24, జూన్ 2025, మంగళవారం

సమస్య - 5162

25-6-2025 (బుధవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“భావశూన్యపద్యమే వినఁ దగు”

(లేదా...)

“భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే”

15 కామెంట్‌లు:

Sistla Sharma చెప్పారు...

జీవము కావ్యమందునను
జేరును భావ విశుద్ధతా ధ్వనిన్
తావి స్పృశించి నెమ్మనము
దాకుచు పద్యవిశాల వీధి సం
రావముతో జనించుమృదు
రాగ విహారపు హారమందు దు
ర్భావము లేని పద్యమునె
పండితులెల్లఁ బఠించి మెచ్చిరే!

Sitharamayya Solasa చెప్పారు...

ఆ||వె||
పద్యపఠన జేయు పఠకుని మదియందు
నున్నతి నిడుచుండ నొప్ప లేక ,
ప్రగతిభావ శూన్యపద్యమే వినఁ దగు
ననుచు జెప్పునుగద నబ్బకాడు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఆటవెలది
గొప్పవాడిననుచు నెప్పటివలె కాక
సామరస్యమెంచి సరళముగను
కవనమొల్కినంత స్తవములిడిరి యహం
భావశూన్యపద్యమే వినఁ దగు

ఉత్పలమాల
చేవ గలుంగు వాడనని చెప్పక చెప్పెడు రీతి పద్యముల్
జీవము మృగ్యమై వినఁగఁ జేల్లని పోకడ వ్రాయు పండితుం
డావల మారుచున్ గవనమల్గగ నార్ద్రత నిండగా నహం
భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే!

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

చక్క నైన భావ సంస్కార యుక్త మై
పండితాళి మెప్పు బదసి జనుల
చెవుల కింపు సొంపు చేకూ ర్చు చు విరోధ
భావ శూన్య పద్య మే విన దగు

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఆ॥ వినఁదగు నవివేకి విహితముఁ గరపఁగ
వినఁదగునె యసత్య వివరణలును
వినఁదగు నుచితముల విరియు ప్రగతి యన
భావ శూన్య పద్యమే వినఁదగు

ఉ॥ రావము లేని గీతమిల రమ్యతఁ గాంచుచు నొప్పు రీతిగన్
దావియె లేని పుష్పములు తప్పక నింతుల కిష్టమై నటుల్
దేవుఁడు లేని కోవెలను దీరుగ భక్తులు చూచు రీతిగన్
భావము లేని పద్యమునె పండితు లెల్లఁ బఠించి మెచ్చిరే!

వ్యంగార్థములో నండి. మొదటి 3 పాదములు ఎంత నిజమో చివరిది అంతే నిజమని భావము

పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
పావన కావ్యతాభ తతి భాసిత లక్షణ భూష తత్త్వమున్
దేవ వతంసు రుద్రుని స్తుతించు మహత్వము సేత నొప్పి, శ్రీ
జీవ రసాత్మకంబయిన చెన్నెసలారెడి దోష పూరమౌ
భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే !

విరించి చెప్పారు...


మధుర స్వరము గలిగి మాధుర్యమొలుకగ
పాడనేమి వాడు పద్య మొకటి
పండితుండ్రు మెచ్చు పదముల గల్గి దు
ర్భావశూన్యపద్యమే వినఁ దగు.


కోవెల లోని దేవతల గొల్వగ నెంచిన మానవాళియే
కావలె నంచు కోరెదరు కల్పము నందున గబ్బు లేనివౌ
పూవులవేగదా సతము మోదము గూర్చునదే విధమ్ము దు
ర్భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే.

M.B.G.TILAK చెప్పారు...

పద్యకావ్యమనినఁ బఠితలెపుడు కోరు
భావయుక్తమైన పద్య రచన
భక్తి భావమలరఁ బరవశింపగ నన్య
భావశూన్యపద్యమే వినఁ దగు

పావనరామచంద్రునికి పద్యసుమంబుల నేర్చి కూర్చ సం
భావితమైన మానసము పద్యములే రచియింప గాఢమౌ
భావతరంగ యుక్తమయి భక్తిరసార్ద్రత తప్పనన్యథా
భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఆ.వె:అడ్డ మైన ప్రశ్న యడిగి నిషిద్ధాన
నన్ని యక్షరముల నడ్డు కొనిన
భావభరిత మైన పద్యమ్ము వచ్చునా
భావశూన్యపద్యమే వినఁ దగు
(నిషిద్ధాక్షరి అనేదే ఒక పరీక్ష ఐతే కొందరు దానిలో కూడా నానా చిక్కులు పెట్టి అడుగుతారు.అలాంటి అడ్డమైన ప్రశ్న వేస్తే భావసౌందర్యం గల
పద్యం ఎలా వస్తుంది?)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:భావసమృద్ది గల్గు బలు పద్యము లుండిన నాదు కావ్యమం
దేవియు గాంచకుండ "నొక టేదియొ మెచ్చిన జాలు" నంచు నే
భావము లేని దాని నొక పండితవర్యుడు మెచ్చ నట్టిదౌ
భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే?
(ఇదొక ముఖమాటపు గ్రంథం సమీక్ష.అంద మైన పద్యాలు ఉండగా ఏదో ఒక మామూలు పద్యాన్ని ఒక పండితుడు మెచ్చుకుంటే అందరూ దాని వెంట పడి మెచ్చుకున్నారే అని ఒక కవి ఆశ్చర్యం.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కవి వరేణ్యు భావ మవిరళ గంభీర
మెన్నఁ దరిచి చూడ నెఱుక పడును
రిత్త మాట లేల యిత్తఱి నియ్యది
భావ శూన్య పద్యమే వినఁ దగు


వావిరి నమ్మకమ్ము తన పాండితి యందని చాటిచెప్పఁగా
లే వప శబ్ద పాతములు లేశము నైనను సంతరింపఁగా
భావ గభీర శబ్దము లపారము సుంతయు నేని న్యూనతా
భావము లేని పద్యమునె పండితు లెల్లఁ బఠించి మెచ్చిరే

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

నవరసభరితముగ నవ్యరీతుల యందు
ప్రాసయతులతోడవాసిగాను
వ్రాయవలెను సతము పసగలిగినయహం
*"భావశూన్యపద్యమే వినఁ దగు”*


కావగ నెల్ల వేళలను కంటికి రెప్పల యట్లుగా సదా
దైవము సిద్ధమై యచట దారిని చూపుచు నుండగాకవుల్
పావనమైన చిత్తమున వ్రాయగ నయ్యది నొప్ప నెట్టిదు
*“ర్భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే”*

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

భావయుక్తమైన పద్యమ్ము వ్రాసిన
సుకవి యందురతని సకల జనులు
భవ్యమైన రీతి వ్రాసిన సందిగ్ధ
భావశూన్యపద్యమే వినఁ దగు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పావన నాముడైన భగవానుని దివ్యకథామృతమ్మునుం
ద్రావఁగ సత్కవీశ్వరుల గ్రంథములన్ పఠియింప నెమ్మియౌ
భావన సేయుచున్ పరమభక్తుల నెమ్మనమందు దుష్టమౌ
భావము లేని పద్యమునె పండితులెల్లఁ బఠించి మెచ్చిరే

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

నవరస భరితముగ నలుగురు మెచ్చెడు
వాసిగాంచినట్టి పద్యములను
ప్రాస యతులు భంగపరచకుండగ యహం
భావశూన్య పద్యమే వినదగు.