30, ఏప్రిల్ 2026, గురువారం

సమస్య - 5455

1-5-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా”

(లేదా...)

“తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా”

(అక్కెర కరుణాసాగర్ గారికి ధన్యవాదాలతో...)

5 కామెంట్‌లు:

  1. ఇప్పటి కాలము నందున
    దప్పగ నేర్వదగుదైన దారిని యెంచన్
    గొప్ప పదవి గల జనుల
    తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    రిప్లయితొలగించండి
  2. కందం
    ముప్పు ఘటిల్లు పదవినిన్
    గొప్పగ కూర్చున్న వారి కుటిలమునెంచన్
    దిప్పలు పరోక్ష దాడులఁ
    దప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    ఉత్పలమాల
    ముప్పు ఘటిల్లెడున్ పదవి పోందిన నేతల తప్పులెంచినన్
    గొప్ప వ్యవస్థలున్ దరుమ కూలబడంగను దప్పదెప్పుడున్
    దిప్పల జిక్కుచున్ నడత తీరును మార్చక కార దిక్కగున్
    దప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా!

    రిప్లయితొలగించండి

  3. ఎప్పుడు మౌనము వీడకు
    ముప్పది చెప్పెదను వినుము, మూర్ఖుండిలలో
    చెప్పినదె యొప్పు వారికి
    తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా.


    చెప్పెద నాలకింపుమది క్షేమము గోరి వచింతు నియ్యదిన్
    ముప్పును దెచ్చు నంటి కడు మూర్ఖుల తో వ్యవ హారమందు, నీ
    కెప్పుడు వాగ్వివాదమది యింపును గూర్చగలేదు వారితో
    తప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా.

    రిప్లయితొలగించండి
  4. ముప్పు ఘటిల్లు తప్పకను మూర్ఖులు దుష్టులు గద్దె నెక్కినన్
    ఎప్పటి కప్పుడున్ ధనము నెంతయొ వారలు దోచి దాచినన్
    చిప్పయు చేతికిచ్చినను చెప్పగ వద్దుగ వారిచేష్టలన్
    తప్పును దప్పుగా నెఱిగి తప్పని పల్కుట తప్పెయౌ గదా

    రిప్లయితొలగించండి
  5. తప్పగు సీతను దెచ్చుట
    తప్పక విడనాడకున్నఁ దప్పౌననుచున్
    జెప్పెను విభీషణుండే
    తప్పునుఁ దప్పే యనంగఁ దప్పగును గదా

    తప్పగు సీతనిచ్చటకు ధర్మము నెంచక తెచ్చియుంచుటే
    తప్పగు శత్రు శక్తిని వితర్కము సేయక సాగిపోవుటే
    విప్పితి డెందమున్ గుజను వీడమటంచు విభీషణుండనెన్
    దప్పునుఁ దప్పుగా నెఱిఁగి తప్పని పల్కుట తప్పెయౌఁ గదా

    రిప్లయితొలగించండి