14, సెప్టెంబర్ 2025, ఆదివారం

సమస్య - 5244

15-9-2025 (సోమవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“అనృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము”

(లేదా...)

“అనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్”

16 కామెంట్‌లు:

Sitharamayya Solasa చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
నేలదున్నుచు రైతులు నింగినమ్మి
చీడపీడల కోర్చుచు చేసి వ్యయము
వానరాకయె నష్టాల వగచి కూలె
డనృత విషయములెల్ల సత్యములె సుమ్ము!

చంపకమాల
అనుదినమార్తితో పొలమునందు శ్రమించుచు కర్షకాళి కా
దనకయె చేసి వెచ్చములు నాశలు దీర నిరీక్షఁ జేసినన్
కినుకగు రాక వానలవి గేదల మేతకుసైతమేడ్చెడ
య్యనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్!

అనృతము = కృషి

పఠానేని కార్తిక్ చెప్పారు...

చ.
పనిగొని శాంభవీ కమల పాదయుగంబ మనస్సు నిల్పి తా
ను నియతి వెల్గు వాడట వినూత్నముగా నిను చేరి గొప్పగా
ధనమును గల్గి లేములను దాటెదవీవని పల్కె, భావి నా
యనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగా దగున్ !

Sitharamayya Solasa చెప్పారు...

ఉన్నదానిని వేరుగ నుగ్గడించ
నానవాయితి యాతనిదదర కుండు ,
వాడెవరి తోడనైనను వక్కణించు
అనృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము

విరించి చెప్పారు...


జగము లేలు వాడొక్కడే స్కంభుడనుచు
పలుకు మాటలు నమ్మకవాస్తవముల
టంచు నాస్తికిలు పలుకు నట్టి మాట
లనృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము.


జనులకు చెప్పె నాస్తికుడు స్కంభుడటంచును లేడు లోకమున్
ఘనుడని తెల్పు రాముడొక కల్పన కృష్ణుని పాత్ర యట్టిదే
యనుచు వచించువాని నుడు లన్నియు బూటకమంచు వాడనే
యనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్.

Radha krishna Sharma చెప్పారు...

రెక్కలన్ ముక్కలుగ జేసి దుక్కి దున్ని
పంట దండిగా పండించి ప్రజల కిడును
శ్రమను నమ్ముకొనుచు సదా సైరికుండు
అనృత విషయమ్ము లెల్ల సత్యములె సుమ్ము

అనృతము =కృషి

M.B.G.TILAK చెప్పారు...

చూడ నెప్పుడు పల్కడు సూనృతములు
సత్యమనుచు వచించె నసత్యములను
తాఱుమాఱుగ విషయమ్ము తనరుచుండ
ననృత విషయమ్ములెల్ల సత్యములె సుమ్ము

అనయము దుష్ట కర్మముల కాదరమొప్పగ సంచరించుచున్
జనులకు దుష్టశీలుడట సత్యమటంచు వచించె కల్లలన్
వినయము చిందులాడు మొగి పెంకెవచించెను తాఱుమాఱుగా
ననృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అనయము పేదసాదలకు నాదటఁ నిల్చియొనర్చ సేవలన్
పనిగొని రాజకీయమున పాల్గొనవచ్చితినన్న పల్కులే
యనృతములెల్ల, సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్
జనులను మోసగించుటకు సల్పు నసంగతమైన వాక్కులే.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

తే.గీ:సకలపాషండ మతములున్ సమసి పోయె,
శంకరుడు రాగనే పరాజయము నొందె
ననృత విషయమ్ములెల్ల, సత్యములె సుమ్ము”
శంకరుని బోధ లవి విన శంక లుడుగు

Dhanikonda Ravi Prasad చెప్పారు...

