5, మార్చి 2026, గురువారం

సమస్య - 5399

6-3-2026 (వారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బూదిలోనె గలదు భూతి యెల్ల”
(లేదా...)
“బూదిలోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా”

14 కామెంట్‌లు:

  1. ఆటవెలది
    మేధపంచిభువికి మృత్యువు పాలైన
    వారికంటె కూడ పంచకుండ
    సాగిరధికులన శ్మశానామ్మునందలి
    బూదిలోనె గలదు భూతి యెల్ల!

    ఉత్సాహము
    మేధభువికి పంచి పిదప మృత్యువందు వారలన్
    మేదినెపుడు పంచకుండ మించి సాగనెందరో
    పాదుకొనగ నద్భుతంపు పటిమయే శ్మశానపున్
    బూదిలోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా!

    నేపథ్యం:

    పెద్ద నీతితో కూడిన ఈ చిన్నపుస్తకాన్ని టాడ్ హెన్రీ (Todd Henry) రాశారు.
    ఈ పుస్తకం రాయడానికి ఓ ప్రేరణ వుంది.
    టాడ్ హెన్రీ ఒక వ్యాపారపరమైన సమావేశంలో పాల్గొంటున్నప్పుడు వాళ్ళ డైరెక్టర్ ఒక ప్రశ్నవేస్తాడు.
    ‘ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత ఖరీదైన భూమి ఎక్కడ వుంది?’ అనేది ఆ ప్రశ్న.
    ‘గల్ఫ్ దేశాలు అని ఒకరు, వజ్రాల గనులు ఉన్న ఆఫ్రికా’ అని మరొకరు ఇలా జవాబులు చెబుతారు.
    అప్పుడా డైరెక్టర్ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసే సమాధానం చెబుతాడు.
    ‘ఈ లోకంలో అతి ఖరీదైన స్థలం స్మశానం’
    ‘ఎందుకంటే...
    అంటూ ఆయనే వివరణ ఇస్తాడు.
    ‘ఈ ప్రపంచంలో అనాదిగా కోటానుకోట్లమంది పుట్టారు, మరణించారు. ఇంకా పుడుతూనే వున్నారు, ఇంకా చనిపోతూనే వున్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటలను ప్రపంచానికి పంచారు. కానీ అధికసంఖ్యాకులు మాత్రం తమలో నిగూఢ౦గా వున్న మేధస్సును, అనేక ఆలోచనలను, అద్భుతమైన ఐడియాలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడలేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కకుండా పోయింది. అవన్నీ సమాధుల్లోనే నిక్షిప్తం అయిపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న స్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడ వుంటుంది చెప్పండి’
    డైరెక్టర్ చెప్పిన మాటలు టాడ్ హెన్రీ మనస్సులో గట్టిగా నాటుకుని పోయాయి.
    ఆ ప్రేరణతోనే టాడ్ హెన్రీ "Die empty” అనే పుస్తకం రాసి అద్భుతమైన రచయితగా పేరు పొందాడు.
    ఆయన ఈ పుస్తకంలో అంటాడు ఇలా ఒకచోట.
    ‘మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్ళకండి. అవేవో ఈ ప్రపంచానికి పంచేసి వెళ్ళండి’
    నిజానికి టాడ్ హెన్రీ చెప్పదలచుకున్నది ఏమిటంటే:
    ‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్ళండి.
    ‘మీ దగ్గర మంచి ఆలోచన వుంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.
    ‘మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.
    ‘మీకేదైనా లక్ష్యం వుంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.
    ‘ప్రేమను పంచండి, మీలోనే దాచుకుని వృధా చేయకండి’
    వున్నది నలుగురికీ పంచడం ఈనాటి నుండే మొదలు పెడదాం. మన మంచితనంలోఉన్న ప్రతి అణువునూ అందరికీ ఇచ్చేద్దాం!
    ‘అప్పుడు హాయిగా ...ప్రశాంతంగా....
    👏“Let us Die Empty"

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది ఆర్యా. నా చదవాల్సిన పుస్తకాల లిస్టుకి మీరు ఇంకోటి చేర్చారు.

      తొలగించండి
  2. దేశజనుల బ్రతుకు తీరు బాగుగనుండు
    జేనులందు జేయు సేద్యమొనర ,
    పంట పండుటకయి వలసిన యెరువగు
    బూదిలోనె గలదు భూతి యెల్ల

    రిప్లయితొలగించండి

  3. ఆది భిక్షువనుచు నందరు కొలిచెడి
    శైలధన్వుడతడె సంపదొసగు
    ననెడి మాట సత్య మతడు నుదుట దాల్చు
    బూదిలోనె గలదు భూతి యెల్ల.

    ఆది దేవుడతడు భార్గుడంతక హరుడు భవు డా
    యాదిభిక్షువంచు భక్తులాదరమున పిల్చు చున్
    మోదమున్ గొలిచెడి పంచముఖుడు నుదుట దాల్చెడిన్
    బూదిలోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా.

