21, జూన్ 2025, శనివారం

సమస్య - 5159

22-6-2025 (ఆదివారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి”

(లేదా...)

“స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్”

15 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
ఘర్మజలము సిందంగ మాగాణి పండు
మురిసిపోవుచు జగమెల్ల భుక్తినందు
ప్రభునికిడెడు నైవేద్యమ్ము, రైతు మేని
స్వేదముం, బాయసమ్మని చెప్పి కొనిరి!

ఉత్పలమాల
మేదిని కర్షకుల్ వెతల మేనిని ఘర్మజలమ్ము సిందుచున్
గాదెల నింపు ధాన్యమదె ఖాద్యము గాదె జగమ్ముకంతకున్
మోదము మీర దేవునకుఁ బూజ ప్రసాదమునౌచు, రైతుదౌ
స్వేదముఁ, బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్

M.B.G.TILAK చెప్పారు...

పేదలకు విందు సేయుచు పిల్చెనామె
ముందు వేడిగ పాకము నందజేయ
క్షుత్తు దీర్చుకొనన్, బోవనొత్తుకొనుచు
స్వేదముం, బాయసమ్మని చెప్పి కొనిరి

పేదలకై పరిత్రమని వేసవి కాలపు మండుటెండలో
సాదము సిద్ధమైనదని చప్పున రండని పిల్చి ముందుగా
పైదలి వేడిపాకమును వడ్డన సల్పగ, పోవనొత్తుచున్
స్వేదముఁ, బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ భువినిఁ గష్టనష్టములకుఁ బోరి నిలిచి
సంపదలఁ గన స్వేదము జాలువారు
పిదప సౌఖ్యమబ్బ జనులుఁ బ్రియము మీర
స్వేదముం బాయసమ్మని చెప్పికొనిరి

ఉ॥ మేదిని కష్టనష్టములు మిన్నగఁ బొందిన నెందరెందరో
మోదము మీర సంపదలఁ బొందిరి ఘర్మజలమ్ము చిందఁగన్
సేదయుఁ దీరె నెమ్మదిగ స్వేదము సంపద రూపమొందె నా
స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్

కష్టేఫలీ అండి. అందరూ అనుభవించినదే నండి

Sitharamayya Solasa చెప్పారు...

వేసవి దినములందలి వేడి నోర్చ
దాటి వృక్షమొసంగెడు ధవళవర్ణ
స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి
పల్లె జనులు శరీరపు బాగుగోరి

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

ఆరు గాలము శ్రమియించు నన్న దాత
జనుల కడుపులు నింపెడు శక్తి యుతుడు
కష్ట పడుచును చిందించు కమ్మ నైన
స్వేద మును పాయసమ్మ ని చెప్పు కొనిరి

విరించి చెప్పారు...

అప్పుడెప్పుడొ చేసిన యప్పులనుచు
తిరిగి రాబట్టు కొనుటకై దొరలు వారు
వెట్టి చాకిరి పేరున పేద జనుల
స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి.


వాదన జేయనేల యిది వాస్తవ మంటిని యాలకించుమా
పేదల పాత బాకియని వేతన మిచ్చుట మాని వెట్టియే
మోదమటంచు స్వార్థమున భూపతు లెల్ల గరీబు రక్తమున్
స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తేటగీతి గర్భిత సీస పద్యం.
సీ : ఋక్కులన్ జదువ నా ఋషి తుల్యు లెల్లరు
బ్రతికె వేద మ్మని ప్రజకు దోచె
సామవేదం బూని సాగించగా వారు
సంగీత మిది యను జ్ఞాన మబ్బె
వా రధర్వణవేదపఠనమ్మొనర్పగా
భారతీయుల లోని ప్రతిభ దెలిసె
వినుచు బాలుని యజు
స్,వేదమున్ బాయస
మ్మని చెప్పికొనిరి విద్యార్థు లెల్ల

ఆ.వె:వేదవిద్య నేల విడచి వేసెద రయ్య
దాని మించు విద్య ధరణి లేదు
అర్థ మరయ ఘనమె,అర్థమ్ము కాకున్న
వినిన విందు కాదె వీనులకును!

(స్వేదం నుంచి వేదం ను విడగొట్టటానికి ఈ ప్రయత్నం చేసాను.యజుర్వేదం లోని మంత్రాన్ని "యజుస్" అంటారు.యజుస్+వేదము అన్నపౌడు స్వేదము వచ్చింది.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:పేదతనమ్ము తో నవయు విప్రకుమారుడు సస్వరమ్ము గా
వేదము నుచ్చరించు తరి వీనులవిందుగ నుండ క్రొత్తగా
వేదము నేర్చు గోరికన బ్రీతి వహించియు గొప్ప నీ యజు,
స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్”.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఖేదములెన్నొ సైచివిసుగేమియు జెందకనారుగాలమున్
స్వేదమునోడ్చి కర్షకులు సేద్యము సల్పుచు పల్లటమ్ములన్
మోదముగా భరించి ఫలమున్, దలబోయుచు కర్షకాళిదౌ
స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఆరుగాలము కష్టించి యన్నదాత
పంట పండించి ఫలసాయమింటఁజేర్చ
కష్ట ఫలమును గన్నులఁగాంచి రైతు
స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:మోదము జూపగా దనదు మోమున బ్రేక్షకు లెల్ల మెచ్చి యా
మోదము నీయ నాశ బడి,మోహము వీడక నాట్య మందునన్
వేదన ద్రొక్కిపెట్టి తన విద్యను జూపెడు భామ పొందగా
స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్”
(నాట్యం చేసే ఆమెకి చెమటలు పడుతున్నాయి.ఆ శ్రమని చూడక ఆ నాట్యాన్ని అంతా పాయసం అనుకొని ఆస్వాదించారు.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

జలము కాదిది సత్య మెంచంగఁ దాము
పడ్డ కష్టములకుఁ గన్న ఫలిత మంచు
వడి వడి తమ వస్త్రమ్ములఁ దుడిచికొంచు
స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి


గాదిలి దేవ మిత్రుఁ డట కామిని వేషము దాల్చి యా ద్విష
త్సూదనుఁ డా సుధా రసము దూర్ణము బంచఁగఁ గైతవమ్మునన్
వేదన తోడి సత్ఫలముఁ బ్రీతిని స్వీయ మహా పరిశ్రమ
స్వేదముఁ బాయసమ్మనుచుఁ జిత్తము రంజిలఁ గ్రోలి రెల్లరున్

Dr H Varalakshmi చెప్పారు...

సమస్య:
స్వేదముఁ బాయసమ్మనుచుఁజిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్”

ఉత్పలమాల:

మోదము గల్గె దాస్యమును, మోసము చేరిన వారు, బోవఁగన్
ఖేదపు జీవనమ్మునను, ఖేలన దోచెను, వెల్గురేఖలున్
రోదన వోయి, జీవనము రోయక సాగగ నెంచి, స్వేఛ్ఛయన్
స్వేదముఁ, బాయసమ్మనుచుఁజిత్తము రంజిలఁ గ్రోలిరెల్లరున్”

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

కష్టపడి నారుగాలము కర్షకులును
ఘర్మ జలమును చిందించి కాయమంత
స్వేదముం బాయసమ్మని చెప్పికొనిరి
బంధువులకు మిత్రులకును వాసిగాను.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

పగలురేయిపొలములందుపనులచేయు
కర్ష కాళియు సతతము కష్టపడుచు
స్వేదముం బాయసమ్మని చెప్పి కొనిరి
బంధు మిత్రుల తోడను వాసిగాను.