(2)చం:అనయము సత్యమున్ బలుకు నట్టి మహర్షుల వాక్కులే ఫలిం
చును, మరి దొంగ సాధువగుచున్ వచియించెడు వీని పల్కు లెం
చిన నిజ మెట్టులౌ!నితడు చెప్పెడు నీదగు జాతకమ్ములో
ననృతము లెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్”
(గొల్లపూడి మారుతీ రావు గారు ఒక సాధువు మీద ఒక సెటైర్ వ్రాసారు.ఆ సాధువు అందరినీ తిట్టి శాపాలు పెట్టే వాడట.వాడితో తిట్టించుకుంటే శుభమని అంతా తిట్టించుకునే వారు.అవును మరి.మహర్షులు మాట్లాడేవి సత్యా లౌతాయి కానీ వీడు దొంగ సాధువు కాబట్టి వీడు దీవిస్తే నాశన మౌతారు.శపిస్తే బాగు పడతారు.వాడు అబద్ధాలు చెపితే అవి నిజా లౌతాయి.)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ విదురుఁడు మరువక నెపుడు వినమటంచు
ధర్మమార్గము నన్నకు తగు పగిదిని
నుడివెఁ గనమని కావని విడమఱచుచు
ననృత విషయమ్ము లెల్ల సత్యములె సుమ్ము

చం॥ అనయము ధర్మమా విదురుఁడన్నకు బోధను జేసె తీరుగన్
వినుమని నీతి సూక్తులను బ్రీతిని సంకట మందు స్ఫూర్తితోఁ
గనుఁగొన సూక్త పద్ధతినిఁ గామిత మొప్పఁగఁ గావు కావయా
యనృతము లెల్ల సత్య విషయమ్ములు సుమ్మవి నమ్మఁగాఁ దగున్

విదురుడు కావు అనృతములు ఎల్ల సత్యములు అని తెలిపినాడని అండి

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

జనులు నమ్ముచు నుందురు జగతి యందు
*“అనృత విషయమ్ము లెల్ల సత్యములె సుమ్ము”*
వినుమనెడుమాట నమ్మకు వేగిరముగ
నేల ననుమానము నరయ నెల్లకల్లె



వినగనెసత్యమేమొయనిపించుచువేగమెనమ్ముచుందురా
*యనృతములెల్ల,సత్యవిషయమ్ములు సుమ్మువినమ్మగా దగున్*
మనమున నెల్లవేళలను మానుగ మాధవునే తలంచునా
మునివరులాడుమాటలవి మోక్షపు దారిని చూపు దారులే



కరణం రాజే శ్వర రావు చెప్పారు...

సఖుని నవ్వించు కొఱకు నై చక్క నైన
బొంకు లను జెప్పి చుండగ మోద మంద
ననృత విషయ ము లెల్ల సత్యము లె సుమ్ము
యనుచు మిత్రుండు తలచెతా నాత్మ యందు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ధర్మ నందను నోట నధర్మ వాక్కు
లేల వచ్చును సుంత చింతించి చూడ
మనసు లోపల నీ వనుకొనిన యట్టి
యనృత విషయమ్ము లెల్ల సత్యములె చుమ్ము


వనజభ వాంగనా మణియె భారతి పన్నుగ నిల్వ నాల్కపై
మనము వినిర్మలం బయిన మానవ వర్యున కిద్ధ ధర్మ మా
న్యున కల యప్రయత్నముగ నోర బయల్పడ నిత్య సత్య వా
గనృతము లెల్ల సత్య విషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

చం;అనయము రాజకీయమున నావలి పక్షము వారు సత్యమే
యనిన నసత్యమే యగు కదా యది యీవలి వారికిన్!, మృషల్
కనబడినన్ స్వపక్షమున కమ్మగ నుండును వీరి పక్షమం
“దనృతములెల్ల సత్యవిషయమ్ములు సుమ్మవి నమ్మగాఁ దగున్”
(నాకు కచ్చితమైన పూరణ ఇప్పుడు దొరికింది.రాజకీయాలలో అవతలి వారు చెప్పే నిజాలు అసత్యాలు గా ఇవతలి వారి అసత్యాలు సత్యాలు గా కనిపిస్తాయి.)

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

ప్రాణ,మాన రక్షణ యందు పలుక వచ్చు
ననృత విషయమ్ము లెల్ల;సత్యములె సుమ్ము
నట్టి వాని నసత్యము లనగ రాదు
జగతిలోన వాటి వలన జరుగ మేలు.