25, మార్చి 2018, ఆదివారం

శివ బంధ సర్వలఘు సీస చిత్రమాలిక


సీ.
గరళము గళమున కఱకఱి గలుగక,
          ముదముగ గడిగొని యదితిజుల న
రసిన సుబలుడగు పసుపతికి శిరము
          మడచుచు నమసము నడపు వలయు,
బెడిదపు పొడమిని నిడుకొని సురనది
          బిరబిర  పరుగిడ శిరమున పెన
సి, మహిని సతము పసిడి ససిగ నమరు
          నటుల ననుగలము నడపిన విధు
తే.గీ.
నకు కయి కవ కలిపి ఘన నమసు నిడగ
వలయు, నొలికిలిని శవపు జెలిమి కలిగి
మసిని కలిలమున పులిమి మలగెడు నజు
నకు ఘనముగ నపచితి పొనరగ వలయు.       

          కఱకఱి = బాధ,  కడిగొని= మ్రింగి,  ఆరసిన   = కాపాడిన,  మడచు= వంచు, పొనరు = చేయు ,బెడిదము=  భయంకరమైన , పొడమి= రూపము,  పెన= బంధనము , అనుగలము = సాయము,కయి=   చేయి,  కవ = జంట ,ఒలికిలి=స్మశానము,కలిలము = దేహము,  మలగెడు= తిరుగెడు, అపచితి= పూజ,పొనరు = చేయు.

          విషమును కంఠమున బాధ పడక  సంతోషముగా  మ్రింగి  దేవతలను  కాపాడిన   ఘనమైన బలము గల శివునకు  శిరము వంచుచు నమస్కారము పెట్టవలయును.  భయంకరమైన   ఉగ్రరూపము  దాల్చి గంగమ్మ బిరబిర పరుగులేట్టు చుండ  తలపైన శిగలో చుట్టి  భూమిలో  పసిడి పంటలు పండునట్లు  సాయము చేసిన శివునకు చేయి చేతుల ద్వయము కలిపి ఘనముగా నమస్కారము చేయవలయును  స్మశానములో  శవముల చెల్మి గలిగి  దేహమునకు బూడిద పూసుకొని  తిరుగాడు  శివునకు ఘనముగా పూజలు చేయవలయును.
కవి
పూసపాటి కృష్ణ సూర్య కుమార్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి