదాలతో...)

15 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
నీమము దప్పని ప్రవరుని
నా మారుండనుచు మెచ్చి యప్సరసయనన్
భామిని వరూధినియె దు
ష్కామము లేనట్టివానిఁ గాంత వరించెన్

ఉత్పలమాల
నీమము లెల్ల ప్రాణముగ నెమ్మిని మీరక స్త్రీల నన్యులన్
దా మది నెంచి మాతలుగ ధర్మమనన్ బ్రవరుండు వర్థిలన్
భామ వరూధినీ లలన వన్నెల ఱేనిగ నెంచి, పొంద దు
ష్కామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో!

Sitharamayya Solasa చెప్పారు...

రామునివలె పరజనిపై
కామము లేనట్టివానిఁ గాంత వరించెన్ ,
సేమమదియని ‌తలంచిన
యామె మనికి యంతయు నడి యనువుగ సాగెన్

విరించి చెప్పారు...


క్షేమమొసంగెడి వాడగు
రాముని సేవించుటదియె రమ్యమటంచున్
నీమము గలుగుచు మరియే
కామము లేనట్టివానిఁ గాంత వరించెన్.



ఏమని చెప్పమందువత డింతిని గోరి వివాహమాడినన్
ప్రేమగ నూసులాడుచు నభీష్టమెఱుంగడు సంతతమ్ము శ్రీ
రాముని పాదసేవ యది రమ్యమటంచును దానికన్న నే
కామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ నేమముఁ దప్పని వానిని
ప్రేమముఁ జూపుచుఁ పరఁగుచు వీడని వానిన్
గోముగఁ బర సతి యనఁగన్
గామము లేన్నట్టి వానిఁ గాంచి వరించెన్

ఉ॥ ప్రేమముఁ జూపునంచు నిరుపేదను తాల్చుచు నష్టకష్టముల్
ధామము లేని వాని కడు తాలిమి యన్నదటంచు మిన్నయౌ
హేమము కన్నయంచు బలహీనుఁడుగన్ బర నారియన్నచో
కామము లేనివాని నొక కాంత వరించె నదేమిచిత్రమో

చిత్రము పేదవాడైన ఏమీ లేనివాడైన వరించిందని యండి

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ చివరి పాదము కామములేనట్టి వాని కాంత వరించెన్ అండి

M.B.G.TILAK చెప్పారు...

కాముకి వరూధిని సుఖద
భామిని యత్నించె గాదె ప్రవరాఖ్యునికై
సేమము పరకాంత పయిన్
గామము లేనట్టివానిఁ గాంత వరించెన్

గ్రామణి యైనవాడు ప్రవరాఖ్యుడు చేరగ మంచు కొండపై
కాముక చిత్తవృత్తిగల కాంత వరూధిని కోరె నాతనిన్
ధామము చేరె సాత్త్వికుడు దస్ముడు తోడ్పడ, నన్యకాంతపై
కామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

రాముని తాటికి గాంచియు
కామము తో దరిని చేరి కలుషిత మతియై
తా మరులు గ నయ్యె డ నా
కామము లేనట్టి వాని కాంత వరించెన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:ప్రేమయె పిచ్చి యనన్ దగు
కామము లేనట్టివానిఁ గాంత వరించెన్
లే మనుచరితన ,నామెను
ప్రేమించె నొకండు తాను ద్వేషితు డగుచున్
(వరూథిని తనని కోరుకోని ప్రవరుని మీద కోరిక చూపింది.తన మీద ఆమెకి ప్రేమ లేకున్నా గంధర్వుడు ఆమెనే ప్రేమించాడు.ప్రేమ నిజం గా పిచ్చిదే.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:ఏమి వచింతు నింతి మన మెందుకు నెవ్వని మెచ్చుచుండునో
ప్రేమ నొసంగు నన్ విడచె విద్యను,నందము,సొమ్ము లున్న నా
ప్రేమను దెల్ప జక్కని కవిత్వము వ్రాసిన గాని గిల్లినన్
గామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో”
(అన్ని విధాలా తాను ప్రేమకి అర్హుణ్నని,తనని విడిచి అర్హత లేని వాణ్ని ప్రేమించిం దని ఒకడి ఆవేదన.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సామజ వరగమన వెదకి
భూమీశుల నెల్లఁ బుణ్య పురుషుని వేడ్కన్
రాముని వలెఁ బర భామా
కామము లేనట్టి వానిఁ గాంత వరించెన్


సోముని మించి నట్టి కడు సుందర రూపునిఁ గాంచి నంతటన్
భామల కున్న సంపదల పైన మనోరథ మాత్మ నిత్య సం
క్షేమము నెంచి డెందమునఁ గేవల విత్తపు టార్జనమ్ముపైఁ
గామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
“కామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో”

ఉత్పలమాల:

నీమపు నిష్ఠలన్ పెరిగి నీతిని వర్తిలు శైలపుత్రియే
ప్రేమగ జెప్పి చూచు దన పేర్ముడి తండ్రిని లెక్క సేయకే
కోమలి శీఘ్రమే జనెను కోరిన యీశుని గెల్వ నెంచియే
“కామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో”

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

గాములదొర పతియగుటకు
నీమముగా నహరహమ్ము నిటలాక్షునికై
హైమావతి తపియించెను
కామము లేనట్టివానిఁ గాంత వరించెన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నీమముతోడ శంకరుని నెమ్మనమందున నిల్పి యర్మిలిన్
హైమవతీలలామ తనువంతయు స్రుక్క తపంబొనర్చితా
వాముని పొందె నాథునిగ, భావజుఁ దర్పమడంచె నీశుఁడే
కామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

నీమముగా జీవించుచు
రాముని పూజించు చుండి ప్రతి దినమందున్
ప్రేమించుచు,పర సతిపై
కామము లేనట్టి వానిఁ గాంత వరించెన్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


సామజవరదుని గొలుచుచు
నేమము తోడను వ్రతములు నిశ్చల మతితో
నేమరక చేయువానిని
*“కామము లేనట్టివానిఁ గాంత వరించెన్”*

కాముని కంటిమంటలచెకాల్చుచుకాననువీడిసాగ గన్
భామినిగాంచుచన్తమినిభావమునందున విస్తుబోవుచున్
ధామమె లేకపుర్రెనటదాల్చుచు కేలున నేగువానినిన్
*“కామము లేని వాని నొక కాంత వరించె నదేమి చిత్రమో”*