17, జూన్ 2025, మంగళవారం

సమస్య - 5155

18-6-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్”

(లేదా...)

“పరమాన్నంబునుఁ దిన్నవాఁడు దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్”

17 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మత్తేభవిక్రీడితము
పరిపాలించెడు యోగ్యతన్ గలిగి సత్ప్రావీణ్యమేపారఁగన్
ధరపై పీఠము నెక్కనొప్పెదమనన్ దక్కంగ పట్టమ్మదే
నిరుపేదల్ తిను నూకలైన విడకే నేరమ్ములన్ దోచుచున్
పరమాన్నంబునుఁ దిన్నవాఁడు దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
పరిపాలించెడు యోగ్యత
ధరపై గలవారమనుచు దక్కగ పదవుల్
నిరుపేదల నూకలతో
పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్

Sitharamayya Solasa చెప్పారు...

పురమునగల జనులందున
దరిద్రులకొసగ తలంచు తరుణమునందున్
పురుగులుపడి చచ్చిన యా
పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్

పఠానేని కార్తిక్ చెప్పారు...

మ.
తరుణీ రత్నము వంటయింటి నొక పాత్రం దియ్యనౌ బెల్లమున్,
వర దుగ్ధంబును, బియ్యముం గలిపి యింపారంగ వండంగ న
ప్డు రయంబై యటఁ జేరు సోదరునిఁ దాఁ బోపొమ్మనెం, బల్కె "నా
పరమాన్నంబును దిన్నవాడు దుదకుం పాపాత్ముడౌ !" జూడగన్ !

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

నిరుపేదల పిడించుచు
తరగని సంపదలు పొంది ధనికుం డ గుచు న్
కరుణ ను మరచియు మసలుచు
పరమాన్నము దిన్న వాడు పాపా త్ము డగున్

విరించి చెప్పారు...


మరణించె మిత్రు డొక్కం
డిరుగింటనటంచు నెఱగి యించుక నైనన్
మెరమెర లేక స్వగృహమున
పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్.


పొరుగింటన్ వసియించెడిష్ట సఖునిన్ ముత్తాత రోగమ్ముచే
మరణంబందిన వేళ కొండలము నేమాత్రమ్ము లేకుండగా
పరితోషమ్మును జూపుచున్ గృహమునన్ పర్వమ్ము గా నెంచుచున్
పరమాన్నంబునుఁ దిన్నవాఁడు దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్.

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

నిరుపేదల్ గడు బాధజెందుచును
గన్నీరున్ సదా గార్చుచున్
దరచున్ దిండి లభించకన్ మిగుల
క్షుద్బాధార్థులైయుండియున్
ధర జీవించుచునుండగా నితరలున్
సద్భాగ్యంబుతో నిత్యమున్
పరమాన్నంబును దిన్నవాడు దుదకున్
బాపాత్ముడౌ చూడజూడగన్

M.B.G.TILAK చెప్పారు...

వరదుని కరుణకు పాత్రుడు
పరమాన్నముఁ దిన్నవాఁడు; పాపాత్ముఁ డగున్
బరులన్ దోచిన చోరుడు
నరకము ప్రాప్తించు ననెడి నమ్మిక కలదే

పరమేశుండొనగూర్చుగాదె భువిపై ప్రాప్తించు నైవేద్యమే
పరమాత్ముండగు వాడొసంగెననుచున్ భావింప ధన్యుండగున్
బరమాన్నంబునుఁ దిన్నవాఁడు; దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్
బరులందోచి భుజించునట్టి ఖలుడే పాపాలు పెంపొందగా

హిరణ్మయి చెప్పారు...

ఒరులాకలి అనునప్పుడు
పరుషముగనుతిట్టి, కసరి పంపిన వాడున్,
పరమశివపదములువదలి
పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:ఎరుగక తత్త్వము క్రైస్తవ
గురు డిట్లనె "పాయసమ్ము గుడువగ కీడుల్
జరుగవు, ప్రసాదముగనే
పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్”
(క్రైస్తవులకి దేవుడి ప్రసాదం తింటే తప్పు అనే నియమం ఉంటుంది.మామూలుగా ఏది పెట్టినా తింటారు కానీ ప్రసాదం అంటే తినరు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:స్థిరమయ్యెన్ మధుమేహ మీ తనువునన్ దేవా!నినున్ గూర్చి చ
క్కెర పొంగళ్లను జేయ దింటి నదియే కీడయ్యెనా? నాకు చ
క్కెర ఘోరమ్ముగ రెచ్చె,నెంతొ యనురక్తిన్ నీ ప్రసాదమ్ముగా
పరమాన్నంబునుఁ దిన్నవాఁడు దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్”
(షుగర్ పేషెంట్ దేవుడి ప్రసాదం గా చక్కెర పొంగలి తిని షుగర్ పెరిగి దేవుణ్ని సాదిస్తున్నాడు.)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

హరికృపబడయునుభక్తిగ
*“పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్”*
దురితములనాచరించుచు
మరచినసత్కార్యములనుమహిలోనెపుడున్.

ధరలో తప్పక భక్తితోడగొనుచున్ ధన్యుండగున్ తాగనన్
*“పరమాన్నంబునుఁ దిన్నవాఁడు, దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్”*
సిరినాశించుచకృత్యకార్యములనేచేయంగనెల్లప్పుడున్
హరినామంబు స్మరించకున్న బ్రతుకౌనత్యంతహేయంబుగా


ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పరమాత్ముండతఁ డెల్లవేళలను సంభావించుచున్ దీనులన్
కరుణన్ వారలకండగా నిలచు సత్కర్మానురక్తుండునై,
పరపీడాచరణమ్మునన్ బ్రతుకు నిర్భాగ్యుండు భూమమ్మునన్
పరమాన్నంబునుఁ దిన్నవాఁడు దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పరమాత్ముని ప్రతిరూపము
నిరతము నార్తులకు నండ నిలఁబడు నరుఁడే
పరుల ధనముకొల్లగొనుచు
పరమాన్నముఁ దిన్నవాఁడు పాపాత్ముఁ డగున్

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
పరమాన్నంబును దిన్నవాడు, దుదకుం బాపాత్ముడౌ జూడగన్

మత్తేభము:

కరమే మోడ్చియు మ్రొక్కడే హరికి దా కాఠిన్య చిత్తంబుతోన్
తిరమేయంచును జీవితమ్మని మదిన్ దీపింపడే యీసునిన్
తరమే పొందగ మోక్షమున్, హరి దయా దాక్షిణ్యమే లేక, యే
పరమాన్నంబును దిన్నవాడు దుదకుం బాపాత్ముడౌ జూడగన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

పర పీడితుం డతి భయం
కర వర్తనుఁ డఖిల లోక కంటక క ర్మా
చర ణాసక్తుఁడు నిత్యము
పరమాన్నముఁ దిన్న వాఁడు పాపాత్ముఁ డగున్


గురు పుణ్యాత్ముల సాహచర్యమె యొసంగున్ మంచిదౌ బుద్ధి న
ల్గురు మెచ్చంగ నిరంతరమ్ము నిలలోఁ గూర్చున్ మహానందముం
బరమాసక్తినిఁ జేరి యల్ప మయినం బాపాత్ము సౌధంబునం
పరమాన్నంబునుఁ దిన్నవాఁడు దుదకుం బాపాత్ముఁడౌఁ జూడఁగన్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...

పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

పరుల ధనము నాశించి యి
తరులను హింసించుచుండి ధర్మముఁకనకన్
సిరులను సతము గడించుచు
పరమాన్నముఁ దిన్నవాడు పాపాత్ముడగున్.