31, మార్చి 2018, శనివారం

సమస్య - 2637 (కాలికి కాటుక...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"కాలికి కాటుక కనులకు గజ్జెల నుంచెన్"
(లేదా...)
"కాలికి కాటుకన్ బులిమి గజ్జెలు కన్నుల గట్టె వింతగన్"
(డా. జి.ఎమ్. రామశర్మ గారి 'శతావధాన వైజయంతి' గ్రంథం నుండి)

30, మార్చి 2018, శుక్రవారం

దత్తపది - 136 (అమ్మ-అయ్య-అన్న-అక్క)

అమ్మ - అయ్య - అన్న - అక్క
పై పదాలను అన్యార్థంలో ప్రయోగిస్తూ
రామాయణార్థంలో
మీకు నచ్చిన ఛందస్సులో
పద్యాన్ని వ్రాయండి.

29, మార్చి 2018, గురువారం

ఆహ్వానము (అష్టావధానము)


సమస్య - 2636 (గ్రీష్మమునఁ బైటఁ దీసి...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"గ్రీష్మమునఁ బైటఁ దీసి కన్గీటె స్నుషయె"
(లేదా...)
"గ్రీష్మమునందుఁ బైటఁ దొలగించియుఁ గోడలు గన్నుగీటెరా"
(శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

28, మార్చి 2018, బుధవారం

సమస్య - 2635 (పతి గళమునఁ దాళిఁ గట్టె...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"పతి గళమునఁ దాళిఁ గట్టె భామ ముదమునన్"
(లేదా...)
"పతి గళమందుఁ గట్టె నొక భామిని తాళిని మోదమందుచున్"
(శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

27, మార్చి 2018, మంగళవారం

సమస్య - 2634 (అంగదుఁ డనిలోన...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"అంగదుఁ డనిలోనఁ జంపె నశ్వత్థామన్"
(లేదా...)
"అశ్వత్థామను జంపె నంగదుఁడు క్రూరాత్ముండునై పోరునన్"
(శ్రీ అష్టకాల  నరసింహరామ శర్మ గారికి ధన్యవాదాలతో...)

26, మార్చి 2018, సోమవారం

న్యస్తాక్షరి - 52 (భ-ద్ర-గి-రి)


అంశము - సీతారాముల కళ్యాణం
ఛందస్సు- చంపకమాల
న్యస్తాక్షరములు... 
మొదటిపాదం 4వ అక్షరం - భ.
రెండవపాదం 12వ అక్షరం - ద్ర.
మూడవపాదం 15వ అక్షరం - గి.
నాల్గవపాదం 20వ అక్షరం - రి.

(లేదా...)

ఛందస్సు - ఆటవెలది
నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా భ - ద్ర - గి - రి ఉండాలి.

పుష్పక విమాన బంధ సీసము

శ్రీరామ స్తుతి 

పద్యము చిత్రములో చదువు విధానము 
          పైన 'శ్రీ'తో మొదలు బెట్టాలి. 'శ్రీ దశరథ సుత' అని చదువుకొని తిరిగి 'శ్రీ'తో ఎడమ ప్రక్క ఏనుగు దగ్గిర గల 'రా' తో కలిపి 'తాటకాoతక ఘన రఘురామ'తో కొనసాగించి ప్రక్కన 'శ' దాని తర్వాత 'మ' దాని తర్వాత 'దాత' తో  కొనసాగించాలి.  క్రింద 'మే' కలిపి పై దాకా వెళ్లి 'చోరా' చదివి ప్రక్కన 'సంహార' ఆపి ప్రక్కన 'రా'తో మొదలిడి  మధ్య గడిలో  'వణ'తో చదివి 'వహ' అని పక్షి కన్ను దగ్గిర ఉన్న 'తి' తో కలిపి  ఎడమ ప్రక్క మొదటి రెక్కలో 'హరా' అని క్రింద రెక్కలోకి దిగి 'హర్ష' చివర ఉన్న 'నిర్వ' అన్న పదము తోటి   మరల కన్ను దగ్గిర 'తి' కలుపుకొని కుడి రెక్కలో 'వితరణ' అని కొనసాగించాలి. క్రిందకు దిగి 'విహారా' అని ప్రక్కన 'స' కలిపి పైన కన్నుదగ్గిర 'తి' కలిపి క్రిందకు దిగి 'సహిత మహిపాలక రామ వందనము నీకు' అని ముగించాలలి.
దీనిలో విశేషము 'శ్రీ రామ రామ రామేతి' అన్న శ్లోకం మొదటి పాదము బంధించ బడినది.   

