25, జూన్ 2025, బుధవారం

సమస్య - 5163

26-6-2025 (గురువారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ”

(లేదా...)

“నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే”

17 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
భద్రమ్మైన విదురతన్
నిద్రాణమ్మైన పటిమ నిగుడగ నంత
చ్ఛిద్రమ్మైన జడత్వపు
నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ!

శార్దూలవిక్రీడితము
భద్రమ్మైన సరస్వతీ కరుణనభ్యాసించు సంకల్పమై
నిద్రాణంబగు పాండితీ ప్రభలవే నీరాజనాలందగన్
విద్రావింప నధైర్యమున్ గలతలన్ వీడంగ నజ్ఞానమన్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు! కవితానిష్యంది కల్పాగమే! !

పఠానేని కార్తిక్ చెప్పారు...

శా.
అద్రుల్ వోలిక నిల్చు భావమలతో నగ్రస్థితిన్ నిల్వగన్
హృద్రాజ్యంబుల నేలి కావ్యలలనన్ హేమంబుగా తీర్చగన్
భద్రాత్ముండగు నీశు కొల్చి గృహమున్ వాసిన్ ప్రకాశించు న
న్నిద్రాహీనుడు రోగి కాదు కవితా నిష్యంది కల్పాగమే !

Vojjala Sharath babu చెప్పారు...

సద్రచనాసక్తి కలిగి
ముద్రాధిక గ్రంథములను మోదము తోడన్
భద్రముగ చదువు నరుడటు
నిద్రా హీనుండు, కవన నిష్ణాతుండౌ

విరించి చెప్పారు...


నిద్రాణమైన జగతికి
యుద్రేక పరచు కవితలె యుక్తమటంచున్
నిద్రాహారాలు మానిన
నిద్రాహీనుండు, కవన నిష్ణాతుండౌ.


నిద్రాణమ్మయినట్టి జాతిని పునర్నిర్మాణమున్ జేయగా
నుద్రేకమ్మును మేలుకొల్పుటదియే యుక్తమ్ముగా నెంచుచున్
నిద్రాహారము లెల్ల మాని కవితల్ నిత్యమ్మిటన్ వ్రాసెడిన్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు, కవితానిష్యంది కల్పాగమే.

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ భద్రమొసఁగ మానవులకు
నిద్ర విడిచి యోచనలకు నెలవై హితమున్
ముద్రించు రచనలఁ గనెడి
నిద్రా హీనుండు కవన నిష్ణాతుండౌ

శా॥ క్షుద్రమ్ముల్ దలపోయకుండఁగ సదా కూర్చంగ విద్వత్తుతో
నిద్రాణమ్ముగ నున్న యోచనలటుల్ నిద్రన్ విసర్జించుచున్
భద్రమ్మెంచుచు మానవాళికి మహిన్ వాటమ్ము సూచించెడిన్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే!

వాటము పొందికైనది అనుకూలమైనది (నిఘంటువు సహాయమండి)

Sitharamayya Solasa చెప్పారు...

భద్రముగ దాచిన ధనము
క్షుద్రులు గొనిపోయెదరను గుబులున నుండన్
భద్రాద్రి రాముని గొలుచు
నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ

M.B.G.TILAK చెప్పారు...

విద్రోహులఁ దునుమాడగ
నుద్రేకంబొసగుఁ గావ్యముత్ప్రేరకమై
భద్రాత్ముండైన సుకవి
నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ

విద్రోహుల్ చెలరేగుచుండ విధిగా విద్వత్కవుల్ వ్రాయరే
నిద్రాణంబగు జాతి మేల్కొనునటుల్ నిష్కర్షగాఁ బల్కుచున్
నిద్రాసక్తత లేనివాడు సతమున్ నిర్జించునీలోకమున్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చిద్రూపుండగు నీశుని
భద్రమ్మిడ మ్రొక్కి భక్తి భావము గదురన్
నిద్రాహారముల మరచు
నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చిద్రూపుండగు నీశునిన్ మనమునన్ చింతించి సద్భక్తితో
నిద్రాహారములన్ త్యజించి కవియున్మీలించగన్ కావ్యముల్
విద్రాణమ్మొనరించి లోని కవితావేశమ్ము కేరించు నా
నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

