14, జూన్ 2025, శనివారం

సమస్య - 5152

15-6-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె”

(లేదా...)

“మగఁడు గుమారునిన్ గనె సుమా యని పల్కెను భార్య చేటితో”

14 కామెంట్‌లు:

విరించి చెప్పారు...

వృత్త సమస్య

మగడు గుమారునిన్ గనెసుమా యని పల్కెను భార్య చేటితోై.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మోసపోయిన సతి పెళ్ళి వేదికపైని వధువుతో...

తేటగీతి
"పెళ్లి కూతురా! నా మాట వినిన శుభము!
మాయలన్ బన్నువాడన మరులుగొలిపి
నీకు కాబోయెడు వరుడు, నిజము నాదు
మగఁడు, పుత్రునిఁ గనె", నని మగువ దెలిపె!

చంపకమాల
"తగదు వివాహమాడ నిను దారుణరీతిని మోసగింపగన్
నిగుడుచు వచ్చె నీ వరుడు నిక్కము జెప్పెద," నంచు "మున్పు నన్
సొగసుల రాణివంచుగొని చొప్పడినంతట కౌతుకాన నీ
మగఁడు, గుమారునిన్ గనె సుమా!", యని పల్కెను భార్య చేటితో!

Sitharamayya Solasa చెప్పారు...

చదువుకొనుట కొరకు విదేశమున కేగి
చాలయేండ్లు గడచియుండె , చదువు పూర్తి
యయినటుల దెలియుట జేత నచటికేగి
మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె

విరించి చెప్పారు...


నీదు చెల్లెలి కెప్పుడో నెలలు నిండె
తెలియ కుండెను విషయంబు చెలియ తనకు
కాను పయిన తెలుపుమని కలికి నడుగ
మగఁడు , పుత్రునిఁ గనెనని మగువ దెలిపె.


జగతిని పూరుషుండ్రనగ జాజర కారులె విశ్వసించెడిన్
మగువల డాగురించగల మాయలమారులె సత్యమియ్యదే
నిగవుగ నున్న దంచు నొక నెచ్చెలి వంచన జేసి దిచ్చు నా
మగఁడు గుమారునిన్ గనెసు మా యని పల్కెను భార్య చేటితో.

పఠానేని కార్తిక్ చెప్పారు...

చ.
ముగిసిన క్రీడయందు జయమొంది ప్రశంసల జల్లులోన పా
తిగ బడి గొప్పదౌ బహుమతిన్ గురువుల్లసిలి యందఁ జేయఁ జి
ర్నగవులు విచ్చి యాత్రమున నంబరమంటెడి హ్లాదమంది నా
మగడు గుమారునిన్ గనె సుమా యని పల్కెను భార్య చేటితో !

M.B.G.TILAK చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
M.B.G.TILAK చెప్పారు...

సంగ రంబున చెలరేగి జయమునొంది
యెల్లరి ప్రశంసల నడుమ నిల్లు జేర
వచ్చి పసిబిడ్డ తనయొడి పవ్వళించ
మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె

జగడములో చెలంగి తన శక్తిని చూపిన వీరుడొందెనే
ద్విగుణితమైన సంతసము వీరులనేకుల మెప్పులందగా
స్వగృహము చేరి చిట్టడుగు భార్యయొడిన్ బవళించి యుండగా
మగఁడు గుమారునిన్ గనె సుమా యని పల్కెను భార్య చేటితో

[కను = చూచు]

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

గొప్ప యు ద్యో గమును జేయు కోర్కె తోడ
వెడలి ఛాలకా ల మైన పిదప వచ్చి
మగడు పుత్రుని గనె నని మగువ దెలి పె
ముదము తోడుత పొరుగింటి ముదిత కపుడు

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:పుత్రుడను బ్రేమనే గాక బుడమి యందు
వంశకీర్తిని నిలిపెడు పండితుడని,

సకలశాస్త్ర కోవిదుడని సంతసమున
మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె
(ఇక్కడ కనెను అంటే ఆ విధంగా చూసాడు అనే అర్థం లో.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

చం:పగ గొని స్వచ్ఛ బంధమున పాపపు నిందల వేసి "పుట్టెనా
మగనికి పుత్రు?"డంచు నవమాన మొనర్చగ చేటి "పాతకీ !
మగనిని నీవె మార్చితివి,మత్పతి పోలిక లన్ని రాగ నా
మగఁడు గుమారునిన్ గనె సుమా" యని పల్కెను భార్య చేటితో
(నీ కొడుకు నీ భర్తకే పుట్టాడా? అని స్నేహితురాలు పగ తో నింద వేస్తే ఈ సాధ్వి సమాధానం చెప్పింది.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ముదము నొసఁగదె యేరికిఁ బుత్ర సంభ
వమ్ము మీఁదు మిక్కిలి ప్రథమమ్ము పుడమి
వార్త వినినంత వేవేగ వచ్చి నాదు
మగఁడు పుత్రునిఁ గనె నని మగువ దెలిపె


విగత విచార రాజ దలివేణి సులోచన సంతసమ్మునన్
వగవక సుంత భీతిలక పంతము నూని కరమ్ము నాత్మలో
జగతిఁ జరించి యొక్క దివసమ్మునఁ గన్పడ కుండఁ బోవ నా
మగఁడు కుమారునిం గనెఁ జుమా యని పల్కెను భార్య చేటితో

Surya చెప్పారు...

పగలును రాత్రియున్ జదువు పైననె ధ్యాసను నిల్పి మేటియై
సుగుణ గుణాభిరాముడని జోతలు పల్కగ లోకులెల్లరున్
ప్రగతి పథంబునన్ జనుచు ప్రాభవమందగ ప్రేమ మీరగా
మగఁడు గుమారునిన్ గనె సుమా యని పల్కెను భార్య చేటితో

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

భార్య ప్రసవించెనని తెల్సి భర్త వచ్చి
పిల్ల వానిని ముద్దిడె ప్రేమతోడ
తల్లి యడుగగ వచ్చెనా యల్లుడనుచు
మగడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె.
(గనెను=చూచెను అనే అర్థంలో...)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...


ప్రసవ వేదన తోచేర వైద్య శాల
గంట వ్యవధిలోనెసుతుడుకలుగతొలుత
*“మగఁడు పుత్రునిఁ గనెనని మగువ దెలిపె”*
సన్నిహితులకెల్లనుసంతసమ్ముతోడ.