11, సెప్టెంబర్ 2025, గురువారం

సమస్య - 5241

12-9-2025 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“గానవిశారదగ పికము కాకినిఁ బిలిచెన్”

(లేదా...)

“గానవిశారదా! యనుచు కాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై”

(ఆరవల్లి శ్రీదేవి గారికి ధన్యవాదాలతో...)

17 కామెంట్‌లు:

పఠానేని కార్తిక్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
పఠానేని కార్తిక్ చెప్పారు...

ఉ.
కానగ చూత పూర్ణ ఫల కమ్ర సమావళి వృక్ష శాఖపై
గానపు స్పర్థ సాగె చని కాకము మున్కొని పాట పాడగన్
మానిత ధైర్య సద్గుణము మంచిగ మెచ్చుచు ప్రోత్సహింప "హే
గానవిశారదా !" యనుచు కాకిని కోకిల పిల్చె ప్రీతిమై !

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
హీన గుణుండగు నేతకు
పానకమును బోలు తీపి పలుకులు తరమే?
బేనఁగఁ బొగడ్త సభఁ గవి,
గానవిశారదగ పికము కాకినిఁ బిలిచెన్!

ఉత్పలమాల
హీన గుణుండుగన్ జగమునెంచెడు నేతయె గద్దెనెక్కఁగన్
పానకమట్లు తీపిగను బల్కులనొల్కుట సాధ్యమౌనొకో!
పేని పొగడ్తలన్ సభను పేర్కొనఁ బండితుఁ,డెల్లరందురే!
"గానవిశారదా! యనుచు కాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై!"

Sitharamayya Solasa చెప్పారు...

తానటుల గట్టిగ నరవ
లేననుచు తెలియగ నోర్వలేమి తనమునన్
నాన విడిచి గేలికొనుచు
గానవిశారదగ పికము కాకినిఁ బిలిచెన్

విరించి చెప్పారు...


నేను సరితూగ నని యు
త్థానమ్మునకేగువేళ దక్షతగల యం
జానుగ నను క్రీడినిగన
గానవిశారదగ పికము కాకినిఁ బిలిచెన్.


కానగ మేటి వీరుడవు గండరగండడ వైన నీకు ను
త్థానము నేగువేళ నొక దక్షత గల్గిన యట్టి మేటి యం
జానుడు లేకపోవుట విచారమటంచను క్రీడి గాంచగా
గానవిశారదా! యనుచు కాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై.

Radha krishna Sharma చెప్పారు...

కానన మందు పిత్సువుల గాన కచేరి పులాకి శాఖపై
మానుగ సాగుచుండ కని మౌకలి యొక్కటి కర్కశంబుగన్
గానము చేయగన్ కరకు కంఠము తోడను ప్రోత్సహించ హే
గానవిశారదా యనుచు కాకిని గోకిల పిల్చె బ్రీతిమై

M.B.G.TILAK చెప్పారు...

కాననమందున మిత్రుడు
గానమొనర్ప గమనించె కాలాండజమే
తానట కొమ్మ శిఖర భా
గాన విశారదగ పికము కాకినిఁ బిలిచెన్

తేనెలు చిల్కుపొంకమున తియ్యగ పాడెడు పంచమాస్యమే
కానగ నొక్క కృష్ణముకు గాదిలి మిత్రుడు కాననంబునన్
దానొక మావితోటఁజని దబ్బున వ్రాలుచు పల్లవాగ్ర భా
గాన విశారదా! యనుచు కాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

వీనుల విందుగ పాడెను
గాన వి శారద గ పికము :: కాకిని బిలిచె న్
స్నానము జేసియు విప్రుడు
బోనపు పిండము ను దినగ బూనిక తోడన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

గానము కర్ణపేయముగ కాకులు సేయుట గాంచమెచ్చటన్
గానకళా విశారదలు కమ్మగ గూసెడి కోకిలమ్మలే
యైనను కాకి గూఁటఁదన యండములుంచెడు స్వార్థబుద్ధితో
గానవిశారదా! యనుచు కాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కానము కాకములెన్నఁడు
గానము సలుపుట పికముల గానమువోలెన్
యైనను స్వార్థఁపు దలపున
గానవిశారదగ పికము కాకినిఁ బిలిచెన్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥మానిత వర్యులు మూర్ఖులు
సూనృతమై కల్లలిలను సొగసుగఁ బరఁగన్
దానును వ్యంగ్యము విరియఁగ
గానవిశారదగ పికము కాకినిఁ బిలిచెన్

ఉ॥ మానిత వర్యులై వెలిఁగి మన్నన నొందఁగ జ్ఞానశూన్యులే!
సూనృత మంచు మెచ్చుకొను చుండఁగఁ గల్లలు పల్క నాయకుల్
మానక రాజకీయమున మానస మొప్పక వ్యంగ్య రూపునన్
గానవిశారదా యనుచు కాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:"నే నన వసంతరాగము,
రానుండిన బంధువులని, రాగము తో నీ
గానమ్మగు"నని స్వాగత
గానవిశారదగ పికము కాకినిఁ బిలిచెన్
(కాకి అరుస్తుంటే బంధువులు రానున్నారని ప్రజల నమ్మకం.అలాగే నేను వసంతగానం చేస్తా కానీ నువ్వు బంధుస్వాగతగానవిశారద వని కోకిల కాకిని గుర్తించి మెచ్చుకొన్నది.)


Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:నేను వసంతగానమును నేర్చిన వాడనె కాని నీవలెన్
గానము జేయ జాల గద !"కా" యను పైతృక కర్మ లందు నీ
గానము మంత్రమై యలరు గాదొకొ! యంచును, మంత్రవిద్వరా!
గానవిశారదా! యనుచు కాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై”
(నాకు వసంతగానం తెలుసు కానీ నీ "కా" అనే గానం పితృకర్మలలో ఒక మంత్రం లాగా ఉంటుంది.మంత్రగానవిశారదా అని కోకిల కాకిని మెచ్చుకొన్నది.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

(3)ఉ:గానపికమ్ముగా బిరుదు గాంచిన గాయకుడున్,సమానుడై
గానము నందునన్ వెలుగు కాకిని బోలెడు నల్ల వాడు నా
గానసభాస్థలిన్ గలియ గౌగిలి జేర్చుక స్వాగతమ్మహో
గానవిశారదా! యనుచు కాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై
(ఇద్దరు గాయకులలో ఒకరికి గానపికము అనే బిరుదు ఉంది.మరొక గాయకుడు నల్లగా కాకి లాగా ఉంటాడు.ఈ గానకోకిల ఆ కాకిని కౌగిలించి "గానవిశారదా!అంది.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

కూన లవు నంత కింపుగ
మానక తన గ్రుడ్డులఁ దగు మాటున నిడు నా
వైనమున వంచనమ్మున
గానవిశారదగఁ బికము కాకినిఁ బిలిచెన్


మానమొ లేక కట్ట యవమానమొ నేరని చొప్పు చొప్పడన్
గానము నందు విశ్వమున గాయక కాయము నందు నెన్నినం
దా నధికుండ నంచు నెదఁ దల్చుచు గార్దభ రాడ్వరేణ్య జి
ద్గానవిశారదా! యనుచుఁ గాకినిఁ గోకిల పిల్చెఁ బ్రీతిమై

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

పూని యశమును గొనె నిలను
గాన విశారదగ పికము; కాకినిఁ బిలిచెన్
బోనము కలదని,కాకియు
తానిక పిండము తినగను తారసిలె వడిన్.