4, డిసెంబర్ 2012, మంగళవారం

శ్రీ లక్ష్మీ స్తవము

శ్రీ లక్ష్మీ స్తవము
రచన
పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు

ఓం నమామి శుభయోగ దాయినీం
ఐం నమామి విజయాం జయప్రదామ్|
హ్రీం నమామి సురబృంద సేవితాం
శ్రీం నమామి సరసీరుహాలయామ్||


జయ జయ! వేద సంస్తుత! ప్రసన్నముఖాంబురుహా! శుభాస్పదా!
జయ జయ! లోకమాత! సురసన్నుత! విష్ణు హృదబ్జవాసినీ!
జయ జయ! శీతలాంశు సహజాత! సుధాంబుధి కన్యకా! రమా!
జయ జయ! ఇందిరా జనని! సర్వ సుఖప్రద! శాంతభూషణా!


శ్రీవిష్ణు హృత్కమల వాసిని! విశ్వమాతా!
శ్రీవాసుదేవ కరుణామృత పానలోలా!
దేవేశి! భక్తవరదా! త్రిదశప్రపూజ్యా!
దేవీ! శుభేక్షణ! ప్రమోదిని! నిన్ను గొల్తున్.


నీ వీక్షణల్ శుభదముల్ నిగమాంత వేద్యా!
వేవెల్గులన్ జగములన్ విలసిల్లజేయున్
నా విన్నపమ్ము వినుమా నను బ్రోవుమమ్మా!
దీవింపుమా శుభమతీ! దివిజప్రపూజ్యా!


ఆనందరూప కలితా! హరిణీ! పురాణీ!
జ్ఞానార్ణవాన్వయ మణీ! సదయాంతరంగా!
దీనార్తి నాశిని! క్షమాది గుణప్రపూర్ణా!
ధ్యానింతు నీదు పదపద్మములన్ మహేశీ!


కమలా! కమలదళాక్షీ!
కమలాసన ముఖ్య దేవ గణ సద్వంద్యా!
కమలాక్ష హృదయవాసిని!
కమలాలయ నీదు చరణ కమలము గొల్తున్


పరితోషమ్మును గూర్చుచు
హరి కరుణామృతము నొంది యనవరతమ్మున్
సిరులు గురియు నీ చూడ్కులు
వరలక్ష్మీ దేవి! మాకు వరదము లగుతన్


త్రిభువన పాలకుడగు శ్రీ
విభునికి పులకలను గొలుపు ప్రేమమయములౌ
శుభవీక్షణములు సంపద్
విభవ ప్రదములగు గాక విమలా! మాకున్.


శ్రీ విభు పాదములొత్తుచు
సేవాభాగ్యమ్ము వలన చెలువొందెడు శ్రీ
దేవీ! మా విన్నపమున
కీవే సంసిద్ధి శ్రీమహేశీ! మాతా!


నీ ముఖమ్ము నుండి ప్రేమతో వెలువడు
చుండు మందహాస సుమము లెపుడు
మమ్ము బ్రోచు గాక మంగళ దేవతా!
పాలకడలి పట్టి! శ్రీలతాంగి!


గాన మొనరింతు నీ దివ్య గాధ లెపుడు
పాన మొనరింతు నీ కృపా పాయసమ్ము
ధ్యాన మొనరింతు నీదు తత్త్వ ప్రశస్తి
దీన జన పోషిణీ నమస్తే శుభాంగి!


సేవింతు నీదు పదముల్ శ్రితపారిజాతా!
భావింతు నీదు గుణ వైభవముల్ కృపాబ్ధీ!
కావింతు నీ భజనముల్ కమలాయతాక్షీ!
దీవింపుమా నను రమా! త్రిజగత్ ప్రపూజ్యా!


శ్రీమహాలక్ష్మి! వరలక్ష్మి! సిద్ధలక్ష్మి!
మోక్షలక్ష్మి! విద్యాలక్ష్మి! ముఖ్య వివిధ
నామరూప సంశోభితా! ప్రేమ హృదయ!
నీ కటాక్షంబు మాకగు నిత్య రక్ష!