సీ :
శ్రీ దశరథ సుత! శ్రీరామ! తాటకాం 
          తక! ఘన రఘురామ! తాపసి వర!
సతి యహల్యా శాప శమదాత! పిత వాక్య 
          పాలకా!  జానకీ ప్రాణ నాధ!
మేరు మహీధర సార వీరా! హను
          మ మది చోరా!  క్రూర మర్కట మద
సంహార! రావణ సహిత దానవ గణ
          వహతి   హరా!  రఘువర! మహీజ
తే :
హర్ష కారక! లక్షణ, హనుమ, నిర్వృ
తి వితరణ! విభీషణ సుమతి పచరిత వ
రా! అనంజ శకట విహారా! సతిసహి
త మహి పాలక రామ! వందనము నీకు.

కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

25, మార్చి 2018, ఆదివారం

సమస్య - 2633 (వృశ్చికపుచ్ఛంబుమీఁద...)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
"వృశ్చికపుచ్ఛంబుమీఁద వృషభము నిలిచెన్"
(లేదా...)
"వృషభము వచ్చి నిల్చినది వృశ్చికపుచ్ఛము మీఁదఁ జూడుమా"
(శ్రీ అష్టకాల నరసింహరామ శర్మ గారి 'అవధాన సరస్వతి' గ్రంథం నుండి)

ఒక విన్నపం... కవిమిత్రులు తమ పూరణ పద్యాలలో కందంలో శకార చకార సంయుక్తాక్షరాన్ని, వృత్తంలో షకారాన్ని మాత్రమే ప్రాసాక్షరాలుగా ప్రయోగించండి. విశేష ప్రాసలను ప్రయోగించకండి.

శివ బంధ సర్వలఘు సీస చిత్రమాలిక


సీ.
గరళము గళమున కఱకఱి గలుగక,
          ముదముగ గడిగొని యదితిజుల న
రసిన సుబలుడగు పసుపతికి శిరము
          మడచుచు నమసము నడపు వలయు,
బెడిదపు పొడమిని నిడుకొని సురనది
          బిరబిర  పరుగిడ శిరమున పెన
సి, మహిని సతము పసిడి ససిగ నమరు
          నటుల ననుగలము నడపిన విధు
తే.గీ.
నకు కయి కవ కలిపి ఘన నమసు నిడగ
వలయు, నొలికిలిని శవపు జెలిమి కలిగి
మసిని కలిలమున పులిమి మలగెడు నజు
నకు ఘనముగ నపచితి పొనరగ వలయు.       

          కఱకఱి = బాధ,  కడిగొని= మ్రింగి,  ఆరసిన   = కాపాడిన,  మడచు= వంచు, పొనరు = చేయు ,బెడిదము=  భయంకరమైన , పొడమి= రూపము,  పెన= బంధనము , అనుగలము = సాయము,కయి=   చేయి,  కవ = జంట ,ఒలికిలి=స్మశానము,కలిలము = దేహము,  మలగెడు= తిరుగెడు, అపచితి= పూజ,పొనరు = చేయు.

          విషమును కంఠమున బాధ పడక  సంతోషముగా  మ్రింగి  దేవతలను  కాపాడిన   ఘనమైన బలము గల శివునకు  శిరము వంచుచు నమస్కారము పెట్టవలయును.  భయంకరమైన   ఉగ్రరూపము  దాల్చి గంగమ్మ బిరబిర పరుగులేట్టు చుండ  తలపైన శిగలో చుట్టి  భూమిలో  పసిడి పంటలు పండునట్లు  సాయము చేసిన శివునకు చేయి చేతుల ద్వయము కలిపి ఘనముగా నమస్కారము చేయవలయును  స్మశానములో  శవముల చెల్మి గలిగి  దేహమునకు బూడిద పూసుకొని  తిరుగాడు  శివునకు ఘనముగా పూజలు చేయవలయును.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్