20, జూన్ 2025, శుక్రవారం

సమస్య - 5158

21-6-2025 (శనివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్”

(లేదా...)

“తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్”

18 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

కలలో జూసిన గజముల
దలపును మరువక మునుపె  , యుదయమున లేవన్
అలవోకగ జేసిన కవి
తలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
తొలిపూజ గణపతికిడన్
దలపుల మఱచియుఁ బనుల మొదలిడుచు సాగన్
గలవరపాటున నా చిం
తలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్!


మత్తేభవిక్రీడితము
తొలిపూజన్ గజ వక్త్రునెంచ మరువన్ దోషమ్మటంచున్ జనుల్
బలుమారుల్ వచియించినన్ పనులనే ప్రారంభమున్ జేయఁగన్
సలుపంగన్ గట! విఘ్నముల్ మదిని పశ్చాత్తాపముప్పొంగ జిం
తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్!

విరించి చెప్పారు...


చెలిమరియె కోరె నని తా
నవలీలగ వ్రాసె నాత డాలయ చరితన్
బలువురు పొగడెడతని వ్రా
తలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్

పలు ప్రాంతమ్ములలోని దేవలములన్ వర్ణింపగా నెంచి కో
వెలలోనుండెడి సంప్రదాయములలో వింతల్ వినోదమ్ములన్
బలు రీతుల్ వివరించె నాతడు కృతిన్ బద్యాలలో వారి వ్రా
తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ఇలలో బాధలు విడువకఁ
గలతలఁ బెట్టఁగఁ దలఁపుల గడబిడ వరలన్
విలవిలలాడుచు నెంచితి
తలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్

మ॥ ఇలలో బాధల సంచయమ్ము ధృడమై యీరీతి సంక్లిష్టమై
కలతల్ వీడక జీవితమ్ముచనఁగన్ గష్టంబు మిన్నంటి వి
హ్వలతన్ బొందఁగ యోచనా కడలి భావావేశ సంజాతమై
తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్

తలపు ఆలోచన
Metaphor అండి (తెలుగులో రూపకమనుకుంటాను)

M.B.G.TILAK చెప్పారు...

తిలకించిన పర్వతములఁ
దలపించును సామజములు దట్టపుటడవిన్
దలకోన దాపునన్ బుం
తలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్

తలపించున్ వసుధాధరంబులను మాతంగమ్ములిచ్చోటనే
పలుసందర్భములందుఁ గంటిమిగదా వార్తావిశేషంబులై
తలకోనన్ నివసించుచున్నవి కదా తామున్న ప్రాంతాన పుం
తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చెలువపు రచనలు జేసెడి
విలసిత కవి శే ఖ రుండు వివిధ రకము లౌ
పలువిధ ఛ o ద ము లౌ కవి
తల లో చేరినవి పెక్కు దంతా వ ళ ముల్

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:తిలకించగ తిరుమలలో
గల గజమును,భాగవతపు గజము, చవితి గా
ధల గజ,మింద్రగజాదిగ
తలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్”
(తిరుమల లోని ఒక ఏనుగుని చూస్తే పై ఏనుగులు గుర్తొచ్చాయి.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

మ:తొలిదౌ నాది శతావధానమని గీతుల్ జెప్పగా నాశువుల్
సులువౌ నంచు దలంచ వాణి దయతో సొంపైన సీసాలు,మా
లలు,శార్దూలము లెన్నొ వచ్చినవి హేలన్ జూపుచున్ ఠీవి తో
తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్”
(శతావధానం కొత్తగా చేస్తున్నా కదా! ఆశువులని తేటగీతుల్లో చెపుదామని అవధాని గారు అనుకున్నారు కానీ అమ్మ దయతో మత్తేభాలతో సహా అన్ని ఛందస్సులలో పద్యాలు వచ్చాయి.దంతావళమ్ముల్ అంటే మత్తేభవృత్తాలు అనే అర్థం లో.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

తలయే ఘోరారణ్యము
బలిసిన పేలే కరు లనఁ బర్వత సదృశ
మ్ము లయి చెలరేఁగు చుండఁగఁ
దలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్


ఇలలో వీని భరింపఁ గష్ట మని యెంతే నాత్మలం దల్చి చిం
తలలో మున్గిన మావటీండ్లు తమ సంతాపమ్ము వాపంగ విం
తలలో వింతగ నుంచ నమ్ముటకు నుత్సాహమ్ము పెంపొంద సం
తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కలలో గాంచితి జంగలమ్మున మహాకాయంపు మార్జాలమున్
తలలో నాల్కగ మేకలున్ పులులతో తారాడగా గాంచితిన్
పలుమారుల్ గహనాంతరమ్మున మహాపంచాస్యముల్ స్రుక్క గుం
తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
తలలోఁ" జేరి, పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్.

మత్తేభము:

పలురీతిన్ సమరంబు సేసి పిలిచెన్, ప్రాణంబు గాపాడగన్
కలలో జూచిన రీతినే పిలువగా కాపాడ యెంచెన్ హరిన్
సలిలంబే యెరుపెక్క చక్రి మకరిన్ జంపన్, గనెన్ యూధముల్
తలలోఁ" జేరి, పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్.

(తల = చోటు, రంగము, ప్రదేశము, ముందుభాగము)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

పలువిధములఛందములను
పలు రీతులుగాను మదిని వ్రాయగ
నెంచన్
నలవోకగచేరెనపుడె
*"తలలోఁ జేరినవి పెక్కు దంతావళముల్”*

కలికాలమ్మిదిగాంచుచుండగనిలన్ గాండ్రింపులున్ హెచ్చగా
కలతల్ నిండెమనంబునన్ పెరిగె నాకర్ణమ్ములందున్ వినన్
జలముల్ కన్నులయందుధారగనటన్ జారంగకాయంబుతా
*“తలలోఁ జేరి పరిభ్రమించెను మహాదంతావళమ్ముల్ వడిన్”*

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.