18, జూన్ 2025, బుధవారం

సమస్య - 5156

19-6-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు”

(లేదా...)

“మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే”

18 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
దేశమందు రైతు కాశలు దీర్చెడు
పథకమొకటి నీటిపారుదలకు
సాయమన నదులనుసంధానమైనచో
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు

ఉత్పలమాల
పాలకులెల్లరున్ నదులు భారతమందున మేళవించెడున్
గీలక మైన కార్యమును క్లిష్టమునైనను పూర్తి చేసినన్
జాలును నీటిపారుదల సాగును రైతుకు శ్రేయమెంచుచున్
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఆ.వె.
నీవె దెసయు గతియు నీలకంధర దేవ !
నీవె మదిని నిలుచు భావమెపుడు
భక్తి‌ మీఱ మ్రొక్కి బాధ కూల కిరీటి
వరద ! మేలొసంగు ప్రజలకెపుడు !

Sitharamayya Solasa చెప్పారు...

సతము నిన్ను కొలుచు జనులను గావవే
వరద ! మేలొసంగుఁ బ్రజల కెపుడు
ముక్తి గోరు కొనుచు బూజించు చుండిన ,
యపుడె వారి కున్న యాద తొలగు

విరించి చెప్పారు...


వసుధ రాలినట్టి వర్షపు చినుకులన్
నిలువ చేయదలచి కొలనులనట
సిద్ధ పరచి నంత చింతింప పనియేల
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు



నేలకు రాలు గోఘృతపు నీటిని తామిక సాగునీరుగా
చేలకు పంపనెంచి హలజీవులు నింప జలాశయమ్మునే
కాలువలెన్నొ త్రవ్వినను క్షత్రము కోసము ముందుచూపుతో
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కొన్ని రోజులుగా ప్రయాణాల కారణంగా పూరణలు ఇక్కడ ఉంచలేక పోయానండి

M.B.G.TILAK చెప్పారు...

నిత్యదర్శనమిడు నింద్ర కీలాద్రిపై
మనకు గోచరించు కనకదుర్గ
కోర్కె లన్ని దీరు కొండచూలికిఁ మ్రొక్క
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు

శైలజ కొల్వుదీరెనట చల్లని తల్లిగ నింద్రకీలమన్
మేలినగంబుపై జనులు మెచ్చిన రీతిని కొండచూలిగా
జాలిని చూపిభక్తులకు సాయమొసంగును భద్రకాళిగా
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఆ॥ భక్తి తనర నమ్మ ప్రార్థన నిరతముఁ
గనఁగ శిరము వంచి కలతఁ బాపు
కనికరించి ప్రోచు కాత్యాయణి భువిని
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు

ఉ॥ పాలనఁ జేయు నమ్మ భవబాధల నిత్యముఁ బాపుచున్ గృపా
హేలను ప్రోచు నమ్మ నిజ హేమపు ఛాయను పల్లవించెడున్
మ్రోలను జేరి భక్తిఁగని మ్రొక్కినఁ జాలు దయాంతరంగయై
మేలు నొసంగదే! వరద, మేదిని నెల్లరు సంతసిల్లరే!

వరద దుర్గ

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

పాడి పంట లెల్ల బాగుగా వృద్ధి యై
కర్ష కాళి మిగుల హర్ష ముగను
సేద్య మందు మునిగి జీవింప హేతు వై
వరద మేలొ సంగు ప్రజల కెపుడు

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:తగిన యంత వృష్టి ధరణికి నిడు మయ్య
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు?
వరద లిడక నిడుము వర్షమ్ము ప్రహ్లాద
వరద! మే లొసంగు బ్రజల కెపుడు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:చేలకు నీరు లేక తమ చింతల దీర్చెడు వేల్పు వంచు యా
గాలను,జాతరల్ సలుపు కర్షక పాళిని మెచ్చి నీదు కే
శాల వసించు గంగ నొక సారి భువిన్ బ్రవహింప జేయుటే
మేలు నొసంగదే వరద? మేదిని నెల్లరు సంతసిల్లరే”?

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చుక్క నీరు లేక శోకించు రైతుకు
వాన కురియ నదియె వరము గాదె
వాన నీరు పారు వనరులు గూర్చిన
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కాలము కాటువేసినది కర్షక లోకము తల్లడిల్లగా
చేలకు వానబొట్టయిన చేరక క్షామము పెచ్చరిల్లె, మే
ఘాలకు స్వాగతమ్మనుచు గంగను రమ్మన వానజల్లుగా
మేలు నొసంగదే వరద మేదిని నెల్లరు సంతసిల్లరే

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

తలఁపఁగ నుపకారములు మానవాళికి
కలుగు నిజముగ నప కారములను
మేఘ రాశి యప్రమేయ నిర్మల జల
వరద మే లొసంగుఁ బ్రజల కెపుడు

[జలవరదము +ఏల +ఒసంగు = జల వరద మేలొసంగు]


కూలము గాంతురే జనులు కోరి భజించిన నిన్ను మాధవా!
పాలన కాలవాల మగుఁ బావనుఁడా! త్వదపాంగ వీక్షయే
నీల ఘనాభ వర్ణ తను! నీదు కృపారస వీక్షణమ్ము వే
మేలు నొసంగదే వరద! మేదిని నెల్లరు సంతసిల్లరే

Dr H Varalakshmi చెప్పారు...

చాలును జేసి బీజముల చక్కగ నాటగ బీడువారెనే
మేలును గల్గునంచు రయమే తమ పూజ ఫలింప వేడిరే
జాలున జాలువారినట జాహ్నవి జారినదో యనంగ దా
“మేలు నొసంగదే వరద, మేదిని నెల్లరు సంతసిల్లరే”
చాలిక పచ్చపచ్చగను చక్కని పంటయె వంగ భారమున్

(వరద=దుర్గ)

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

సాలుకు సాలుకున్ బెరుగు
జల్లుల వెల్లువ లెక్కువౌటచే
చేలును నష్టమై మిగుల చింతల
పాలవు చుండ్రి రైతులున్
మేలిమి యానకట్టలను మిక్కిలి
గట్టి ప్రవాహమాపినన్
మేలు నొసంగదే వరద మేదిని
నెల్లరు సంతసించరే.

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

పంటలన్ని యెండె వర్షము లేకను
కరువు నాట్యమాడె తెరువు లేక
నన్ని చేలు బీడులైనట్టి సమయాన
వరద మేలొసంగుఁ బ్రజల కెపుడు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

ఈతిబాధలవియునిలను హెచ్చెనునేడు
కావ రార వడిగ కరుణ తోడ
కరము లెత్తి కొల్తు కంసారి గజరాజ
వరద!మేలొసంగు బ్రజల కెపుడు