వందే హిరణ్మయీం లక్ష్మీం
వందే విష్ణు మనోహరీమ్|
వందే వందారు మందారం
వందే చంద్ర సహోదరీమ్||


వందే సంపత్ప్రదాం దేవీం
వందే దారిద్ర్య నాశినీమ్|
వందే సకల లోకేశీం
వందే మంగళ దేవతామ్||


((శ్రీ చింతా రామకృష్ణారావు గారి ‘ఆంధ్రామృతం’ బ్లాగునుండి ధన్యవాదాలతో)

సమస్యా పూరణం - 896 (దురద కందకు లేదు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
దురద కందకు లేదు కత్తులకు హెచ్చె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

పద్య రచన - 180

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

3, డిసెంబర్ 2012, సోమవారం

భారతీ కటాక్షము

భారతీ కటాక్ష లబ్ధ కవిత్వ యోగము

నిలిచితి భక్తి భావమున నేను శుభోదయ వేళ భారతిన్
దలచి నమస్కరించుచును తద్విభవమ్ములు మన్మనమ్ములో
నలరుచు దర్శనంబొసగ హర్ష పయోనిధిపైని దేలుచున్
గొలుచుచు మానసార్చన నిగూఢ విధానమునందు తత్కృపా
ఫలముగ నాదు డెందమున భావ పరంపర లుప్పతిల్లుచున్
గలగల పారు నేరువలె క్రన్నన నాదు ముఖమ్మునుండి వే
వెలుగుల జిమ్ముచున్ దగు వివేక వికాసముతోడ దివ్య సూ
క్తుల కనురూప వైభవముతో రసపుష్టిని సంతరించుచున్
వెలువడె స్తోత్రరాజములు పెక్కగు ఛందములందు పద్య రా
శులు మది వేడ్కగూర్చు పలు సొంపులు నింపులు నింపుచున్ బళా!
లలిత పదప్రశస్తి, సరళంబగు శైలి దనర్చు చంపకో
త్పలముల మాలికల్, ద్విపద, పాదప, స్రగ్ధర, సీస, కంద, గీ
తులు మొదలైన రీతులును తోటక, పృథ్వి, సుగంధు లొప్పుగా
పలికిన పల్కులన్నియును పద్యము లైనవి యేమిచెప్పుదున్?
మలచితి కావ్య రత్నముగ మంచి ముహూర్తమునన్ సరస్వతీ
లలిత పదాబ్జ సన్నిధి నలంకరణమ్ముగ జేసి మ్రొక్కితిన్
బులకితమయ్యె నా తనువు పొంగెను డెందము సంతసమ్ముతో
నలరె రసజ్ఞులౌ బుధులు, నాప్తులు గూర్చ ప్రశంస లొప్పుగా
దలచుచు మాటిమాటికినితల్లి యనుగ్రహ వైభవమ్ము ని
స్తుల బహు యోగదాయియని చొక్కి రచించితి దివ్య లీలలన్

పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సమస్యా పూరణం - 895 (పలికిన పల్కు లన్నియును)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
పలికిన పల్కు లన్నియును పద్యము లైనవి యేమి చెప్పుదున్?
(ఆకాశవాణి సౌజన్యంతో)

పద్య రచన - 179

అయ్యప్ప పడిపూజ 
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

2, డిసెంబర్ 2012, ఆదివారం

సమస్యా పూరణం - 894 (గ్రహణకాలమ్మునఁ దినిన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గ్రహణకాలమ్మునఁ దినినఁ గలుఁగు మేలు. 

పద్య రచన - 178

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

1, డిసెంబర్ 2012, శనివారం

సమస్యా పూరణం - 893 (కోడిం దినె కోమటయ్య)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కోడిం దినె కోమటయ్య కోరిక తీరన్.
(ప్రసిద్ధమైన సమస్యే)

పద్య రచన - 177

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.