14, అక్టోబర్ 2016, శుక్రవారం

సమస్య - 2171 (జారుల మాటలన్ వినని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది
...
"జారుల మాటలన్ వినని జాతి పురోగమనమ్ముఁ జెందునా"
లేదా...
"జారుల మాటలను వినని జాతి నశించున్"

13, అక్టోబర్ 2016, గురువారం

చమత్కార పద్యాలు – 216/22


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

22వ అర్థము ఆంజనేయ స్మరణ 
                                                                          
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గల భీమున కన్నయైనవాఁడును (ఇరువురు వాయుపుత్రు లైనందున),
నీరజాంబక భూతి = శివ సంభూతుఁ డైనవాఁడును.
మహిత కరుఁడు = ఘనతరమైన కరములు గలవాఁడును, (గిరులను తరులను పెరుకు భుజబలము గల్గినందున),
అహీన మణి కలాపుఁడు = గొప్పతనమునే భూషణములుగా గలవాఁడును,
అలఘు సద్గణేశుఁడు = అధికతరమగు సాధుగణమునకు (హనుమదుపాసకులకు) ఏలిక యైనవాఁడును,
అగ్ర గోపుఁడు = ముఖ్య వాక్కుల కధీశుఁడైనవాఁడును (సూర్యునివద్ద అభ్యసించిన వ్యాకరణవేత్త),
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు ఆంజనేయుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2170 (రంధ్రాన్వేషణఁ జేయకున్న...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"రంధ్రాన్వేషణఁ జేయకున్న కవితల్ రాణించునే యిద్ధరన్"
('తెలుగు కవిత్వము - సమస్యాపూరణము' సమూహం నుండి)
లేదా...
"రంధ్రాన్వేషణము కవిత రాణించుటకే"
(నిజానికి ఇందులో ఉన్న సమస్య ప్రాసయే)

12, అక్టోబర్ 2016, బుధవారం

చమత్కార పద్యాలు – 216/21


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

21వ అర్థము గజేంద్ర స్మరణ        
                                                                          
భూరి జఠర గురుఁడు = పెద్ద కడుపు గలవారిలో గొప్పవాఁడును (ఏనుఁగులకు పెద్ద కడుపుండుట సహజము),
నీరజాంబక భూతి = కమలాక్షుఁడే యైశ్వర్యముగా గలవాఁడును (విష్ణుభక్తుఁ డనుట),
మహిత కరుఁడు = గొప్ప తొండము గలవాఁడు,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణిసముదాయము గలవాఁడును (ముది యేనుఁగుల కుంభస్థలములలో ముత్యము లుండుట సహజము),
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి సాధుచయాధ్యక్షుఁ డైనవాఁడును,
అగ్ర గోపుఁడు = లెస్సయైన వాక్కు (ఘీంకారము) గలవాఁడును,
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు గజేంద్రుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2169 (పాలిమ్మని సుతుని...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"పాలిమ్మని సుతుని భర్త పాలికిఁ బంపెన్"
లేదా...
"పాలిమ్మంచును భర్త పాలికి సుతున్ బంపెన్ సతీరత్నమే"

11, అక్టోబర్ 2016, మంగళవారం

చమత్కార పద్యాలు – 216/20


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

20వ అర్థము గరుడ స్మరణ        
                                                                          
భూరి జఠర గురుఁడు = బ్రహ్మయే తాతగా గలవాఁడును (బ్రహ్మ సంతతి యగు కశ్యపుని కొడుకు),
నీరజాంబక భూతి = కమలాక్షుఁడే యైశ్వర్యముగా గలవాఁడును (విష్ణుభక్తుఁడు),
మహిత కరుఁడు = ఘనతరమైన హస్తములు గలవాఁడును (ఇంద్రు నోడించి అమృతమును దెచ్చిన దోర్బలశాలి),
అహీన మణి కలాపుఁడు = సర్పరాజముల మణిసముదాయము గలవాఁడును (నాగుల పడగలు చప్పరించి యుమ్మివేసిన రత్నములు తన యింటినిండ ఉండును),
అలఘు సద్గణేశుఁడు = గొప్ప యొప్పులకుప్ప యగు ప్రభువైనవాఁడు (ఖగేశ్వరుఁడును),
అగ్ర గోపుఁడు = పైభాగమున భూభర్త యగు విష్ణువు గలవాఁడు (విష్ణువునకు వాహనము),
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు గరుడుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2168 (విదియ నేఁడు వచ్చె...)

కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"విదియ నేఁడు వచ్చె విజయదశమి"
లేదా...
"విదియ నేఁడు వచ్చెఁ గనుఁడు విజయదశమి పర్వమే"

10, అక్టోబర్ 2016, సోమవారం

చమత్కార పద్యాలు – 216/19


త్రింశదర్థ పద్యరత్నము పోకూరి కాశీపతి

ఆ.వె.
భూరి జఠర గురుఁడు నీరజాంబక భూతి
మహిత కరుఁ డహీన మణి కలాపుఁ
డలఘు సద్గణేశుఁ డగ్రగోపుఁడు మహా
మర్త్యసింహుఁ డేలు మనల నెపుడు.

19వ అర్థము ఆదిశేష స్మరణ       
                                                                          
భూరి జఠర గురుఁడు = గొప్ప కడుపు గలవారిలో దొడ్డవాఁడును (తల, తోక తప్ప తక్కిన భాగమంతయు కడుపు),
నీరజాంబక భూతి = చేపకన్నులవంటి నేత్రసంపద గలవాఁడును (రెండువేల కన్ను లనుట),
మహిత కరుఁడు = (తన శరీరమునే కరముగా చేసుకొని దేనినైనను పట్టుకొనుట చేత) గొప్ప చేయి గలవాఁడును,
అహీన మణి కలాపుఁడు = ఘనతరమైన మణిసముదాయము గలవాఁడును (శేషాహి పడగలయందున మాణిక్యము లుండు ననుట ప్రసిద్ధము),
అలఘు సద్గణేశుఁడు = మిక్కిలి సాధువుల కధీశ్వరుఁడైనవాఁడును (నాగపూజ లాచరించువారి కనుట),
అగ్ర గోపుఁడు = ముఖ్యమైన భాష గలవాఁడును (భాషాచాతుర్యము గలవానిని భాషయం దపరశేషుఁడనియు, భాషాశేషుఁ డనియు వర్ణించుట కవి సమయము),
మహామర్త్యసింహుఁడు = మిక్కిలి దేవతా శ్రేష్ఠుడైనవాఁడును (అగు ఆదిశేషుఁడు),
మనలన్ = మనలను
ఎపుడున్ = నిరంతరము
ఏలు = రక్షించుగాక!

సమస్య - 2167 (కరి సింహము నెక్కి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...

"కరి సింహము నెక్కి దైత్యగణముం జంపెన్" 
లేదా...
"కరి హర్యక్షము నెక్కి దైత్యులను సంగ్రామంబునన్ గూల్చెరా"

9, అక్టోబర్ 2016, ఆదివారం

రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అష్టావధానం....


విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ శివరామ క్షేత్రం (రామకోటి)లో శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంలో ది. 8-10-2016 (శనివారం) నాడు రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అష్టావధానం జరిగింది. దీనికి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సంచాలకులుగా వ్యవహరించారు.

1) సమస్య (పింగళి వేంకట కృష్ణ గారు) -
"మూలకు నెట్టినా రిపుడు మూల యటంచును పూర్వశాస్త్రమున్"

పూరణ...
ఏల యవిద్యలంచు నిహిహీ యని వ్యంగ్యపు భాషణమ్ములన్
గూలఁగఁ ద్రోఁచినా రకట కోవిదు లెల్ల సముద్యమింపఁగా
లీలగ వేగమే నుదుటి రేఖల మార్చును దాని వీడుచున్
మూలకు నెట్టినా రిపుడు మూల యటంచును పూర్వశాస్త్రమున్.

2) దత్తపది (భానుమూర్తి గారు) -
'రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ' పదాలను ప్రయోగిస్తూ ఉత్పలమాలలో దేవీమాహాత్మ్యాన్ని వర్ణించడం.

