5, జూన్ 2025, గురువారం

సమస్య - 5143

6-6-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు”

(లేదా...)

“కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్”

13 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
వంశనాశనాన వాలెను రారాజు!
పాండునందనులకు పట్టమందె
ధర్మరక్షణమున దండించి వైరికి
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు!

ఉత్పలమాల
పాడిగ నెంచ ధర్మజుఁడు భావ్యమటంచును సంధిఁ గూర్పఁగన్
వీడుచు భేషజమ్ములను విజ్ఞత జూపుమనంగఁ గౌరవుల్
దాడిగ బందిఁ జేయఁ గన దండనమెంచె! నధర్మ మైనచోఁ
గీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్

Sitharamayya Solasa చెప్పారు...

పాలు పట్టెదనని వచ్చిన పూతన
యనెడి యసుర కన్య నణచి నటుల
జిన్నతనము నందె చెడ్డ మనుజులకు
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ధర్మ రక్ష కొఱకు ధరణి లో జన్మించి
సజ్జ నాళి బ్రోవ సాహ సించి
జగతి యందు నున్న జనులలో దురితు కు
కీడొ సంగు వాడు కృష్ణుడo ద్రు

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఆ॥ నందనందనుఁడుగ విందుఁ జేసిన చిన్ని
కన్నఁడు తగు పగిదిఁ గాయు చుండ
సజ్జనుల, సుజనుల సఖుఁడు దుర్జనులకు
కీడొసంగు వాఁడు గృష్ణుఁ డంద్రు

ఉ॥ వేడుక మీర గోపికల ప్రేమనుఁ గాంచిన చిన్ని కన్నఁడే
చూడఁగ సజ్జనాళికిల శోభలఁ గూర్చుచుఁ బాండుపుత్రులన్
నీడగ నిల్చి ప్రోచెనని నేమముఁ బాసిన దుర్జనాళికిన్
గీడు నొసంగు వాఁడనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్

విరించి చెప్పారు...


ధర్మమిలను నిలుప ధరణినవత రించి
నట్టి ఘనుడు వాడె యక్షధరుడు
శిష్టులనిల రక్షజేయ దుష్టులకును
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు.


దూడల రక్ష జేయీటకు దుక్శృతి గర్వమడంచె మడ్గునన్
వేడెనటంచు నప్పుడట బ్రీతిని జూపి నొసంగె గాదుటే
చేడియ కంబరమ్ములను శిష్టుల బ్రోవగ దుష్టశ్రేణికిన్
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్.

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మేడలు మిద్దెలన్నియును మేలును గూర్చునె వృద్ధ జాతికిన్
గూడలు జారి కీళ్లరిగి గోడలు పట్టెడి కష్టమేలకో
వాడని యవ్వనంబదియు వచ్చిన మోదమునొంద వచ్చు మా
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్!!


మాకు + ఈడు = మాకీడు
ఈడు = యవ్వనము

M.B.G.TILAK చెప్పారు...

బాలకుండయినను పరమాత్ముడే గదా
దైత్యుల మదమడచి తనరుచుండు
తనను చంప వచ్చు దనుజులకే సదా
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు

చూడగ బాలుడైనను యశోద సుతుండు మహాత్ముడే గదా
కీడొనరింప వచ్చినను కిమ్మన కుండు సదా విపత్తులన్
గూడ గ్రహించుచున్ దనను కూల్చగ వచ్చిన రక్కసీడుకే
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ధర్మమునకు హాని ధరలోన గలిగిన
సాధుజనుల రక్ష సలుపు కొరకు
నవతరించి యాతఁడవనిలో దుష్టుల
కీడొసంగువాఁడు గృష్ణుఁ డంద్రు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చోడుమలెన్ని గల్గినను శోధనలన్ భరియించి యోర్మితో
వీడక ధర్మమార్గమును పేర్మిఁ జరించెడు సజ్జనాళికిన్
తోడుగనిల్చి దుర్జనుల దుర్మదమున్ గుదియించ వారికిన్
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

నల్లనైన మేను పెల్లుగ విలసిల్లఁ
గొంటె పనులు సేయ వెంట వెంట
మీఱి పసితనమున మేనమామ కకట
కీడొసంగు వాఁడు కృష్ణుఁ డంద్రు


క్రీడి సఖుండు బాంధవుఁడు కృష్ణుఁడు భారత యుద్ధ వేళలోఁ
దోడుగ నుండ సంతతము తోరము కన్పడఁ జేష్ట లందు నా
జాడలు ధర్మరాడ్వరుని సంపదకున్ నల రాడ్వరేణ్యు శ్రీ
కీడు నొసంగువాఁ డనుచుఁ గృష్ణునిఁ గొల్చిరి భక్తితో జనుల్

[శ్రీకి +ఈడు = శ్రీ కీడు]

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
కీడునొసంగువాడనుచు గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్

ఉత్పలమాల:

వీడు నసాధ్యుడే యనుచు, వీధుల వాడల నెందుఁ జూచినన్
తోడుగ గోపబాలురను తోషము మీరగ వెన్న దొంగిలన్
మోడుల శాపమున్ దొలఁగఁ, మోదము జంపగ రాక్షసాళికే
కీడునొసంగువాడనుచు, గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
కీడునొసంగువాడనుచు గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్

ఉత్పలమాల:

వేడుక తల్లి గర్భమున వేదన దీర్చగ బుట్టె శ్రీహరే
పీడను గల్గ భూసతికి పీచమడంచియు దుష్టశిక్షణన్
తోడును నీడగా నిలిచి దోషుల శిక్షల పాలనంబుతో
కీడునొసంగువాడనుచు గృష్ణుని గొల్చిరి భక్తితో జనుల్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

ధర్మము నిలుపంగ ద్వాపర యుగమున
అవతరించి నాడు నవని పైన
శిష్ట జనులఁ గాచి దుష్టుల కెల్లను
కీడొసంగు వాడు గృష్ణుఁ డంద్రు.