19, జూన్ 2025, గురువారం

సమస్య - 5157

20-6-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే”

(లేదా...)

“కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్”

17 కామెంట్‌లు:

పఠానేని కార్తిక్ చెప్పారు...

శా.
శ్రీరాకేశ్వర ఖండ మౌళిని చలచ్ఛీతాఢ్య గంగాధరుం
జారు ప్రాభవ రత్నభోగ కలితోత్సర్పావళీ ధారిఁ స
ద్ధీరానీక మనస్సరోజ రవినిన్ దివ్యాగ్ర నృత్యన్మహా
కారుం గాంచి నమస్కరించినను మోక్షప్రాప్తి లభ్యంబగున్ !

krkr చెప్పారు...

చేరన్ జేరుచుభక్తిమార్గమున రాజీవాక్షు సత్సంగమున్
బేరున్ బొందిన గేయకారులనుసంప్రీతిన్ విచారించుచున్
దీరున్ జేయగగీర్తనంబులను శ్రీదివ్యా వతారున్శుభా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్
కొరుప్రోలు రాధాకృష్ణ రావు

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ పారావారపు కాంక్షను
పోరామిని సద్గుణముల పోఁడిమిఁ గనుచున్
ధారాళముగ నటు శుభా
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే!

శా॥ పారావారముఁ గోరి సద్గుణములన్ వర్ధిల్లి సత్కార్యముల్
భారంబంచుఁ దలంచకన్ జనుచు నింపారంగఁ గావించుచున్
ధారాదత్తము జేసి మానసము సద్భక్తిన్ సదా నిర్మలా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

మండోదరి రావణాసురునితో...

కందం
నేరక సీతను దెచ్చితె?
దారుణములె సంభవించు! ధర్మపరుడనన్
శ్రీరామునికొసఁగుము, శుభ
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే!

శార్దూలవిక్రీడితము
సారాచార విశారదుండవనగన్ సందేహమింకేటికిన్
నేరంబౌనయ! లంకఁజేర్చ మహిజన్! నీరేజ పత్రేక్షణుం
డా రాముండన భక్తితో తిరిగి నీవర్పించుచున్ మోహనా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్!

Sitharamayya Solasa చెప్పారు...

కోరిక యుండిన గూడను
తీరిక లేదనుచు నీవు దేవళమందున్
వారము నందొక పరి లయ
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కోరిన వరముల నొసఁగుచు
తీరుగ భక్తులను బ్రోచు దీనావనునిన్
తోరఁపు భక్తిని శాంతా
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే

విరించి చెప్పారు...

హీరుండంబర కేశుడు
సారంగుడు వాడె జ్వాలి శంకరుడు క్రియా
కారుండు ఖరువు లింగా
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే.


ఆరాధింపడు విశ్వతో ముఖుని సత్యమ్మెప్పుడున్ బల్కకన్
దారిద్ర్యమ్మున నున్నవారికెపుడున్ దా సాయమందింపకన్
మైరేయమ్మును గ్రోలువాడు కడు దుర్మార్గుండతండై క్రియా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్?

వారవనితలం గూడుచు
మైరేయము గ్రోలునట్టి మందుడు వీవై
నేరస్థుండవు, లింగా
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే?


గౌరీనాథుని నామకీర్తనమె సత్కార్యంబు గా వారి నే
యారాధించుచు మోక్షమార్గమను సత్యాన్వేషనన్ జేయుచున్
దారిద్ర్యంబున మ్రగ్గువారి కెపు డాధారమ్మె తానై క్రియా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్.

M.B.G.TILAK చెప్పారు...

చేరగ నెంచిన నాకము
సారంగుని సానుభూతి సాధ్యంబగునే
ఘోర తపముతో నిరహం
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే

సారగ్రీవుని సంప్రసాదమమరన్ సద్భక్తి సేవించుచున్
గారుణ్యాలయుడైన వాని కృపకై కాఠిన్యమౌ దీక్షతోఁ
జేరన్ స్వర్గము సిద్ధమైతివిగదా చిత్రంబుగన్ మంగళా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సారపు ధర్మా త్ముo డై
మీరక హద్ధుల ను సతము మేధావి గ యే
వైరము ల నెరు o గని సం
స్కా రున్ గని మ్రొ క్క మోక్ష గామి వగు దు వే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:నేరక సన్మార్గమ్మును,
నేరక మానవుల పట్ల నిక్కపు బ్రేమన్ ,
చేరి సభల నా ప్రవచన
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే!”

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:ఆ రాజిల్లెడు రాజయోగ భరితమ్మౌ ఫాలమున్,సుందరా
కారమ్మున్,సువిశాల నేత్రము లలౌక్యమ్ముల్, మహాజ్ఞానమే
యాకారమ్మని తోచుచుండెడు వివేకానందుడన్ చిత్సుఖా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షమ్మే సుసాధ్య మ్మగున్”
(వివేకానంద స్వామి బ్రహ్మ తేజం మూర్తీభవించిన అవతారపురుషుడు.ఆయన్ని దర్శించి నమస్కరిస్తే చాలు.మోక్షమే సుసాధ్యం అని.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

క్రూరాత్ములు విశ్వమ్మున
నేరుదురె దయా గుణమ్ము నీతిని నెందుం
గ్రూరునిఁ గరవా లాలం
కారున్గని మ్రొక్క మోక్షగామి వగుదువే


పోరాటమ్ముల నైన భక్తి యుతముల్ పూజా విశేషమ్ములన్
ధారాళమ్ముగఁ జేసి యైన మది నిత్యం బుంచి కీర్తించుచున్
శ్రీరాధా దయితప్రసాద మహిమన్ సృష్టిస్థితిధ్వంస హుం
కారున్గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యం బగున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

హేరాళమ్మగు యజ్ఞ యాగములతో హెచ్చిల్లు సంసేవలన్
శౌరిన్ గొల్చిన గల్గు పుణ్యఫలమున్ శస్తమ్ముగా నొందగన్
రారా దేవర బ్రోవరా యనుచు నోరారంగనా మంగళా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
కారున్ గాంచి నమస్కరించిననె మోక్ష ప్రాప్తి లభ్యంబగున్.

శార్దూలము :

తారున్మారును జేసి యా శకునియే తార్చేను ద్యూతంబునున్
పోరున్ నిల్వగ సాధ్యమే మురహరీ పో ! సంధి నీవేగకన్
మీరే దిక్కని నమ్మి పంప భళిరా! మీకేల కీడెంచె ? సా
కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్ !
నేరంబుల్ మితిమీరి సేయుచును నిన్నేలన్ దులన్నాడిరే ?

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

చేరుచు దుష్టులతోడను
దారుణమౌకృత్యములనుతాననయంబున్
తీరుగచేయుచు నునరా
*"కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే”*


ఆరాధించుచునారసింహునిసతంబత్యంతమౌభక్తితో
మీరే దిక్కని మ్రొక్కుచుండగనుమమ్మీతీరుగాకాచుచున్
కారుణ్యమ్మునుచూపుచున్ మనమదిన్ కామ్యం బడంచానిరా
*“కారున్ గాంచి నమస్కరించిననె మోక్షప్రాప్తి లభ్యంబగున్”*
”*

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

దారుణ కృత్యములు జరిపి
కోరుచు దుష్టుల చెలిమిని క్రూరత్వముతో
నేరములఁ జేసి లింగా
కారున్ గని మ్రొక్క మోక్షగామి వగుదువే?

కంది శంకరయ్య చెప్పారు...

అద్భుతమైన పూరణలు. అభినందనలు.