18, జూన్ 2026, గురువారం

సమస్య - 5502

19-6-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ”

(లేదా...)

“కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా”

5 కామెంట్‌లు:

  1. ఊసులు జెప్పు కొనుటకై
    లేసుగ పలికెడు పదములు రేగుచు నుండన్
    నాసిరకముగ నగుపడెడి
    బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ”

    రిప్లయితొలగించండి
  2. (ఒక కన్నడ భాషాభిమాని తన మిత్రునితో...)
    సుందరమైన కన్నడము సూడఁగఁ బాతది తెల్గు కంటె; నే
    డిందరుఁ బల్కుమాట యది యేదనఁ గస్తురి కన్నడమ్మె; నీ
    కెందుకు సందియమ్ము? వినుటెందుకు వారల వీరి మాటలన్?
    గొందరు భాషలందుఁ దెలుఁగున్ ఘనమందురు - నమ్మబోకుమా!

    రిప్లయితొలగించండి

  3. కాసుల కొరకై వరుణా
    వాసమ్మును దాటి పోవు వైధేయుడు సా
    వాసికి తా జెప్పె నిటుల
    బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ.


    అందరి వోలె మోజుపడి అత్యధికమ్ముగ ప్రాతి భావ్యమున్
    బొందెడి కౌతికమ్మున సముద్రము దాటి విదేశ మేగెడిన్
    మందుడొకండు వాగెనట మద్యము గ్రోలుచు స్నేహి తో నిటుల్
    కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా.

    రిప్లయితొలగించండి
  4. కందం
    మా సము లెవ్వరు లేరని
    మీసముఁ ద్రిప్పుచు పలికె తమిళుడుగరువమై
    గాసిల తెలుగులు గూసెను
    "బాసలలోఁ దెలుఁగు ఘనమ వట్టిదె సుమ్మీ!"

    ఉత్పలమాల
    ముందుగ పుట్టెనే ముదము పొందగ మా తమిళంపు భాష మీ
    రెందున గొప్పవారనుచు నీర్ష్య మదాంధుడుమీరు గర్వమై
    కుందఁగఁ దెల్గువారలిలఁ గూసెను నోటికి వచ్చురీతిగన్
    కొందరు బాసలందుఁ దెలుఁగున్ ఘనమందురు నమ్మఁబోకుమా!

    రిప్లయితొలగించండి
  5. బాస నెరుంగక యందురు
    బాసలలో తెలుగు ఘనము వట్టిదె సుమ్మీ
    మీసము దువ్వుచు చెపుమా
    బాసలలో మేటియైన భాషనతెలుగే!

    రిప్లయితొలగించండి