24, ఏప్రిల్ 2026, శుక్రవారం

సమస్య - 5449

25-4-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల”
(లేదా...)
“తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా”

10 కామెంట్‌లు:

  1. సుఖములెల్ల విడిచితిమి సుతుల యొక్క
    సేమము కొరకయి యనుచు జెప్పగ , దమ
    తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల ,
    యింతగ నుడివి మాకేమియిచ్చిరనుచు

    రిప్లయితొలగించండి

  2. చదువొకటె చూపు నరులకు సత్పథమని
    పుస్తకపు పురుగు వలెను భువిని చెలగ
    వలయు నంచు నజశ్రము పలుకు నట్టి
    తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల.


    అనిశము నీతి సూత్రముల నాపక చెప్పుచు తల్లి దండ్రులే
    వినయము విజ్ఞతన్ విడక పెద్దల మాటల నాలకించుచున్
    ఘనునిగ పేరు గాంచగను కాలము వ్యర్థము చేయ వద్దనన్
    తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా.

    రిప్లయితొలగించండి
  3. తల్లి దండ్రుల నమ్మని తనయులనుచు
    వెదకిన లభింత్రు కొందరు విశ్వమందు;
    వారు కని నదిలో పారవైచిన యెడఁ
    దల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల

    వినయముతో మెలంగు పలు బిడ్డలు నమ్మరె తల్లిదండ్రులన్?
    గనుగొన వచ్చులోకమున కాదనకుందురు వారిమాటలే!
    కని నదిలోకి నెట్టిరని కష్టములన్ భరియించు వారలౌ
    తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా

    రిప్లయితొలగించండి
  4. తేటగీతి
    కష్టమన్నదెపుడు తమకిష్టమటుల
    సంతు సేమమ్మునెంచుచు సాగెదరన
    తమను నొప్పింపనొప్పక శ్రమనుదాచ
    తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల!

    చంపకమాల
    అనయము సంతు సేమమును నార్తిగ నెంచుచు కష్టమందునన్
    దనియుచు నిష్టమన్నటుల దాచెదరన్నదెఱింగి, పెద్దలై
    యనుభవమైనయున్ నలత హాయిగ నుంటిమటంచుఁ బల్కినన్
    దనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా!

    రిప్లయితొలగించండి
  5. పరమ పూజ్యులు కోరరు ప్రతిఫలమ్ము
    తమసుఖమ్ముల మరచెడు త్యాగధనులు
    జీవితాంతము తనయుల క్షేమమరయు
    తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల

    రిప్లయితొలగించండి
  6. అనిశము కన్నబిడ్డలకు నాదరమొప్పఁగ జేసి సేవలన్
    తనువుల సౌఖ్యమున్ మరచి దైన్యమునున్ వెతలన్ భరించుచున్
    తనయుల మేలుగోరు తలిదండ్రులు, వారల త్యాగమెంచకన్
    తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా!

    రిప్లయితొలగించండి
  7. చం॥ కనుమయ నేఁడు మోహమునఁ గాంక్షల మత్తున స్వంత సౌఖ్యమే
    మనమునఁ దాల్చి సంతునకు మక్కువఁ దీర్చెడు స్ఫూర్తి తగ్గఁగన్
    జనఁగను నామ మాత్రముగ శ్రద్ధను గాంచుచు మూర్ఖ చిత్తులై
    తనయులు నమ్మరెన్నడును దల్లినిఁ దండ్రిని న్యాయమేకదా!

    (అక్కడక్కడ దురదృష్ట వశాత్తు జరుగుతున్న చింతించదగ్గ విషయమండి)

    రిప్లయితొలగించండి
  8. తే.గీ:తల్లి దండ్రులు కోపమ్ము దాల్చి నంత
    ప్రేమ లేదని బిడ్డకు విసుగు కలుగు
    సుంత జ్ఞానమ్ము గలిగిన సుతులు తప్ప
    తల్లిదండ్రుల నమ్మరు తనయులెల్ల”
    (తల్లిదండ్రులు కోప్పడ గానే పిల్లలు తమ మీద ప్రేమ లే దనుకుంటారు.కాస్త జ్ఞానం ఉన్న కొడుకు తప్ప అందరు కొడుకులూ ఆ సమయం లో మాత్రం తల్లిదండ్రులని నమ్మరు. )

    రిప్లయితొలగించండి
  9. చం:తనయుల ముందె దంపతులు తన్నుక జచ్చుచు, స్వార్థమూర్తులై
    మనముల నిండ నీర్ష్య గల మాటల నెల్లర గూర్చి పల్కుచున్
    ఘన మగు ధర్మ బోధలను, గాధల జెప్పుచు నున్న సుంతయున్
    తనయులు నమ్మరెన్నఁడును దల్లినిఁ దండ్రిని న్యాయమే కదా!
    (వాళ్లు తప్పుడు మార్గం లో ఉండి కొడుకులకి ధర్మం చెపితే నమ్ముతారా!)

    రిప్లయితొలగించండి
  10. కనునకు రెప్పరీతిగను కాచుచు పిల్లల వారి వృద్ధికై
    అనిషము పాటులన్ పడుచు హాయి నెరుంగక తల్లి దండ్రులా
    ధనమును దార వోసెదరు దాచక సుంతయు మూఢ చిత్తులౌ
    తనయులు నమ్మరెన్నడును దల్లిని దండ్రిని న్యాయమే కదా

    రిప్లయితొలగించండి