భద్రాద్రి రామ చంద్రుని
భద్రముగా మదిని నిల్పి పద్యము లల్లె న్
నిద్రను గోపన్న విడిచె
నిద్రా హీను o డు కవన నిష్ణా తుండౌ

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:భద్రత తనకే లేక ద
రిద్రుడు కోల్పోవ నిద్ర రెచ్చిన దౌ భా
వోద్రేకమొతో కవి యగు
నిద్రాహీనుండు, కవన నిష్ణాతుండౌ”
(దరిద్రుడు తనకు భద్రత లేదని నిద్ర కోల్పోగా అతని బాధ తలచి కవి భావోద్రేకం తో నిద్ర కోల్పోతాడు.)

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

భద్రాధీశుని కొల్వగ
నిద్రకు దవ్వైకలుగగనెమ్మదిమదిలో
నుద్రిక్తతయును తగ్గగ
నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ

చిద్రూపుండగు శ్రీనివాసునిసదా చిత్తంబునన్ నిల్పుచున్
నిద్రాణంబయినట్టి జ్ఞాననిధులన్ నిత్యమ్ము మేల్కొల్పుచున్
క్షుద్రంబైనకువిద్యహేయమనుచున్ చూ డంగబోనట్టి యా
*“నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే”*

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:భద్రాద్రిన్ గుడి గట్ట బమ్మ నొకనిన్ బంధించ నల్లా!ఖుదా!
నిద్రే లేకయు వాని రాము నెపుడున్ నిందించు,గీర్తించు,భ
ద్రాద్రిన్ దల్చు జహాపనా ! అచరజే ఐపోవు మీరే కనన్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే”
(రామదాసు గారి ప్రవర్తనని భటులు తానీషాకి చెపుతున్నారు కనుక కొన్ని ఉర్దూ పదాలు వాడాను.చివరి పాదం సమస్య కనుక ఆ భాష మార్చ లేను.అతను రోగి కాదు.పాటలు రాసే కవి అన్నారు.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

సద్రవిణ పండితుఁడు హీ
నోద్రేక మనో విరాజియుఁ గుకవి సమ్య
గ్విద్రావణుండు కించి
న్నిద్రాహీనుండు కవన నిష్ణాతుండౌ


భద్రేభప్రతిమాన సంచలన సంభావ్యుండు శశ్వన్మహా
రుద్రారాధన సక్త చిత్తుఁడు సుధీ రోచిష్ణుఁ డెన్నంగ రా
జద్రాజాశ్రయ రక్షితుండు ప్రతిభా శార్దూలుఁ డెన్నం డహ
ర్నిద్రా హీనుఁడు రోగి గాఁడు కవితానిష్యంది కల్పాగమే

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
నిద్రాహీనుఁడు రోగి గాఁడు, కవితానిష్యంది కల్పాగమే !

శార్దూలము:

భద్రాధీశుని గొల్చి దాసులును దా భారంబు నీదంటిరే
చిద్రూపున్ గొలిచేరు భక్తులిట యాశీర్వాదమే బొందగన్
మద్రామాయణమందు వాల్మికియు రామా యంచు పేనెన్ "మరా"
నిద్రాహీనుఁడు రోగి గాఁడు, కవితానిష్యంది కల్పాగమే !

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

భద్రతగా కీర్తించుచు
భద్రాచల రామభద్రుఁ భక్తిగ గొలువన్
నిద్రాహారముల విడిచె
నిద్రా హీనుండు కవన నిష్ణాతుండౌ!

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

సవరించిన వృత్తము

శార్దూలవిక్రీడితము
భద్రమ్మైన సరస్వతీ కరుణనభ్యాసించు సంకల్పమై
నిద్రాణంబగు పాండితీ ప్రభలవే నీరాజనాలందగన్
విద్రావింప నధైర్యమున్ గలతలన్ విద్యాతురుండంచనన్
నిద్రాహీనుఁడు రోగి గాఁడు! కవితానిష్యంది కల్పాగమే! !