విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ శివరామ క్షేత్రం (రామకోటి)లో శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంలో ది. 8-10-2016 (శనివారం) నాడు రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారి అష్టావధానం జరిగింది. దీనికి పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు సంచాలకులుగా వ్యవహరించారు.
1) సమస్య (పింగళి వేంకట కృష్ణ గారు) -
"మూలకు నెట్టినా రిపుడు మూల యటంచును పూర్వశాస్త్రమున్"
పూరణ...
ఏల యవిద్యలంచు నిహిహీ యని వ్యంగ్యపు భాషణమ్ములన్
గూలఁగఁ ద్రోఁచినా రకట కోవిదు లెల్ల సముద్యమింపఁగా
లీలగ వేగమే నుదుటి రేఖల మార్చును దాని వీడుచున్
మూలకు నెట్టినా రిపుడు మూల యటంచును పూర్వశాస్త్రమున్.
2) దత్తపది (భానుమూర్తి గారు) -
'రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ' పదాలను ప్రయోగిస్తూ ఉత్పలమాలలో దేవీమాహాత్మ్యాన్ని వర్ణించడం.
పూరణ...
శంభునియందు 'మే నక'ట సాముగఁ జేసిన కల్పవల్లి సం
'రంభ' మిడంగ రాక్షసవిరాట్టులఁ గూల్చిన భవ్యకీర్తి నీ
శుంభ దనంత పాదరుచిఁ జూడఁగ 'నూర్వశి' సుందరాంగియే?
కుంభిని చాలు భక్తులకుఁ గూర్ప 'తిలోత్తమ'మైన పుణ్యమున్.
3) వర్ణన (శ్రీవల్లి గారు) -
కనకదుర్గమ్మవారి మంగళసూత్ర వైభవాన్ని వర్ణించడం.
పూరణ...
కామేశబద్ధ సూత్రము
ప్రేమాన్విత మదియె జగతి వీక్షించు సదా
శ్రీమంత సర్వమంగళ
నీమంబుగ మంగళములు నిత్యం బగుతన్.
4) నిషిద్ధాక్షరి (మల్లాప్రగడ శ్రీమన్నారాయణ గారు) -
వాగ్దేవి అందెల రవళి.
పూరణ... (కుండలీకరణాల్లోనివి నిషిద్ధాక్షరాలు)
మా(ట)మాట(మ)లె(న)మా(క)తానీ
నామ(మ)ంబున్(మ)ని(ప)ష్ఠతో(డ)విన(గ)మ్ర(త)వ్రత(మ)సం.. (రెండు పాదాలకు నిషేధం)
మా మాటలె మాతా నీ
నామంబున్ నిష్ఠతో వినమ్రవ్రతసం
ధామాంతర్గత రవముల
నామెతయై చెవుల కెపుడు నానంద మిడున్.
5) న్యస్తాక్షరి (గుమ్మా సాంబశివరావు గారు) -
మొదటిపాదం 14వ అక్షరం 'రా', రెండవపాదం 2వ అక్షరం 'మ', మూడవపాదం 3వ అక్షరం 'కో', నాల్గవపాదం 5వ అక్షరం 'టి'. మత్తేభంలో రామకోటి వైభవాన్ని వివరించాలి.
పూరణ...
రమణీయంబగు వేదికాస్థలిని నా'రా'ధించుచున్ శారదన్
సు'మ'నః పూజిత నేత్రయుగ్మమున సంశోభావహంబైన యీ
శ్రమ కోర్వన్ వలె నంచు పృచ్ఛకుల సుస్థానంబులం దుంచగా
నమరెన్ మేటి వధాన మన్న పగిదిన్ హాసంబులే చిల్కగా.
6) ఆశువు (డా. ప్రభాకర చిదంబర రాజు గారు)
ప్రథమావృత్తి - కనకదుర్గమ్మ ముఖారవిందాన్ని వర్ణించడం.
ద్వితీయావృత్తి - శృంగేరీ శారదాదేవిపై పద్యం
తృతీయావృత్తి - తిరుమల బ్రహ్మోత్సవాలలో భక్తుల ఇబ్బందులు.
(అవధాని పద్యాలను వేగంగా చెప్పడంతో వ్రాయడానికి వీలు కాలేదు)
7) ఛందోభాషణ (పువ్వాడ తిక్కన సోమయాజి గారు)
ప్రథమావృత్తి...
పృచ్ఛకులు -
శృంగేరీ వేదికపై
శృంగారపు పల్కు చిల్క చిత్కళ లొలుకన్
అవధాని-
బంగరు రంగుల నద్దిన
రంగ మ్మిది కవితకొఱకు రాంభట్ల కిటన్.
ద్వితీయావృత్తి...
పృచ్ఛకులు -
ప్రబలె ప్రేమికులకు మధ్య రాక్షసమ్ము
రాక్షసుల మధ్యనో యైక్యరాగ మొదవె
అవధాని -
చూడ విపరీత మియ్యది నాడు నేడు
కారణమ్ముల నేమని కనఁగవచ్చు?
తృతీయావృత్తి...
పృచ్ఛకులు -
ఇటు దుర్గమ్మకు మ్రొక్కుచు
నటు నమరావతి మహేశు నర్చింపగన్
అవధాని -
పటుతర కవితాధారల్
నిటలాక్షుని కృపను బొంది నిత్యము బారున్.
8) అప్రస్తుత ప్రసంగం (పృచ్ఛకుల పేరు మరచిపోయాను).
అవధానిగారికి అభినందనలు. అవధాన విశేషాలందించిన మాస్టరుగారికి ధన్యవాదములు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిఅప్రస్తుతం లోని చెణుకులు చెప్పండి
జిలేబి
జిలేబీ గారూ,
తొలగించండిఆ చెణుకులు (ఉంటే కదా!) వ్రాసుకోలేదు. అప్రస్తుత ప్రసంగాన్ని నిర్వహించిన పృచ్ఛకులు మంచి ప్రశ్నలనే సంధించారు. కాని అవధాని గారి సమాధానాలు అంత తృప్తికరంగా నాకు తోచలేదు.
అప్రస్తుత ప్రసంగం నిర్వహించిన వారు కప్పగంతు రామకృష్ణ
రిప్లయితొలగించండి