23, జూన్ 2025, సోమవారం

సమస్య - 5161

24-6-2025 (మంగళవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“కారముం గనఁ బాయసకాంక్ష హెచ్చె”

(లేదా...)

“కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో”

29 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...

చాల కాలము గడువగ ,  శలవు లిపుడు
కలసి వచ్చెనని దమతో గడుపుటకయి
పిలచి , మాపయి మాత చూపించిన మమ
కారముం గనఁ బాయసకాంక్ష హెచ్చె

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురప్ప స్వామి కమ్మని పొంగుపాల పాయసము నేపథ్యంగా.....

తేటగీతి
పాలు, కొబ్బరి నీళ్లను చాలినన్ని
పొయ్యిపైనను మరిగించినెయ్యిగలిపి
భక్తి గుర్రప్పకర్పించి పంచెడు మమ
కారముం గనఁ బాయసకాంక్ష హెచ్చె!

ఉత్పలమాల
వారిజలోచనల్ శిరము పైన ధరించిన పాత్రలందునన్
క్షీరము నింపుచున్ గలిపి శ్రేష్టపు కొబ్బరి నీళ్లు భక్తితో
చేరిచి యా గురప్పకిడి చేరిన భక్తులు మెచ్చ పంచ స్వీ
కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చిక్కనగు పాలలోగల్పి చక్కెరయును
జీడిపప్పును మేళవించిన తదుపరి
వెచ్చనగు పాయసముఁజేసి యిచ్చిన మమ
కారముం గనఁ బాయస కాంక్ష హెచ్చె

M.B.G.TILAK చెప్పారు...

సేవలర్పింత్రు భక్తులు దేవళమున
వారికచ్చోట లభ్యమౌ పాయసమ్ము
డింగరీల చేతమున గుడిని యథాప్ర
కారముం గనఁ బాయసకాంక్ష హెచ్చె

చేరగ వత్తురచ్చటకు సేవలొనర్పగ భక్తులెల్లరున్
వారికి లభ్యమౌనెపుడు పాయసమే రుచిరప్రసాదమై
దారినిపోవు వారయిన తామట కోవెల చుట్టు నున్న ప్రా
కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో

విరించి చెప్పారు...


భూరిగను ద్రాక్ష జీడి పప్పులను వేసి
జన్మదినమంచు చేసెనే జనని నేడు
పేర్మితో నింట నామె చూపించెడి మమ
కారముం గనఁ బాయసకాంక్ష హెచ్చె.


పేరిమి తోడ జేసినది పిల్లలు మెచ్చెడి జీడి పప్పులన్
భూరిగ వేసి కాంతునకు పుట్టినరోజని పిల్లలెల్లరున్
కోరిరటంచు శ్రద్ధగను కోమలి, కన్నుల కింపుగున్న యా
కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
చారు మధు ప్రపూర్ణ గుణ సంగత శోభిత వాగ్ప్రభాళితో
తీరుగఁ బల్కరించి మది దివ్వెలకింపుగ స్నేహవాయువుం
బారగఁ జేయు సార్థకుని పచ్చని ప్రేమను, తెల్లమైన సం
స్కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందు ప్రీతితో !

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ జనుల కాకారము రుచియుఁ జవి నొసఁసుటఁ
బాక శాస్త్రము వివరించఁ బరిణితిఁ గని
భార్య వండఁ బ్రియము మీర భర్తయు మమ
కారముంగనఁ బాయస కాంక్ష హెచ్చె

ఉ॥ పారఁగ నిష్టమెల్లరకు వంట కలంకరణమ్ము ముఖ్యమే!
తోరపుటాశ పెచ్చరిలు తొందర పెట్టచు నారగించఁగన్
నేరిచి సూత్రమీ పగిది నెమ్మని వండ జనాళి మెచ్చి స్వీ
కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నీరములేని క్షీరమన నిర్మల చిత్తముతోడ లాలనన్
జేరఁగ జీరి చక్కెరను జేర్చిన తీయని పల్కరింపుతో
రార! కుమార యంచు యనురాగము చిప్పిలు మాతృమూర్తి సం
స్కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో

జిగురు సత్యనారాయణ చెప్పారు...

మారము జేయు పిల్లలకు మంజుల ఖాద్యములెన్ని పెట్టినన్
దారికి వచ్చునే తిను పదార్థములన్నియు పారవేయరే
క్షీరము నేయ్యి పోసి రుచి చిందగజేసిన జీడిపప్పలం
కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో!!

