26, జూన్ 2026, శుక్రవారం

సమస్య - 5510

27-6-2026 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఈశ్వరి పెండ్లాడె బ్రహ్మ నీప్సితమొప్పన్”
(లేదా...)
“ఈశ్వరి పెండ్లియాడెఁ దన యీప్సితమొప్పఁగ బ్రహ్మదేవునిన్”

8 కామెంట్‌లు:

  1. కందం
    ఈశ్వరుని సతిగ పార్వతి
    యీశ్వరియననొప్పు లక్ష్మి యీశ్వరియగున
    య్యీశ్వరిగ విద్యలకు వా
    గీశ్వరి పెండ్లాడె బ్రహ్మ నీప్సితమొప్పన్

    ఉత్పలమాల
    ఈశ్వర పత్నిగన్ నగజనీశ్వరియందురు లోకరక్షణన్
    విశ్వపు పోషణన్ హరికి విత్తముగూర్చెడు లక్ష్మి యొప్పెడున్
    విశ్వమునందునన్ సకలవిద్యల రాణిగ పేరుపొంది వా
    గీశ్వరి పెండ్లియాడెఁ దన యీప్సితమొప్పఁగ బ్రహ్మదేవునిన్

    రిప్లయితొలగించండి
  2. ఈశ్వరుని వలచి , వానిని
    ఈశ్వరి పెండ్లాడె ; బ్రహ్మ నీప్సితమొప్పన్
    విశ్వముకు సృష్టి నిడునను
    విశ్వాసముతో నతనిని పెండిలి యాడెన్

    రిప్లయితొలగించండి

  3. విశ్వేశప్రియ కారిణి
    విశ్వ విభావరి భగవతి వేదాగ్రణి యౌ
    విశ్వారాధ్య యయిన వా
    గీశ్వరి పెండ్లాడె బ్రహ్మ నీప్సితమొప్పన్.


    అశ్విని యాలకించుమిది హంసయె వాహన మై చరించెడిన్
    విశ్వమనోజ్ఞ మూర్తియని విద్యల తల్లి యటంచు కొల్చెడిన్
    శాశ్వతగా నుతించబడు శారద శాబ్ధియు శుక్ల యైన వా
    గీశ్వరి పెండ్లియాడెఁ దన యీప్సితమొప్పఁగ బ్రహ్మదేవునిన్.

    రిప్లయితొలగించండి
  4. ఈశ్వరి పెళ్ళి చేసుకొనె నీశుని మిక్కిలి సంబరంబుగన్
    ఈశ్వర పెండ్లి యాడె దనయిష్టము తోడను విష్ణుమూర్తినిన్
    విశ్వము నందునన్ సకల విద్యలొసంగెడు తల్లియైన వా
    గీశ్వరి పెండ్లియాడె దన యీప్సిత మొప్పగ బ్రహ్మదేవునిన్

    రిప్లయితొలగించండి
  5. విశ్వముపైగల సృష్టికి
    శాశ్వత విజ్ఞానమొసగఁ సరసిజ విభుడౌ
    విశ్వాత్మ సృజింపగ వా
    గీశ్వరి పెండ్లాడె బ్రహ్మ నీప్సితమొప్పన్

    విశ్వము పైన సృష్టి కడు వింతగ తోచెను వేల్పుమిన్నకున్
    శాశ్వతమైన జ్ఞానమును సర్వజనాళి కొసంగు కోపునన్
    విశ్వజనోద్ధరుండు విధి విద్దెల తల్లిని సృష్టిసేయ వా
    గీశ్వరి పెండ్లియాడెఁ దన యీప్సితమొప్పఁగ బ్రహ్మదేవునిన్

    రిప్లయితొలగించండి
  6. ఈశ్వరుని పత్ని పార్వతి,
    విశ్వంభరు పత్ని లక్ష్మి, విశ్వసృజుండౌ
    విశ్వాత్ముని సతియగు వా
    గీశ్వరి పెండ్లాడె బ్రహ్మ నీప్సితమొప్పన్

    రిప్లయితొలగించండి
  7. ఈశ్వరు పత్ని శైలసుత యీశ్వరిగా గణుతిన్ వహించె నీ
    విశ్వము నిల్పు దైవమగు విష్ణువు పత్ని వృషాకపాయియే,
    విశ్వసృజుండు వాక్పతియె వేడుకగా సృజియించినట్టి వా
    గీశ్వరి పెండ్లియాడెఁ దన యీప్సితమొప్పఁగ బ్రహ్మదేవునిన్

    రిప్లయితొలగించండి
  8. అందరూ వాగీశ్వరి అని వ్రాయడం చూసానండి. అందువలన మార్చి
    క్రమాలంకరములో వ్రాస్తున్నానండి

    ఉ॥ శాశ్వతుఁడావిధిన్ దపము సల్పుచు నుండఁగ భంగపర్చఁగన్
    విశ్వసనీయ మారుఁడటు, వేడుచుఁ బార్వతి కోర మైకొనన్
    విశ్వము సృష్టిఁ జేయుటకు విష్ణువు పూన్చెఁ గదా యనుజ్ఞతో
    నీశ్వరి పెండ్లియాడెఁ దన యిప్సితమొప్పఁగ, బ్రహ్మదేవునిన్


    శాశ్వతుడు శివుడు మైకొను సమ్మతించు (నిఘంటువు సహాయం)
    (మొదటి 2 పాదాలకు ఒక సమాధానము 3వ పాదానికి ఒక సమాధానముగా వ్రాసానండి. కాళిదాసు కుమారసంభవము 6వ సర్గము ప్రారంభంలో పార్వతి శివునకు తన తండ్రిని అడిగమని అభ్యర్థిస్తుందండి)

    రిప్లయితొలగించండి