పూరణ...
శంభునియందు 'మే నక'ట సాముగఁ జేసిన కల్పవల్లి సం
'రంభ' మిడంగ రాక్షసవిరాట్టులఁ గూల్చిన భవ్యకీర్తి నీ
శుంభ దనంత పాదరుచిఁ జూడఁగ 'నూర్వశి' సుందరాంగియే?
కుంభిని చాలు భక్తులకుఁ గూర్ప 'తిలోత్తమ'మైన పుణ్యమున్.

3) వర్ణన (శ్రీవల్లి గారు) -
కనకదుర్గమ్మవారి మంగళసూత్ర వైభవాన్ని వర్ణించడం.

పూరణ...
కామేశబద్ధ సూత్రము
ప్రేమాన్విత మదియె జగతి వీక్షించు సదా
శ్రీమంత సర్వమంగళ
నీమంబుగ మంగళములు నిత్యం బగుతన్.

4) నిషిద్ధాక్షరి (మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు) -
వాగ్దేవి అందెల రవళి.

పూరణ... (కుండలీకరణాల్లోనివి నిషిద్ధాక్షరాలు)
మా(ట)మాట(మ)లె(న)మా(క)తానీ
నామ(మ)ంబున్(మ)ని(ప)ష్ఠతో(డ)విన(గ)మ్ర(త)వ్రత(మ)సం.. (రెండు పాదాలకు నిషేధం)

మా మాటలె మాతా నీ
నామంబున్ నిష్ఠతో వినమ్రవ్రతసం
ధామాంతర్గత రవముల
నామెతయై చెవుల కెపుడు నానంద మిడున్.

5) న్యస్తాక్షరి (గుమ్మా సాంబశివరావు గారు) -
మొదటిపాదం 14వ అక్షరం 'రా', రెండవపాదం 2వ అక్షరం 'మ', మూడవపాదం 3వ అక్షరం 'కో', నాల్గవపాదం 5వ అక్షరం 'టి'. మత్తేభంలో రామకోటి వైభవాన్ని వివరించాలి.

పూరణ...
రమణీయంబగు వేదికాస్థలిని నా'రా'ధించుచున్ శారదన్
సు'మ'నః పూజిత నేత్రయుగ్మమున సంశోభావహంబైన యీ
శ్రమ కోర్వన్ వలె నంచు పృచ్ఛకుల సుస్థానంబులం దుంచగా
నమరెన్ మేటి వధాన మన్న పగిదిన్ హాసంబులే చిల్కగా.

6) ఆశువు (డా. ప్రభాకర చిదంబర రాజు గారు)
ప్రథమావృత్తి - కనకదుర్గమ్మ ముఖారవిందాన్ని వర్ణించడం.
ద్వితీయావృత్తి - శృంగేరీ శారదాదేవిపై పద్యం
తృతీయావృత్తి - తిరుమల బ్రహ్మోత్సవాలలో భక్తుల ఇబ్బందులు.

(అవధాని పద్యాలను వేగంగా చెప్పడంతో వ్రాయడానికి వీలు కాలేదు)

7) ఛందోభాషణ (పువ్వాడ తిక్కన సోమయాజి గారు)

ప్రథమావృత్తి...
పృచ్ఛకులు -
శృంగేరీ వేదికపై
శృంగారపు పల్కు చిల్క చిత్కళ లొలుకన్
అవధాని-
బంగరు రంగుల నద్దిన
రంగ మ్మిది కవితకొఱకు రాంభట్ల కిటన్.

ద్వితీయావృత్తి...
పృచ్ఛకులు -
ప్రబలె ప్రేమికులకు మధ్య రాక్షసమ్ము
రాక్షసుల మధ్యనో యైక్యరాగ మొదవె
అవధాని -
చూడ విపరీత మియ్యది నాడు నేడు
కారణమ్ముల నేమని కనఁగవచ్చు?

తృతీయావృత్తి...
పృచ్ఛకులు -
ఇటు దుర్గమ్మకు మ్రొక్కుచు
నటు నమరావతి మహేశు నర్చింపగన్
అవధాని -
పటుతర కవితాధారల్
నిటలాక్షుని కృపను బొంది నిత్యము బారున్.

8) అప్రస్తుత ప్రసంగం (పృచ్ఛకుల పేరు మరచిపోయాను).