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:రమణి!నీ యున్నత పయోధరముల జూడ,
తనివి దీర్చు నీ యధరామృతంపు దీపి దలచ,బ్రేమ భిక్షపు మెతుకులనిడు మమ
కారముం గనఁ బాయసకాంక్ష హెచ్చె”
(ఆమె పయోధరాలు,అధరామృతం,ఆమె ప్రేమ అనే బిచ్చపు గింజలు కలిసి ఇతనికి పాయసకాంక్ష కలిగించాయి.ఆమె లో పాలు,పంచదార తీపి ,ప్రేమ అనే బిచ్చపు గింజలు మూడూ ఉన్నాయి అని శృంగారవాంఛని చమత్కారం తో తెలిపాడు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:నీరజనేత్ర కృష్ణ!విన నీదగు కమ్మని వేణునాద ఝం
కారము,బర్హిపింఛమును గట్టి యశోదమ జేయు నా యలం
కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో”
జేరు పిపీలికమ్ములటు చిత్తము రంజిల గొల్ల భామినుల్.

Sistla Sharma చెప్పారు...

ఈ రమణీయ లోకమున
నెన్ని రుచు ల్లభియించునో గదా!
తీరవవెన్ని గ్రోలిన మ
దిన్దొలిసారి రుచించినంతనే
తీరుగ పాకశాస్త్రమున
దిట్టలు కమ్మని వంటజేయ నా
కారముఁ గాంచి చేరెదరు
కమ్మని పాయసమందుఁ బ్రీతితో!

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:ఊరక వత్తురేమి విటు లూదర వెట్టుచు నుండ కొంపలో
జేరగ, సాధు భాషణము జేయక భార్యలు దెప్పిపోట్లతో
నూరగ, వారి చిత్తములు నొచ్చి మమున్ శరణంద్రు కొంపలన్
కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో”
(మా వేశ్యల దగ్గరికి విటులు ఊరికే రారు.పెళ్లాల కారము భరించ లేక మా దగ్గరకొస్తారు అని ఒక వేశ్య అన్నట్టు.)

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ఇరువురు సుతులు గలిగిన నీశ్వ రయ్య
కొకరి పై ప్రేమ మధిక మై యుండగాను
వేరొక రి నీస డించుచు బిల్చు చుండ
కారము న్ గన పాయస కాంక్ష హెచ్చె

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
కారముఁ గాంచి చేరెదరు కమ్మని పాయసమందుఁ బ్రీతితో!

ఉత్పలమాల:

నేరములెన్ని జేసినను నేరక చేసిన వండ్రు ప్రేమతో
గారము తక్కువైననిక గాంతురు దప్పుల నెన్ని లెక్కలన్
కూరిమి మిక్కిలైన మరి కూడియు చేరుదురొక్క చోట స్వీ
కారముఁ గాంచి, చేరెదరు, కమ్మని పాయసమందుఁ, బ్రీతితో!

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
*...యంచు ననురాగము*

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
*దారికి వత్తురే* అని ఉండాలి కదా! 'జీడిపప్పు లంకారము' ?

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తీపి వలయుననుచుకోర తీరుగాను
పెసరపప్పు తోచేయంగ వేగము గను
సంతసమెదనిండజనని చక్కని మమ
*"కారముం గనఁ బాయసకాంక్ష హెచ్చె”*



తీరము చేర్చు వాడనుచు తీరుగ కాచెడు దైవమంచు నా
తీరగుమూర్తినేమదిని దేహులు కొల్చుచునెల్లరా శుభా
*“కారముఁ గాంచి చేరెదరు, కమ్మని పాయసమందుఁ బ్రీతితో”*
నోరునుతీపిచేసుకొననుల్లమునందున నెంచుచెప్పుడున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కమ్మని పదార్థము లొకఁడు నెమ్మి నొసఁగ
గిరలఁ దియ్యందనము మీఱఁ బరుఁడు మధుర
రసము లొసఁగంగ వారి పరస్పర మమ
కారముం గనఁ బాయస కాంక్ష హెచ్చె


వారలు హస్త పద్మమునఁ బాయస పాత్రను గాంచి కోరికల్
మూరఁగ ఖాదనమ్మునను ముచ్చట దీరఁగ సంభ్రమమ్మునన్
మారు వచింప కెప్పగిది మాకు సఖుండవు నెమ్మిఁ, దన్ము ఖా
కారముఁ గాంచి చేరెదరు, కమ్మని పాయస మందుఁ బ్రీతితో

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

బంధువుల యింటి కేగగ పర్వదినము
స్వాగతమ్మును పల్కిరి సహృదయతగ
విందు భోజనమిడు వారి యందున మమ
కారముం గనఁ బాయస కాంక్ష హెచ్చె.