4, జూన్ 2026, గురువారం

సమస్య - 5488

5-6-2026 (శుక్రవారం)

కవిమిత్రులారా,

ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

“ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్”

(లేదా...)

“పార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్”

(బందరు దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

21 కామెంట్‌లు:

  1. కందం
    కమనీయంపు పగటి వే
    షమర్ధనారీశ్వరునిగఁ జక్కగఁ బరదా
    నిముషమొకవైపుఁ గప్పగ
    నుమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్

    ఉత్పలమాల
    పర్వపు వేళలన్ బగలు వాసిగ వేషము వేసి నేర్పుతో
    సర్వ పురాణ గాథల ప్రజాళికి బంచెడు సంప్రదాయమై
    శర్వుని మోమునన్ సగము శాంకరిఁ జూపెడు వల్వ త్రిప్పుటన్
    బార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్

    రిప్లయితొలగించండి
  2. ప్రమథా‌ధిపతి వివాహపు
    తమియగు కథనంత వినిన దరిమిల యడుగన్
    తెమలుచు పల్కినది వినగ
    ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్

    రిప్లయితొలగించండి

  3. నిమిషము లాయెను యుగములు
    భ్రమరాలకపు చలనమున ప్రకృతి సొగపులం
    దమలిన శృంగారమ్మున
    ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్


    రిప్లయితొలగించండి
  4. హిమగిరి తనయకు తనదే
    హములో సగమిచ్చి యుండె హైముండు నెఱిన్
    తమరిటుల పలుకఁ దగునా
    ఉమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్

    పార్వతి దేహమున్ శివుని బంధము లొక్కటిగా దృశించవా
    సర్వ జగత్తుకున్ దెలియు శాంభవి సాంబున కర్ధ భాగమే
    కర్వరియున్ శివుండనుచు కబ్బపునేతరి వేరు సేయగా
    పార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్

    రిప్లయితొలగించండి
  5. హిమగిరిసుత మానసమున
    ప్రమథాధిపుడుండు నెపుఁడు పశుపతి మదిలో
    నుమయుండుగాదె నివ్విధి
    యుమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్

    రిప్లయితొలగించండి
  6. శర్వుఁడు శైలపుత్రియగు శాంకరి యిర్వురిదొక్క దేహమై
    సర్వజగంబు లేలుబడి సల్పగ భక్తుల మానసంబులన్
    పార్వతి శర్వులిర్వురిలొ పల్లటమే గనరాక తోచెడిన్
    పార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'ఇద్దరిలొ' అని లో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు

      తొలగించండి
  7. కం:ఉమ నెడమను, శివుని కుడిని
    నమరిచి నే నర్థనారి యను జిత్రము గీ
    య, మరలె తావులు , పటమున
    నుమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్
    (భార్యాభర్తలలో భార్య ఎడమ ప్రక్కన భర్త కుడి ప్రక్కన అనేది సంప్రదాయం.బొమ్మ గీసే టప్పుడు ఒకరి స్థానం లో మరొకరు వచ్చారు.)

    రిప్లయితొలగించండి
  8. ఉ॥ సర్వము విశ్వమంతయును స్థావర మీశునకంచు వేదముల్
    నిర్వచనమ్మొనర్ప నిల నిక్కము నమ్మరటంచు మానవుల్
    నేర్వఁగ దైవమొక్కరని నెమ్మిని సంశయ మెల్ల తొల్గఁగన్
    బార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కం॥ సమమని గౌరీశంకరు
      లమరిక మనుజులకుఁ దెలుప నాలి విలువలన్
      గమనీయముగాఁ గనఁగా
      నుమ శంకరుఁడయ్యె శూలి యుమగా మారెన్

      (ఈమధ్య చిన్న పద్యాలు అరుదుగా వ్రాస్తున్నానని వ్రాసానండి)

      గౌరీశంకరులు + అమరిక అండి

      తొలగించండి
  9. ఉ:పార్వతినిన్ శివున్ గలిపి బాగుగ గీయగ నర్థనారినిన్,
    "సర్వము పూర్తి యయ్యె" నన, శంభుని మీసము పార్వతమ్మకున్,
    పార్వతి మీననేత్రములు భర్గుని మోమున వచ్చె నివ్విధిన్
    పార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్
    (అర్థనారీశ్వరుని బొమ్మ గీయ బోయి పొరబాటున శివుని మీసాలని పార్వతికి పెట్టాడు. మీనాక్షి యైన పార్వతి కంటి సౌందర్యాన్ని శివునికి పెట్టాడు. )

    రిప్లయితొలగించండి
  10. కమనీయముగా జరిగిన
    సుమనోహర పరిణయమున సురుచిరముగ మే
    ను, మనస్సుల నిండుకొనుచు
    *నుమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్*

    పర్వమునందు బొమ్మలను బద్ధతిగాఁ గొలువుంచి యొక్కరున్
    గర్వముఁ బూని యందఱినిఁ గన్నులఁ గాంచుడటంచుఁ బిల్వగాఁ
    బూర్వము, నింద్రజాలకుఁడు మొత్తముగానొక మాయ సేయ, నా
    *పార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ “జయ్యనన్”*

    రిప్లయితొలగించండి
  11. వాట్సాపులో సమీక్షించిన కవిమిత్రుల పద్యాలను ఇక్కడ సమీక్షించడం లేదు. గమనించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి
  12. తమకమ్మున నొకపరి జం
    గమయ్య పరిహాస మాడెఁ గైలాసమునం
    గ్రమముగఁ బ్రణయక్రీడల
    నుమ శంకరుఁ డయ్యె శూలి యుమగా మారెన్


    సర్వ జగత్ప్రజావలికి సంశయ హీనము తల్లిదండ్రులే
    నుర్వి నుమా మహేశ్వరులహో యొక దేహము దాల్చి రింపుగా
    శర్వుని యర్థ భాగమును శాంకరి వొందఁగఁ జూచు వారికిం
    బార్వతి యయ్యె శంకరుఁడు పార్వతి శంకరుఁ డయ్యెఁ జయ్యనన్

    రిప్లయితొలగించండి
  13. ఉమ వేష ధారి శూలిగ
    క్రమ మొ ప్పగ శివుడు మారె కాత్యాయిని గా
    సుమధుర నాటక మందున
    నుమ శంకరు డ య్యె శూలి యమ గా మారెన్

    రిప్లయితొలగించండి

  14. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    కమనీయ వేషమందున
    ఉమ శంకరుల ముఖములను నొకరే చూపెన్
    నిమిష నిమిషమునకు మారుచు
    నుమ శంకరుడయ్యె యుమగా మారెన్.

    రిప్లయితొలగించండి