    రిప్లయితొలగించండి
  4. ఆదిభిక్షువైన హాయిగా ధరియించు
    సర్వరోగములకు జాయువనుచు
    చెప్పుచుంద్రుగాదె చిత్తగించమనుచు
    బూదిలోనె గలదు భూతి యెల్ల

    ఆదిభిక్షువుకు విబూది యంగరాగ మేగదా
    సాదరమ్ముగ ధరియింత్రు సర్వరోగ భంగమే
    వేదసారమరయనొప్పు విశ్వమంత మెచ్చగా
    బూదిలోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా

    రిప్లయితొలగించండి
  5. భక్తి గలిగి కోరి ముక్తిని జీవులు
    శివుని నామ జపము చిత్త మలర
    సతము సలిపి నుదుట శంకరు డలదు వి
    బూది లోన గలదు భూతి యెల్ల

    రిప్లయితొలగించండి
  6. ఆ.వె:ఏమి కర్మ మయ్య? ఎవని యేడుపు కొట్టె
    నగదు రద్దు చేసి నాడు మోడి
    ధనము చిత్తు కాగితములట్లు గాల్చితి
    బూదిలోనె గలదు భూతి యెల్ల”
    (నగదు రద్దైతే ఒకాయన నల్ల ధనాన్ని మంట పెట్టేసాడు. )

    రిప్లయితొలగించండి
  7. ఉత్సాహము
    (కొందరు సన్యాసులు విభూది సృష్టించి యిస్తారు. జనులు దేవుడని నమ్మి అమితమైన కానుకలు యిస్తారండి. నిజంగా వారికి విభూతే ఐశ్వర్యమండి)

    మేదిని యటు సన్యసించి మేటి శక్తిఁ గంటిమే
    ఆదరించి మిమ్ము బాధలన్ని తొలఁగఁ జేయమే!
    సోది గాదు వినుడు మహిమఁ జూడు మనెడు వారికే
    బూదిలోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా

    భూతి ఐశ్వర్యము

    రిప్లయితొలగించండి
  8. ఉత్సాహం

    ఏది నాది? యేది నీది? యేది నిత్య మీ భువిన్?
    చేదు సత్య మిద్ది, యెల్ల చేరు బూది లో గదా!
    బూది తెల్పు నా విరక్తి బోల దెట్టి భాగ్యమున్
    బూదిలోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా
    (వైరాగ్యధనం అనే పదం ఒక వాడుక.విభూతి లో వైరాగ్యధనం ఉంది. )

    రిప్లయితొలగించండి
  9. నమ్మకమ్ము నూని యిమ్ముగ ధరియింత్రు
    భరత ఖండ మందు భక్తు లెల్ల
    హరి హర వర భక్తు లందఱి పుండ్రాల
    బూది లోనె గలదు భూతి యెల్ల


    వాదన లొనరింప నిందుఁ బాడి కాదు వింటివే
    మోద మూని నుదుటిపై విబూది బొట్టు నుంతురే
    రాదు వట్టి బూది యంచు వ్రాయ దీని శైవు మై
    బూది లోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా

    రిప్లయితొలగించండి
  10. ఆటవెలది:
    బూది శివుఁడు మేనఁ బులుముకొను సతము
    బూది యుపరమమును బోధసేయు
    మోక్షమార్గమది ముముక్షువులకు బూది
    బూదిలోనె గలదు భూతి యెల్ల

    ఉత్సాహము:
    బూది శివుఁడు మేనిపైన బులుముకొనును సంతతం
    బూదికాదె యుపరమమును బోధసేయు మార్గమే
    బూది మోక్షదాయకమ్ము భువిని జీవకోటికిన్
    బూదిలోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా

    రిప్లయితొలగించండి

  11. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    ఆది భిక్షువనుచు నందరు గొలిచెడు
    వారణాసి యందు వాసముండు
    గరళకంఠు డతడు కాయమునకు దాల్చు
    బూదిలోనె కలదు భూతి యెల్ల.

    రిప్లయితొలగించండి
  12. ఆది శంక రార్యు నుడుల హర్ష మొంది తల్చుచున్
    బాధలుడుగ జేయు నంచు భక్తి శివుని గొల్చుచున్
    ప్రోది చేసి పుణ్య మెంతొ పొంద స్వర్గ మెంచగా
    బూదిలోనె కలదు సుమ్ము భూతి యెల్ల మిత్రమా

    రిప్లయితొలగించండి
  13. ఆలయములకేగి అభవునిదర్శించి
    భక్తితోడ మ్రొక్కి పావనమగు
    బూదినిగొనితలకుపూసుకొనినచాలు
    *“బూదిలోనె గలదు భూతి యెల్ల”*


    ఆదరించుశివుడుమనలనన్నివేళలందుతా
    వేదవేద్యుడైనగాని విశ్వ మెల్ల తానుగా
    మోదమెల్లవారికిలనుభూరిగానుపంచు నా
    బూదిలోనెకలదుసుమ్మిభూతియెల్లమిత్రమా

    రిప్లయితొలగించండి