21, ఏప్రిల్ 2026, మంగళవారం

సమస్య - 5446

22-4-2026 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కనులు గలవు గాని కాంచలేఁడు”
(లేదా...)
“ఇంతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై”

4 కామెంట్‌లు:

  1. వరూధినీ విలాపము:

    ఆటవెలది
    వగలు జూపి చేర ప్రవరాఖ్యుఁడేలనో
    కట్టుబాటులనుచు నెట్టె తుదకు
    నప్సరసల పొందు యరుదైన నింతలు
    కనులు గలవు గాని కాంచలేఁడు!

    ఉత్పలమాల
    కంతు జయంతులన్ గెలుచు కమ్మని రూపము సూచినంత నే
    నింతిగఁ జేరినన్ ప్రవరుఁడేలనొ మోజున కౌగిలించడే?
    సుంతయు నప్సరామణిగఁ సోయగమొల్క చలించడేలనో?
    యింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై!

    రిప్లయితొలగించండి

  2. *(దుర్యోధనుని తో శకుని మాటలు గా ఊహించి.)*

    ధర్మ మార్గ మంచు ధర్మజు డెప్పుడు
    నిలువ రించు సోదరులను తాను
    దుష్టులమగు మనదు దుశ్చర్యలనతండు
    కనులు గలవు గాని కాంచలేఁడు.


    సుంతయు నైన యాగ్రహము చూపడు ధర్మము సత్యమంచు తా
    శాంతిని కోరు వాడతడు శత్రువు లెంతగ కించ పర్చినన్
    పంతము బూనబోడుకద పాండుసుతాగ్రజుడెంచి చూడగా
    నింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై.

    రిప్లయితొలగించండి
  3. పుట్టుగుడ్డి యగుచు పుట్టినందున రెండు
    కనులు గలవు గాని కాంచలేఁడు ,
    జీవితమున సతము జేదోడు గావలె ,
    పాపమతని జూడ బాధ కలుగు

    రిప్లయితొలగించండి
  4. పట్టకుండునెపుడు ప్రజల సమస్యలు
    స్వప్రయోజనమ్మె వానికెపుడు
    మంచి చూడలేని మాయావి నేతకు
    కనులు గలవు గాని కాంచలేఁడు

    చింతలు లేనివాఁడు కడు చిత్రముగా చెలరేఁగు చుండురా
    పంతము బూని దుష్ట పరిపాలన సల్పిన మూర్ఖ నేతరా
    సుంతయు లెక్కలేదు మరి చూచుట కేల మనస్కరించురా
    యింతలు గన్నులుండి కనఁ డెయ్యది వాఁడు వివేకదూరుఁడై

    రిప్లయితొలగించండి